Conquer IBS with Effective Solutions: పొట్టలో గడబిడ ఎందుకు
ABN , Publish Date - Mar 25 , 2025 | 03:26 AM
పొట్టలో గడబిడ, విరోచనాలు, మలబద్ధకం వంటి లక్షణాలు ఐబిఎస్ (ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్) కు సంబంధించి ఉంటాయి. ఈ సమస్యలు ఎక్కువగా మానసిక ఒత్తిడి, ఆందోళన, కుంగుబాట్లు వల్ల ఏర్పడతాయి. వైద్యులు ఈ సమస్యను నిర్థారించడానికి కొలనోస్కోపీ, మలపరీక్షలు మరియు ఇతర పరిశీలనల ద్వారా చికిత్సలు సూచిస్తున్నారు.

మానసిక ఒత్తిడి, ఆందోళన, కుంగుబాటు లాంటి భావోద్వేగాలు కొందర్లో జీర్ణ వ్యవస్థను ప్రభావితం చేస్తాయి. ఈ సమస్య విరోచనాల రూపంలో ఉండవచ్చు, మలబద్ధకం వేధించవచ్చు. లేదా రెండూ కలిసి ఉండొచ్చు. ఇర్రిటబుల్ బోవెల్ సిండ్రోమ్ (ఐబిఎ్‌స)గా పేర్కొనే ఈ సమస్యతో ఎలా వ్యవహరించాలో, ఈ అసౌకర్యం నుంచి ఎలా విముక్తి పొందాలో వైద్యులు వివరిస్తున్నారు.
ఐబిఎస్
‘కొలనోస్కోపీ’ ద్వారా పెద్దపేగులో పాలిప్స్, క్యాన్సర్లు కూడా లేవని నిర్థారించుకుని, ఆ తర్వాతే ఐబిఎస్ ఉన్నట్టు నిర్థారించాల్సి ఉంటుంది.
కొందరు పరీక్షకు లేదా ఇంటర్వ్యూకు ముందు పొట్టలో అసౌకర్యానికి లోనవుతారు. ఇంకొందరు వృత్తి జీవితంలో ఎదుర్కొనే పని ఒత్తిడి వల్ల విరోచనాలతో బాధపడుతూ ఉంటారు. ఇంకొందరు మానసిక కుంగుబాటుకు గురైనప్పుడు డయేరియాతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాగని ఈ సమస్యలున్న వాళ్లందరికీ ఐబిఎస్ ఉండాలనే నియమమేమీ లేదు. కానీ మానసిక భావోద్వేగాలకూ ఐబిఎ్‌సకూ సంబంధం ఉండే వీలుంది. మరీ ముఖ్యంగా కుంగుబాటు, యాంగ్జయిటీ న్యూరోసి్‌సతో బాధపడేవారిలో ఐబిఎస్ తలెత్తే అవకాశాలు ఎక్కువ. అయితే మెదడులో ఆలోచనలు జీర్ణ వ్యవస్థను ప్రభావితం చేయడమన్నది కాస్త విచిత్రంగానే అనిపించవచ్చు. కానీ మెదడుకూ, పేగులకూ దగ్గరి సంబంధం ఉంటుంది. మెదడులో ఒత్తిడి పెరిగినప్పుడు నాడీ వ్యవస్థ, పేగుల్లోని కదలికలను ప్రేరేపిస్తుంది. లేదా పేగుల్లో కదలికలను తగ్గించేస్తుంది.
ఫలితంగా విరోచనాలు లేదా మలబద్ధకం వేధిస్తాయి. కొందర్లో పేగుల కదలికలే నొప్పి రూపంలో బయల్పడే అవకాశం కూడా ఉంటుంది. ఇలా ఐబిఎస్... విరోచనాలు, మలబద్ధకం, నొప్పి రూపాల్లో బయటపడుతూ ఉంటుంది. కొందరికి విరోచనాలు, మలబద్ధకం కలిసి ఉండే అవకాశాలు కూడా ఉంటాయి. వీళ్లలో కొన్ని రోజులు వరుసగా విరోచనాలు వేధిస్తే, ఇంకొన్ని రోజులు మలబద్ధకం వేధిస్తుంది. ఇలా ప్రస్తుతం 20% నుంచి 30% పట్టణ జనాభా ఐబిఎస్‌తో బాధపడుతోంది.
నిర్థారణ ఇలా...
ఆరోగ్యపరంగా ఎలాంటి సమస్యలూ లేవని నిర్థారించుకున్న తర్వాతే లక్షణాలను బట్టి ఐబిఎ్‌సను నిర్థారించాలి. కానీ ఐబిఎ్‌సతో సంబంధం లేని జీర్ణవ్యవస్థ సమస్యలను ఇదే కోవలోకి తోసేస్తున్న పరిస్థితులు తాజాగా పెరుగుతున్నాయి. మన ఆహారపుటలవాట్ల వల్ల కూడా విరోచనాలు, మలబద్ధకం సమస్యల వేధించవచ్చు. మరీ ముఖ్యంగా నేటి యువతలో బయటి ఆహారం ఎక్కువగా తినడం, తీసుకునే ఆహారంలో మార్పుల వల్ల, సరిపడా పీచు లోపించడంవల్ల మల విసర్జన అసంపూర్తిగా జరుగుతూ పదే పదే కాలకృత్యాలు తీర్చుకునే అవసరం పడుతూ ఉండవచ్చు. లేదా రోజుల తరబడి మలబద్ధకం కూడా వేధిస్తూ ఉండవచ్చు. కొందరికి పొట్టలో ఇన్‌ఫెక్షన్స్ వల్ల విరోచనాలు వేధించవచ్చు. కానీ ఇవేవీ ఐబిఎస్ కోవలోకి రావు. అలాంటప్పుడు ఐబిఎస్ నిర్థారించడానికి వైద్యులు కొన్ని నియమాలు పాటిస్తారు. అవేంటంటే...
45 ఏళ్లు పైబడిన వాళ్లలో:
వీరిలో మొదటిసారి ఈ లక్షణాలు కనిపిస్తే, ఆ సమస్యను ఐబిఎ్‌సగా నిర్థారించడం సరి కాదు. వారంలో మూడు రోజుల పాటు కడుపు నొప్పితో పాటు, వరుసగా విరోచనాలు లేదా మలబద్ధకం వేధించడం లేదా రెండూ కలిసి ఉండడం (కొన్ని రోజులు విరోచనాలు, కొన్ని రోజులు మలబద్ధకం) ఉంటే ఐబిఎ్‌సగా అనుమానించాలి. అలాగే మలంలో రక్తం ఉందా? బరువు తగ్గుతున్నారా? థైరాయిడ్, మధుమేహం అదుపు తప్పాయా? అన్నది కూడా గమనించాలి. అన్నీ సరిగానే ఉన్నట్లయితే, ‘కొలనోస్కోపీ’ ద్వారా పెద్దపేగులో పాలిప్స్, క్యాన్సర్లు కూడా లేవని నిర్థారించుకుని, ఆ తర్వాతే ఐబిఎస్ ఉన్నట్టు నిర్థారించాల్సి ఉంటుంది.
45 ఏళ్ల లోపు వారిలో:
మధుమేహం, థైరాయిడ్ సమస్యలు లేవని నిర్థారించుకోవాలి. లక్షణాలు తీవ్రంగా ఉండి, రక్తహీనత, బలహీనతలు వేధిస్తుంటే ఐబిఎ్‌సగా నిర్థారించుకోవచ్చు. వీరికి కొలనోస్కోపీ అవసరం ఉండదు. అయితే ఇప్పటి యువతలో అస్తవ్యస్థ ఆహారపుటలవాట్ల మూలంగా ‘ఇన్‌ఫ్లమేటరీ బోవెల్ డిసీజ్’ పెరుగుతోంది. పేగులో వాపు లేదా పూత ఉన్నప్పుడు ఫీకల్ కాలప్రొటెక్టిన్ అనే ప్రొటీన్ మలంలో ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి ఈ పరిస్థితిని నిర్థారించుకోవడం కోసం మలపరీక్ష చేయవలసి ఉంటుంది. ఈ పరీక్షలో ప్రొటీన్ కనిపించినప్పుడు కొలనోస్కోపీ చేయక తప్పదు. ఇలా ఇతరత్రా కారణాలన్నిటినీ పరిశీలించిన తర్వాతే అంతిమంగా ఐబిఎ్‌సగా నిర్థారించుకోవాలి.
లక్షణాల ఆధారంగానే చికిత్స
ఐబిఎస్‌లో విరోచనాలు, మలబద్ధకం ప్రధాన లక్షణాలు కాబట్టి వాటి మీదే చికిత్సా విధానం ఆధారపడి ఉంటుంది. మానసిక ఒత్తిడి, ఆందోళన, కుంగుబాటు లాంటి మనసుతో ముడిపడిన సమస్యలకు చికిత్స తీసుకుంటూనే, అదనంగా ఐబిఎస్‌కు మందులు వాడుకోవాల్సి ఉంటుంది. మలబద్ధకం ఉన్న వారు ఆహారంలో పీచు పెంచుకోవడం కోసం తాజా పండ్లు, కూరగాయల మోతాదును పెంచాలి. అలాగే అదే తరహా సప్లిమెంట్లు కూడా వాడుకోవాల్సి ఉంటుంది. అలాగే కొందరి పేగులు కొన్ని పిండిపదార్థాలను శోషించుకోలేవు. దాంతో ఆ పదార్థాలు పేగుల్లో కుళ్లిపోతూ కడుపుబ్బరం, ఇతరత్రా జీర్ణసమస్యలను పెంచుతాయి. కాబట్టి ఆ పిండిపదార్థాలు కలిగిన పదార్థాలను మానుకుని, అవి లేని ఆహారాన్ని ఎంచుకోవలసిన అవసరం ఉంటుంది. ఇంకొందరికి లాక్టోజ్ ఇంటాలరెన్స్ వల్ల జీర్ణ సమస్యలు వేధిస్తాయి. కాబట్టి పాల ఉత్పత్తులను మానుకోవడం ద్వారా ఐబిఎస్ లక్షణాలను అదుపు చేసుకోవచ్చు. అలాగే ఒత్తిడి, మానసిక కుంగుబాట్లను తగ్గించుకోవడం కోసం క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ ఉండాలి. అలాగే కడుపు నొప్పి ఉన్నవారికి కొన్ని మందులను కూడా వైద్యులు సూచిస్తారు. అలాగే డయేరియాకు కూడా మందులు వాడుకోవలసి ఉంటుంది. మానసిక సమస్యలు తీవ్రతను బట్టి మానసిక నిపుణులను కూడా సంప్రదించాల్సి ఉంటుంది.
ఐబిఎస్‌ను నిర్థారించే... ‘రోమ్ 4 ప్రమాణాలు’
ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్ జీర్ణాశయ సమస్యను కచ్చితంగా నిర్థారించడం కోసం, యునైటెడ్ స్టేట్స్, నార్త్ కరలైనా, రాలీలో ఉన్న రోమ్ ఫౌండేషన్ అనే సంస్థ, ‘రోమ్ 4 ప్రమాణాలను’ నిర్దేశించింది. వీటినే ప్రపంచవ్యాప్త వైద్యులందరూ అనుసరిస్తూ ఉంటారు. ఈ సంస్థ సూచించిన మార్గదర్శకాలు ఏవంటే...
పెద్దల్లో...
ఆరు నెలల పాటు పొట్టలో నొప్పితో పాటు, కనీసం మూడు నెలలుగా వారంలో కనీసం ఒక రోజు ఈ క్రింది వాటిలో ఒకటి లేదా రెండు లక్షణాలతో ఆ నొప్పి ముడిపడి ఉండాలి.
మలవిసర్జన
మలవిసర్జన ఎక్కువ/తక్కువ
మలం రూపం మారుతూ ఉండడం
పిల్లల్లో...
నెలలో కనీసం నాలుగు రోజులు కడుపునొప్పి వేధిస్తూ, ఈ పరిస్థితి రెండు నెలలుగా కొనసాగుతూ, ఈ కింది లక్షణాలతో ముడిపడి ఉండాలి.
మలవిసర్జన
మలవిసర్జన ఎక్కువ/తక్కువ
మలం రూపం మారుతూ ఉండడం.
-డాక్టర్ కె. సోమశేఖర రావు
సీనియర్ కన్సల్టెంట్,
గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ అండ్
హెపటాలజిస్ట్,
యశోద హాస్పిటల్స్, హైటెక్ సిటీ,
హైదరాబాద్
ఈ వార్తలు కూడా చదవండి
TDP MP: విడదల రజినికి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కౌంటర్
High Court Orders: బోరుగడ్డపై పోలీసుల పిటిషన్.. హైకోర్టు కీలక ఆదేశాలు
Good News: ఏపీ ఉద్యోగులకు పండుగలాంటి వార్త
Read Latest AP News And Telugu News