IPL Auction 2023: వేలంలో పెద్ద ఆటగాళ్లకు షాక్.. అమ్ముడుపోక బిత్తర చూపులు!
ABN , First Publish Date - 2022-12-27T19:24:45+05:30 IST
ఇటీవల జరిగిన ఐపీఎల్ మినీ వేలం(IPL Mini Auction)లో 80 మంది ఆటగాళ్లను 10 ఫ్రాంచైజీలు కొనుగోలు చేశాయి.
కొచ్చి: ఇటీవల జరిగిన ఐపీఎల్ మినీ వేలం(IPL Mini Auction)లో 80 మంది ఆటగాళ్లను 10 ఫ్రాంచైజీలు కొనుగోలు చేశాయి. ఇందుకోసం మొత్తంగా రూ.1.67 కోట్లు వెచ్చించాయి. కొందరు ఆటగాళ్ల కోసం రికార్డు స్థాయిలో వెచ్చించిన ఫ్రాంచైజీలు ఆశ్చర్యకరంగా కొందరు పెద్ద ఆటగాళ్ల ముఖం చూడ్డానికి కూడా ఇష్టపడలేదు. దీనికి బోల్డన్ని కారణాలు ఉన్నాయి. అలాంటి ఐదుగురు ఆటగాళ్లు వీరే..
డేవిడ్ మలాన్ (ఇంగ్లండ్)
ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో ఒకప్పుడు నంబర్ 1 ర్యాంకర్ అయిన డేవిడ్ మలాన్ (Dawid Malan) ఈసారి వేలంలో అన్‌సోల్డ్‌గా మిగిలిపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఇంగ్లండ్ టాప్ ఆర్డర్‌లో కీలక ఆటగాడు కూడా. ‘హండ్రెడ్’ (100 బంతుల క్రికెట్ టోర్నీ)లో 9 ఇన్నింగ్స్‌లలో 166.81 స్ట్రైక్ రేట్‌తో 377 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇంగ్లండ్ టీ20 ప్రపంచకప్ గెలవడంలోనూ ప్రముఖ పాత్ర పోషించాడు. అయితే, ఈ టోర్నీలో అతడు కొన్ని మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు.
ఐపీఎల్ మినీ వేలంలో డేవిడ్ మలాన్ అన్‌సోల్డ్‌గా మిగిలిపోవడానికి గల కారణాల్లో ఇది కూడా ఒకటి. స్పెషలిస్ట్ బ్యాటర్‌కు బదులుగా విదేశీ ఆల్‌రౌండర్లను ఫ్రాంచైజీలు కోరుకోవడం మరో కారణం.
పాల్ స్టిర్లింగ్ (ఐర్లాండ్)
అనుభవజ్ఞుడైన ఐర్లండ్ బ్యాటర్ పాల్ స్టిర్లింగ్ (Paul Stirling). ఈసారి కూడా అతడిని కొనుగోలు చేసేందుకు ఫ్రాంచైజీలు ఏవీ ఆసక్తి చూపించలేదు. ప్రపంచంలోని పెద్ద టీ20 లీగ్‌లు ఆడినప్పటికీ ఫ్రాంచైజీలను ఆకర్షించడంలో విఫలమయ్యాడు. ఈ ఓపెనర్‌ను కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. 2022లో ఫామ్ కోల్పోవడం ఇందుకు ఒక కారణం. ఏడు మ్యాచ్‌లు ఆడి అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడు అయినప్పటికీ అన్‌సోల్డ్‌గా మిగిలిపోయాడు. దీనికి తోడు స్థానికంగా అందుబాటులో ఉన్న స్పెషలిస్ట్ బ్యాటర్లవైపు ఫ్రాంచైజీలు మొగ్గు చూడడం రెండో కారణం.
బాబా ఇంద్రజీత్ (ఇండియా)
ఐపీఎల్ మినీ వేలంలో ఈసారి ఇంద్రజీత్(Baba Indrajith)ను అదృష్టం వెక్కిరించింది. మొత్తం 12 మంది వికెట్ కీపర్లు ఈ వేలంలో అమ్ముడుపోయారు. వారిలో ఏడుగురు భారతీయులే. అయినప్పటికీ తమిళనాడుకు చెందిన ఈ టాపార్డర్ బ్యాటర్‌ను ఎవరూ కొనుగోలు చేయలేదు. గత కొన్ని సంవత్సరాలుగా జట్టు తరపున ఇంద్రజీత్ పరుగుల వరద పారిస్తున్నాడు. అద్భుతమైన బ్యాటింగ్ టెక్నిక్ అతడి సొంతం. గత సీజన్‌లో కేకేఆర్‌కు ప్రాతినిధ్యం వహించిన బాబా ఇంద్రజీత్ మూడు మ్యాచుల్లో 21 పరుగులు చేశాడు. దీంతో కేకేఆర్ (KKR) అతడిని వదిలించుకుంది.
సందీప్ శర్మ (ఇండియా)
వెటరన్ బౌలర్ సందీప్ శర్మ(Sandeep Sharma)కు ఈ వేలం నిరాశను మిగిల్చింది. ఐపీఎల్‌లో మొత్తంగా 104 మ్యాచ్‌లు ఆడిన ఈ మాజీ సన్‌రైజర్స్ (SRH) సీమర్‌కు ఫ్రాంచైజీలు షాకిచ్చాయి. తనను ఎవరూ ఎందుకు కొనలేదో తనకు అర్థం కావడం లేదని సందీప్ శర్మ ఆవేదన వ్యక్తం చేశాడు. తాను ఏ జట్టు తరపున ఆడినా వందశాతం ఆడానని చెప్పుకొచ్చాడు. నిజం చెప్పాలంటే ఇలా అన్‌సోల్డ్‌గా మిగిలిపోతానని తాను అనుకోలేదన్నాడు. తప్పు ఎక్కడ జరిగిందన్న విషయం తనకు అర్థం కాలేదన్నాడు. దేశవాళీ క్రికెట్‌లోనూ బాగానే ఆడానని పేర్కొన్నాడు. రంజీ ట్రోఫీ చివరి రౌండ్‌లో ఏడు వికెట్లు తీసిన విషయాన్ని గుర్తు చేశాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలోనూ బాగానే రాణించానని వివరించాడు. అయితే, అంతమాత్రాన అతడి అవకాశాలేవీ మూసుకుపోలేదు. ఎవరైనా బౌలర్ గాయపడితే అప్పుడు రీప్లేస్‌మెంట్‌గా వెళ్లే అవకాశం మిగిలే ఉంది.
క్రిస్ జోర్డాన్ (ఇంగ్లండ్)
చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ఆల్‌రౌండర్ అయిన క్రిస్ జోర్డాన్(Chris Jordan)కు కూడా ఐపీఎల్ మినీ వేలంలో నిరాశే ఎదురైంది. వేలంలో అతడికి మంచి డిమాండ్ ఉంటుందని భావించారు. ఇంగ్లండ్ (England) జట్టు టీ20 ప్రపంచకప్ గెలవడంలోనూ కీలక పాత్ర పోషించాడు. డెత్ ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేసి ప్రత్యర్థులను కట్టడి చేశాడు. జోర్డాన్ అద్భుతమైన టీ20 ఆటగాడు. లోయర్ ఆర్డర్‌లో అద్భుతంగా బ్యాటింగ్ చేయగలడు. బ్రహ్మాండమైన క్యాచ్‌లు పట్టగలడు. 2022 సీజన్‌లో నాలుగు మ్యాచ్‌లు మాత్రమే ఆడిన క్రిస్.. రెండు వికెట్లు మాత్రమే తీశాడు. అతడి ప్రదర్శన ఆకట్టుకోకపోవడంతో ఫ్రాంచైజీ అతడిని వదిలించుకుంది.