Share News

Dehydration Prevention : ఎండ నుంచి అండ

ABN , Publish Date - Mar 25 , 2025 | 02:37 AM

వేసవిలో ఎండ నుంచి ఉపశమనాన్ని అందించే ఆహారాలు మరియు శీతల పానీయాలు ఆరోగ్యానికి చాలా అవసరం. డీహైడ్రేషన్‌ను నివారించేందుకు కీరా, మజ్జిగ, రాగి జావ, కొబ్బరినీళ్లు, పండ్లరసాలు వంటివి తీసుకోవాలి. పిల్లలు, పెద్దలు అందరూ సరిపడా నీళ్లు తాగుతూ, ఆరోగ్యకరమైన ఆహార నియమాలను పాటించాలి.

Dehydration Prevention : ఎండ నుంచి  అండ

వేసవి ఆహారం

ఎండ తీవ్రత రోజు రోజుకూ పెరిగిపోతోంది. ఇలాంటి వేడి వాతావరణంలో ఎవరు ఎలాంటి ఆహారం తీసుకోవాలో, ఎండదెబ్బకూ, డీహైడ్రేషన్‌కూ గురి కాకుండా ఉండడం కోసం ఎలాంటి ఆహారనియమాలు పాటించాలో వైద్యులు వివరిస్తున్నారు.

వేసవిలో ఎండ వేడి నుంచి ఉపశమనాన్ని అందించే చల్లని పదార్థాల కోసం గాలిస్తూ ఉంటాం. కానీ ఐస్‌క్రీమ్‌ ఇష్టంగా తింటాం తప్ప అంతకంటే మెరుగ్గా శరీరాన్ని చల్లబరిచే కీరా జోలికి వెళ్లం. దాహార్తిని తీర్చడంతో పాటు లవణాలను భర్తీ చేసే కొబ్బరినీళ్లకు బదులుగా ఫ్రీజర్‌లో చల్లబరిచిన శీతల పానీయాలను ఆబగా తాగేస్తూ ఉంటాం. నిజానికి శరీరంలో నీటి శాతాన్ని భర్తీ చేసి, డీహైడ్రేషన్‌ నుంచి రక్షణనిచ్చే ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలు కూడా మన చుట్టూరా ఎన్నో ఉన్నాయి. దాహార్తిని తీర్చే మజ్జిగ, రాగి జావ, పండ్ల రసాలు, కొబ్బరినీళ్లతో పాటు చలువ చేసే పెరుగు, కూరగాయలు, ఆకుకూరలు కూడా మనకు అందుబాటులో ఉంటున్నాయి. అయితే వేసవి ఎండకూ, వేడికీ బహిర్గతమయ్యే తీవ్రతలు పరిస్థితులను బట్టి మారుతూ ఉంటాయి. ఇంటిపట్టున ఉండే వారు, బడికెళ్లే పిల్లలు, ఎక్కువగా ప్రయాణాలు చేసేవారు ఈ కాలంలో భిన్నమైన ఆహార నియమాలను పాటించాల్సి ఉంటుంది.


ఇంటిపట్టున ఉంటే...

ఇంటిపట్టున ఉన్నంత మాత్రాన ఎండ ప్రభావం నుంచి తప్పించుకున్నాం అనుకోడానికి వీల్లేదు. ఇంట్లో ఉన్నప్పటికీ సాయంత్రానికి నీరసించిపోతుంటే, నీరు ఎక్కువగా ఉండే పుచ్చ, దోస, తర్బూజ లాంటి పండ్లు తింటూ ఉండాలి. తరచూ నీళ్లు తాగుతూ డీహైడ్రేషన్‌కు గురి కాకుండా చూసుకోవాలి. వంటల్లో కారం, ఉప్పు, మసాలాలు బాగా తగ్గించాలి. సలాడ్స్‌, కూరగాయలు, ఆకుకూరలు, పెరుగు, తేలికగా అరిగే వీలున్న పదార్థాలు తీసుకోవాలి. మాంసాహారం తగ్గించాలి. నీరు ఎక్కువగా ఉండే బీరకాయలు, సొరకాయలు, పొట్లకాయలు లాంటివి ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. కీరా, క్యారట్‌, లెట్యూ్‌సలతో సలాడ్స్‌ చేసుకుని తింటూ ఉండాలి. అలాగే కొబ్బరినీళ్లు, పండ్లరసాలు, మజ్జిగ తరచూ తీసుకోవచ్చు. టీ, కాఫీలు తగ్గించి, హెర్బల్‌ టీ తీసుకోవాలి. ఉదయం అల్పాహారంలో కూడా నూనెలో వేయించిన పూరీలు, వడలకు బదులుగా ఇడ్లీలు, ఓట్స్‌ పోరిడ్జ్‌ లాంటివి తీసుకోవాలి. చికెన్‌, చేపలు తక్కువ మసాలాలతో వండుకుని తీసుకోవచ్చు.


GFXDJKNG.jpg

బడికెళ్లే పిల్లల కోసం...

ఈ కాలంలో పిల్లలు కూల్‌డ్రింక్స్‌, ఐస్‌క్రీమ్స్‌ తినడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. కానీ వీటి తయారీలో ఉపయోగించే కలుషిత నీళ్లు, పాలపదార్థాలు, కృత్రిమ రంగుల వల్ల పిల్లల్లో టాన్సిల్స్‌, గొంతు ఇన్‌ఫెక్షన్లు వచ్చే అవకాశాలుంటాయి. కాబట్టి ఇంట్లో తయారుచేసి ఫ్రూట్‌ సలాడ్స్‌, కస్టర్డ్‌, పాయసం లాంటివి ఇవ్వాలి. చక్కెర కలపని పండ్ల రసాలు ఇవ్వాలి. సాధారణంగా పిల్లలు దాహాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. డీహైడ్రేషన్‌కు గురైనా దాని గురించి పిల్లలకు అవగాహన లేక నీరసించిపోతూ ఉంటారు. కాబట్టి పెద్దలు అప్రమత్తంగా వ్యవహరిస్తూ, పిల్లలు సరిపడా నీళ్లు తాగేలా చూసుకోవాలి. అలాగే లంచ్‌ బాక్సుల్లో తప్పనిసరిగా సలాడ్స్‌, పండ్ల ముక్కలు, పెరుగు పెడుతూ ఉండాలి. ఇంట్లో రస్నా, కృత్రిమ పండ్లరసాలకు బదులుగా నిమ్మరసం, కొబ్బరినీళ్లు, మజ్జిగ, సబ్జా లాంటివి పిల్లలకు అలవాటు చేయాలి. పిల్లలు తరచూ స్నాక్స్‌లో భాగంగా ఉప్పని చిప్స్‌ తింటూ ఉంటారు. ఇలాంటి వాటి వల్ల శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుంది. కాబట్టి పిల్లలకు వీటిని అందుబాటులో ఉంచకూడదు. ఈ కాలంలో పిల్లలకు జీర్ణసమస్యలు రాకుండా, ఎలకొ్ట్రలైట్స్‌ సంతులనం కోసం మామిడి, పుచ్చ, తర్బూజా లాంటి తాజా పండ్లు, సలాడ్స్‌ తినిపించాలి.


ఎండకు ఎక్కువగా బహిర్గతమయ్యేవారు...

మార్కెటింగ్‌ వృత్తిలో ఉన్నవారు, ఎక్కువగా ప్రయాణాలు చేసే వారు తప్పనిసరిగా నీళ్లు, మజ్జిగ, నిమ్మరసం వెంట తీసుకువెళ్లాలి. ఇంటిపట్టున ఉండేవారు రోజుకు 8 నుంచి 10 గ్లాసుల నీళ్లు తీసుకుంటే సరిపోతుంది. కానీ ఎక్కువగా బయట తిరిగేవాళ్లు అంతకంటే ఎక్కువ నీళ్లు తాగాలి. బయటి ఆహారం బాగా తగ్గించి, ఇంటి ఆహారానికే ప్రాథాన్యం ఇవ్వాలి. బయట తిరిగేవాళ్లు ఎప్పుడు డీహైడ్రేషన్‌కు గురవుతారో, ఎప్పుడు ఎండదెబ్బ బారిన పడతారో చెప్పలేం. కాబట్టి బయటకు వెళ్లే ముందు, బయటకు వెళ్లిన ప్రతి గంటకూ నీళ్లు తాగుతూనే ఉండాలి.

ఈ జాగ్రత్తలు తప్పనిసరి

  • కూల్‌ డ్రింక్స్‌ మానేయాలి

  • కారం, మసాలాలతో తయారైన పదార్థాలు మానేయాలి

  • చక్కెర డీహైడ్రేషన్‌కు గురి చేస్తుంది కాబట్టి తీయగా ఉండే పానీయాలు మానేయాలి

  • ఉప్పు ఎక్కువగా ఉండే చిప్స్‌, ఊరగాయలు, వడియాలు లాంటివి మానేయాలి

  • మాంసాహారం తగ్గించి, కూరగాయలు, ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి

  • తక్షణ శక్తి కోసం బత్తాయి రసం, నిమ్మరసం తాగాలి

  • ఎండదెబ్బ నుంచి రక్షణ కోసం ఆమ్‌ పన్నా తాగుతూ ఉండాలి.

    తయారీ కోసం...

పచ్చి మామిడి కాయ: 1

పుదీనా ఆకులు: 3 టేబుల్‌స్పూన్లు

యాలకుల పొడి: అర టీస్పూను

మిరియాల పొడి: అర టీస్పూను

చక్కెర: పావు టీస్పూను

జీలకర్ర పొడి: అర టీస్పూను

ఉప్పు: రుచికి సరిపడా


తయారీ ఇలా: మామిడి కాయకు నీళ్లు జోడించి కాయ మెత్తబడేవరకూ ఉడికించాలి. తర్వాత నీళ్లను తొలగించి, తొక్కు, విత్తనం వేరు చేసి, గుజ్జును మెత్తగా రుబ్బుకోవాలి. ఈ గుజ్జుకు పైన చెప్పిన దినుసులన్నీ కలిపి ఆమ్‌ పన్నాను సిద్ధం చేసుకోవాలి. ఈ మిశ్రమానికి నీళ్లు కలిపి, ఫ్రిజ్‌లో ఒక గంట పాటు చల్లబరుచుకుని తాగితే, వేసవి నుంచి ఉపశమనం, ఎండ వేడి నుంచి రక్షణ దక్కుతుంది.

ఫ్రిజ్‌లో చల్లబరిచిన గడ్డ కట్టేంత చల్లని నీళ్లు తాగడం సరి కాదు. బయటి వాతావరణం వేడిగా ఉన్నప్పుడు అత్యంత చల్లని నీళ్లు తాగడం శరీరానికి హానికరం. కాబట్టి ఫ్రిజ్‌ నీళ్లు సాధారణ గది ఉష్ణోగ్రతకు చేరుకున్న తర్వాత తాగాలి. చల్లదనం కోసం కుండలో నీళ్లు తాగొచ్చు.

- డాక్టర్‌ సుజాత స్టీఫెన్‌

క్లినికల్‌ న్యూట్రిషనిస్ట్‌,

యశోద హాస్పిటల్స్‌,

మలక్‌ పేట, హైదరాబాద్‌


ఇవి కూడా చదవండి..

MS Dhoni: ఐపీఎల్ బాగానే ఉంది.. మరింత మసాలా అవసరం లేదు: ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌పై ధోనీ స్పందన


Harbhajan Singh: నల్ల ట్యాక్సీ అంటూ ఆర్చర్‌పై వివాదస్పద వ్యాఖ్యలు.. హర్భజన్‌పై తీవ్ర ఆగ్రహం


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Mar 25 , 2025 | 03:28 AM