సేవకు ప్రతిరూపమే చేతనా ఫౌండేషన్: సాయిసుధ పాలడుగు
ABN , First Publish Date - 2022-08-30T03:39:45+05:30 IST
వాషింగ్టన్ డీసీలో జీడబ్ల్యూటీసీఎస్, చేతనా ఫౌండేషన్ సంయుక్తంగా ఆగస్టు 28న నిధుల సేకరణ, యోగా కార్యక్రమం నిర్వహించారు.

వాషింగ్టన్ డీసీలో(Washington DC) జీడబ్ల్యూటీసీఎస్, చేతనా ఫౌండేషన్ సంయుక్తంగా ఆగస్టు 28న నిధుల సేకరణ, యోగా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం అధ్యక్షులు సాయి సుధ మాట్లాడుతూ.. చేతనా, జీడబ్ల్యూటీసీఎస్ సంయుక్తంగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారని చెప్పారు. దేశంలో అనేక ప్రాంతాల్లో పేద విద్యార్థినీ విద్యార్థులకు చేతనా ఫౌండేషన్ ద్వారా ల్యాప్ ట్యాప్‌లతో పాటు స్కాలర్ షిప్‌లు కూడా అందజేస్తున్నారన్నారు. కరోనా సమయంలో పేదలకు ఉచితంగా మందులు, వ్యాక్సినేషన్ లాంటివి అందించారని పేర్కొన్నారు. శీతాకాలంలో చలి నుంచి కాపాడేందుకు కావాల్సిన సామాగ్రిని అమెరికాలో నిరాశ్రయులైన పేదలకు(హోమ్ లెస్) అందజేసామన్నారు. పేద విద్యార్థినీ విద్యార్థులకు పుస్తకాలు, ఇతర పాఠశాల సామాగ్రిని అందజేశామని తెలిపారు. ప్రతి నెలా పేదలకు ఆహార సామాగ్రిని, నిత్యావసర వస్తువులను పంపిణీ చేశామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో టీడీఎఫ్ అధ్యక్షులు కవిత చల్లా, సత్యనారాయణ మన్నె, భాను మాగులూరి, నరేన్ కొడాలి, నాగ్ నెల్లూరి, అనిల్ ఉప్పలపాటి, రవి అడుసుమల్లి, సత్య సూరపనేని, రమాకాంత్ కోయ, ధూళిపాళ్ల వీరనారాయణ, సుశాంత్ మన్నె, బబిత సుఖవాసి, రీటా పట్నాయక్, చరిత తమ్మారెడ్డి, లక్ష్మి నన్నపనేని, యూత్ వాలంటీర్లు తేజ్ మండవ, అక్షర మండవ, సరయు దారపనేని, రోషన్ మొహంతితో పాటు ప్రవాసాంధ్రులు పెద్దఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముందు యోగా, ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించే కార్యక్రమాలను నిర్వహించారు.

మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ.. ‘‘తోటి మనిషి కష్టాన్ని గుర్తించలేనప్పుడు మానవత్వానికి, మనిషితనానికి, మంచితనానికి అర్థం లేదు. జీవితానికి పరమార్థం లేదు. సేవలోనే ఆధ్యాత్మికతకు పరిపూర్ణత చేకూరుతుంది. నలుగురి కోసం అన్న భావన మనిషి స్వభావంలో ఒక భాగం కావాలి’’ అని పేర్కొన్నారు. చేతనా, జీడబ్ల్యూటీసీఎస్ చేస్తున్న సామాజిక సేవల్ని కొనియాడారు. చేతనా ఫౌండేషన్ ప్రతినిధి శ్రీలత నార్ల మాట్లాడుతూ.. ఉభయులం కలిసి మరిన్ని సేవా కార్యక్రమాలు విస్తృత పరస్తున్నామన్నారు. ‘‘ఉదారంగా పేదలకు ఉన్నత విద్యను అందించేందుకు మా సంస్థలు ప్రాధాన్యత ఇస్తున్నాయి. పేదలకు వివిధ రూపాల్లో సహాయ కార్యక్రమాలను అందిస్తున్నాం’’ అని పేర్కొన్నారు.

