Super Star Krishna: మీసాల కృష్ణుడి ‘సాక్షి’గా..

ABN , First Publish Date - 2022-11-16T04:29:19+05:30 IST

కృష్ణ, విజయనిర్మల పెళ్లి అచ్చంగా సినీ ఫక్కీలోనే జరిగింది.

Super Star Krishna: మీసాల కృష్ణుడి ‘సాక్షి’గా..

విజయనిర్మలతో తొలుత సినిమా వివాహం తర్వాత వారిద్దరికీ తిరుపతిలో నిజంగా పెళ్లి

కృష్ణ, విజయనిర్మల పెళ్లి అచ్చంగా సినీ ఫక్కీలోనే జరిగింది. వీళ్ల ప్రేమ పెళ్లిలో సినిమా కథకి కావల్సినన్ని ట్విస్టులు, టర్న్‌లూ ఉన్నాయనిపిస్తుంది. వారిద్దరి మధ్య స్నేహానికి, ప్రేమానుబంధాలకు బీజం వేసిన సినిమా ‘సాక్షి’. బాపు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం కృష్ణ, విజయ నిర్మల కెరీర్‌కు మైలు రాయిగా నిలిచింది. వారిద్దరి వ్యక్తిగత జీవితాలనూ మలుపు తిప్పింది. ‘సాక్షి’కి ముందు కృష్ణ - విజయ నిర్మల ఇద్దరికీ ముఖ పరిచయమే లేదు. ‘సాక్షి’ ఆఫీసులో అడుగుపెడుతున్న కృష్ణను తొలిసారి అద్దాల్లోంచి చూసిన విజయనిర్మల.. ‘ఈ అబ్బాయెవడో బాగున్నాడు’ అనుకున్నారట. తీరా చూస్తే.. తనే ఆ సినిమాలో హీరో అని తెలుసుకొని ఆశ్చర్యపోవడం ఆమె వంతైంది. అందం, సిగ్గు, బిడియం కలబోసిన కృష్ణ వ్యక్తిత్వాన్ని చూసి.. ఆయన్ను ఆరాధించడం మొదలెట్టారు విజయ నిర్మల. క్రమంగా వీరి స్నేహం బలపడుతూ వచ్చింది. ‘సాక్షి’లో వీరిద్దరి పెళ్లి సన్నివేశాన్ని తూర్పుగోదావరి జిల్లా పులిదిండి గ్రామంలోని మీసాల కృష్ణుడి ఆలయంలో తెరకెక్కించారు. ఆ సమయంలో హాస్యనటుడు రాజబాబు.. ‘ఈ స్వామి చాలా మహిమాన్వితుడు. కాబట్టి మీకు నిజంగానే పెళ్లయిపోతుంది’ అని చమత్కరించారు.

కానీ అప్పటికే, కృష్ణకు ఇందిరాదేవితో పెళ్లయిపోయింది. విజయ నిర్మల కూడా ఒకరి ఇల్లాలే. కాకపోతే.. విజయ నిర్మల సినిమాల్లోకి రావడం భర్తకు ఇష్టం లేదు. కాబట్టి.. ఇద్దరూ దూరంగా ఉంటూ వచ్చారు. ‘సాక్షి’ పెద్ద విజయాన్ని అందుకోవడంతో కృష్ణ-విజయ నిర్మలతో సినిమాలు చేయడానికి నిర్మాతలు ముందుకొచ్చారు. ఇద్దరూ కలిసి రెండు మూడు సినిమాలు చేశాక మరింత దగ్గరైపోయారు. చివరికి విజయ నిర్మలను పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన.. కృష్ణకు వచ్చింది. మధ్యవర్తిగా అప్పుడు కృష్ణకు అత్యంత సన్నిహితుడైన చంద్రమోహన్‌ కనిపించారు. ‘కృష్ణ మిమ్మల్ని పెళ్లి చేసుకుంటారట.. మీ ఉద్దేశం ఏమిటి’ అంటూ కబురు మోసుకెళ్లారు చంద్రమోహన్‌. ‘పెళ్లి చేసుకొనే ఉద్దేశం ఉంటే ఆయన్నే అడగమనండి’ అని సమాధానమిచ్చారు విజయ నిర్మల. దాంతో కృష్ణే స్వయంగా విజయ నిర్మల దగ్గరకు వెళ్లి.. పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చారు. అలా.. ఇద్దరూ పెళ్లికి సిద్ధమయ్యారు. కానీ, ఇద్దరూ అప్పటికే వివాహితులు. వారిది రెండో పెళ్లి కాబట్టి రహస్యంగా చేయాలి. ఆ బాధ్యత చంద్రమోహన్‌ భుజాన వేసుకొన్నారు.

వీరిద్దరి పెళ్లికి ఆయనే పెద్ద. కృష్ణ, విజయ నిర్మల, చంద్రమోహన్‌లతో పాటు ఒకరిద్దరు రహస్యంగా తిరుపతి ప్రయాణమయ్యారు. అక్కడే కృష్ణ, విజయ నిర్మల పెళ్లి అయిపోయింది. ఈ విషయాన్ని చంద్రమోహన్‌ చాలా రహస్యంగా ఉంచాలన్నా వీలు కాలేదు. మెల్లగా అందరికీ తెలిసిపోయింది. అప్పటికే.. కృష్ణ - విజయ నిర్మల కలిసి నటిస్తున్న చిత్రాలు కొన్ని సెట్స్‌పై ఉన్నాయి. వాటిలో సి.ఎస్‌.రావు దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా కూడా ఉంది. అప్పటికి.. ఆ సినిమాకి టైటిల్‌ ఏం పెట్టలేదు. కృష్ణ - విజయ నిర్మల పెళ్లి చేసుకొన్నారని తెలియగానే ఆ సినిమాకి ‘మళ్లీ పెళ్లి’ అనే పేరు ఖరారు చేసేశారు. అయితే, తనకు పెళ్లయిన విషయాన్ని కృష్ణ భార్య ఇందిరకు చెప్పేశారు. ఆ మాట వినగానే ఆమె షాక్‌కు గురైనా.. ఆయన మనసు అర్థం చేసుకున్న వ్యక్తి కావడంతో పెద్దగా ప్రతిఘటించలేదట. కృష్ణ, విజయ నిర్మలకు సంతానం లేరు.

విజయ నిర్మల 50.. జయప్రద 45

ఓ హీరో, హీరోయిన్‌ కలిసి నాలుగైదు సినిమాలు చేస్తే చాలు.. సూపర్‌ హిట్‌ కాంబో అయిపోతుంది. అలాంటిది.. ఒకే హీరోయిన్‌తో 50 సినిమాలు చేస్తే...? ఆ జంటని ఏమనాలి? ఆ అరుదైన రికార్డు కృష్ణ - విజయ నిర్మల సొంతమైంది. నిజ జీవితంలోనే కాదు, వెండి తెరపైనా అరుదైన జంటగా గుర్తింపు పొందారు కృష్ణ విజయ నిర్మల. ‘సాక్షి’తో మొదలైన ఈ ‘జంట’ ప్రయాణం దాదాపు రెండు దశాబ్దాలల పాటు కొనసాగుతూనే ఉంది. 1970లో కృష్ణ 15 చిత్రాల్లో నటిస్తే, అందులో 11 చిత్రాల్లో విజయ నిర్మల కథానాయిక కావడం విశేషం. ‘అల్లూరి సీతారామరాజు’ తరవాత కృష్ణ నటించిన 17 చిత్రాలు వరుసగా పరాజయం పాలయ్యాయి. ఆ దశలో కృష్ణని మళ్లీ ట్రాక్‌ ఎక్కించిన సినిమా ‘పాడి పంటలు’. ఇందులోనూ విజయ నిర్మలే కథానాయిక.

విజయ నిర్మల తరవాత కృష్ణతో ఎక్కువ చిత్రాల్లో జోడీ కట్టిన ఘనత జయప్రదకు దక్కుతుంది. వీరిద్దరి కాంబినేషన్‌లో 45 చిత్రాలొచ్చాయి. వాటిలో ‘సింహాసనం’, ‘శ్రీ రాజేశ్వరి విలాస్‌ కాఫీ క్లబ్‌ లాంటి సూపర్‌ హిట్లున్నాయి. కృష్ణ - జయప్రద జంట అనగానే.. ‘ఇదిగో తెల్ల చీర..’ పాట గుర్తొస్తుంది. ‘ఊరికి మొనగాడు’లోని ఈ పాట చూడ్డానికి జనం మళ్లీ మళ్లీ థియేటర్లకు వెళ్లేవారు. శ్రీదేవితో 31 చిత్రాల్లో నటించారు కృష్ణ. ఆయన నిర్మించిన ‘హిమ్మత్‌వాలా’తోనే బాలీవుడ్‌లో స్థిరపడ్డారు శ్రీదేవి. కృష్ణ - రాధ కాంబోలో... 23 చిత్రాలొచ్చాయి. వాణిశ్రీతో 19, జయసుధ తో 12, జమునతో 12 చిత్రాల్లో నటించారు. 365 చిత్రాల్లో దాదాపు 70 మంది కథానాయికలతో జోడీ కట్టారు కృష్ణ. తెలుగు నాట ఈ రికార్డ్‌ ఎప్పటికీ శాశ్వతంగా మిగిలిపోతుందనడంలో సందేహం లేదు.

Updated Date - 2022-11-16T09:41:58+05:30 IST