Australia: ఆస్ట్రేలియాను బెంబేలెత్తించిన రషీద్ ఖాన్.. 4 పరుగుల తేడాతో గట్టెక్కిన కంగారూలు!
ABN , First Publish Date - 2022-11-04T17:44:12+05:30 IST
సెమీస్‌కు వెళ్లాలంటే భారీ తేడాతో విజయం సాధించాల్సిన మ్యాచ్‌లో
అడిలైడ్: సెమీస్‌కు వెళ్లాలంటే భారీ తేడాతో విజయం సాధించాల్సిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా (Australia) చావు తప్పి కన్ను లొట్టపోయిన చందంగా బయటపడింది. చివరి ఓవర్లలో విశ్వరూపం ప్రదర్శించిన ఆఫ్ఘన్ ఆటగాడు రషీద్ ఖాన్ (rashid khan) ఆసీస్ చేతుల్లోంచి విజయాన్ని దాదాపు లాగేసుకున్నంత పనిచేశాడు. మధ్యలో చకచకా వికెట్లు కోల్పోయి ఇక ఓటమి ఖాయమనుకున్న స్థాయి నుంచి పుంజుకుని ఆసీస్‌ను వణికించిన ఆప్ఘనిస్థాన్ తీరుకు క్రికెట్ అభిమానులు ఫిదా అయిపోయారు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 168 పరుగులు చేసింది. అనంతరం 169 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఆఫ్ఘనిస్థాన్ (afghanistan) 40 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయినప్పటికీ గట్టి పోటీ ఇచ్చింది. అయితే, 99 పరుగుల వద్ద ఆఫ్ఘనిస్థాన్‌కు భారీ దెబ్బ తగిలింది. 14 ఓవర్ తొలి బంతికి గుల్బాదిన్ నైబ్ (39) రనౌట్ అయ్యాడు. ఆ తర్వాతి బంతికే ఇబ్రహీం జర్దాన్ (26) అవుట్ కావడంతో ఆఫ్ఘనిస్థాన్ ఓటమి బాటలో పయనించింది. ఆ తర్వాత అదే స్కోరు వద్ద మరో వికెట్‌ను కోల్పోయింది. దీంతో ఆఫ్ఘాన్ ఓటమి ఖాయమనే అనుకున్నారు. ఆ తర్వాత 106 పరుగుల వద్ద కెప్టెన్ మహ్మద్ నబీ (1) పెవిలియన్ చేరాడు. ఇక ఆసీస్ భారీ విజయంతో గెలవడం ఖాయమని అనుకున్నారు.
సరిగ్గా అప్పుడే మ్యాజిక్ జరిగింది. స్టార్ బౌలర్ రషీద్ ఖాన్ షో మొదలైంది. క్రీజులో పాతుకుపోయిన తర్వాత ఆసీస్ బౌలర్లను ఎడాపెడా బాదుతూ పరుగుల వరద పారించాడు. ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. అతడికి అండగా నిలిచిన డార్విష్ రసూలి (15) 148 పరుగుల వద్ద అవుటైనప్పటికీ రషీద్ మాత్రం వెనక్కి తగ్గలేదు. బంతిని బాదడమే పనిగా పెట్టుకున్నాడు. దీంతో ఆసీస్ శిబిరంలో కలవరం మొదలైంది. మ్యాచ్ ఒక్కసారిగా ఆప్ఘనిస్థాన్ వైపు మళ్లింది.
చివరి ఓవర్లో ఆఫ్ఘనిస్థాన్ విజయానికి 21 పరుగులు అవసరం. రషీద్ ఖాన్ స్ట్రైకింగ్‌లో ఉన్నాడు. స్టోయినిస్ బంతి అందుకున్నాడు. తొలి బంతికి పరుగులేమీ రాలేదు. రెండో బంతికి రషీద్ ఫోర్ బాదాడు. ఇప్పుడు 4 బంతుల్లో 17 పరుగులు కావాలి. రషీద్ ఊపు మీద ఉండడంతో విజయం ఆఫ్ఘనిస్థాన్ చేతిలోనే ఉంది. మూడో బంతికి పరుగు రాలేదు. దీంతో ఆసీస్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే, నాలుగో బంతికి రషీద్ సిక్సర్ బాదాడు. ఇప్పుడు చివరి రెండు బంతులకు 11 పరుగులు అవసరం. ఐదో బంతికి రెండు పరుగులు మాత్రమే వచ్చాయి. ఆసీస్ ఊపిరి పీల్చుకుంది. ఆరో బంతికి రషీద్ ఫోర్ బాదాడు. ఆస్ట్రేలియా నాలుగు పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆస్ట్రేలియాను చివరి బంతి వరకు వణికించిన రషీద్ బ్యాటింగ్‌పై ప్రశంసలు కురుస్తున్నాయి. మొత్తంగా 23 బంతులు ఆడిన రషీద్ ఖాన్ 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 48 పరుగులు చేశాడు. టీ20ల్లో రషీద్‌కు ఇదే అత్యుత్తమ వ్యక్తిగత స్కోరు. ఆసీస్ బౌలర్లలో హేజెల్‌వుడ్, ఆడం జంపాలకు చెరో రెండు వికెట్లు లభించాయి.
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మ్యాక్స్‌వెల్ అర్ధ సెంచరీ (54) పరుగులు చేయగా, మిచెల్ మార్ష్ 45 పరుగులు చేయగా, వార్నర్, స్టోయినిస్ చెరో 25 పరుగులు చేశారు. ఆఫ్ఘనిస్థాన్ బౌలర్లలో నవీన్ ఉల్ హక్ 3, ఫజల్హక్ ఫరూకీ రెండు వికెట్లు తీసుకున్నారు. ఈ విజయంతో ఆస్ట్రేలియా 7 పాయింట్లతో రెండో స్థానానికి చేరుకున్నప్పటికీ సెమీస్ బెర్త్ ఇంకా ఖరారు కానట్టే. రేపు (శనివారం) ఇంగ్లండ్-శ్రీలంక జట్ల మధ్య జరిగే పోరులో శ్రీలంక గెలిచినా 6 పాయింట్లే వస్తాయి కాబట్టి ఆస్ట్రేలియా సెమీస్‌కు చేరుకుంటుంది. ఒకవేళ ఇంగ్లండ్ గెలిస్తే ఆ జట్టు ఖాతాలో 7 పాయింట్లు చేరుతాయి. అప్పుడు రన్‌రేట్ కీలకమవుతుంది. ఆస్ట్రేలియా రన్‌రేట్ ప్రస్తుతం మైనస్‌లలో ఉంది. ఇంగ్లండ్ రన్‌రేట్ ప్లస్‌లలో ఉంది. కాబట్టి ఇంగ్లండ్ నామమాత్రంగా గెలిచినా ఆ జట్టు సెమీస్‌కు, ఆస్ట్రేలియా ఇంటికి వెళ్తాయి. కాబట్టి ఈ శనివారం నాటి మ్యాచ్‌లో శ్రీలంక గెలవాలని ఆసీస్ అభిమానులు ప్రార్థనలు చేస్తారేమో!