బాబర్ చేతకాని కెప్టెన్.. వరల్డ్ కప్ నుంచి పాక్ ఔట్: షోయబ్ అక్తర్ ఫైర్..
ABN , First Publish Date - 2022-10-28T12:30:32+05:30 IST
టీ20 వరల్డ్ 2022లో (t20 World cup) జింబాబ్వేపై (Zimbabwe) మ్యాచ్‌లో తడబడి ఓటమిపాలైన పాకిస్తాన్ (Pakistan) ఇంటాబయటా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. టీమిండియాపై (team India) ఓటమిని పాక్ క్రికెట్ ఫ్యాన్స్ ఇంకా మరచిపోక ముందే జింబాబ్వే చేతిలో ఘోర పరాభవాన్ని మూటగట్టుకోవడాన్ని అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు.
లాహోర్: టీ20 వరల్డ్ 2022లో (t20 World cup) జింబాబ్వేపై (Zimbabwe) మ్యాచ్‌లో తడబడి ఓటమిపాలైన పాకిస్తాన్ (Pakistan) ఇంటాబయటా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. టీమిండియాపై (team India) ఓటమిని పాక్ క్రికెట్ ఫ్యాన్స్ ఇంకా మరచిపోక ముందే జింబాబ్వే చేతిలో ఘోర పరాభవాన్ని మూటగట్టుకోవడాన్ని అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆటగాళ్లపై విమర్శలు గుప్పిస్తున్నారు. తెగ ట్రోల్ చేస్తూ ఏకీపారేస్తున్నారు. క్రికెట్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా మాజీ క్రికెటర్లు సైతం పాక్ ఆటగాళ్ల ప్రదర్శనపై దుమ్మెత్తిపోస్తున్నారు. పాక్ మాజీ దిగ్గజం, క్రికెట్ లెజెండ్ షోయబ్ అక్తర్ కూడా ఈ జాబితాలో చేరాడు. ప్రతిష్టాత్మక పెర్త్ క్రికెట్ గ్రౌండ్‌లో జింబాబ్వే చేతిలో పాకిస్తాన్ ఓటమిపాలవ్వడంపై తీవ్ర నిరాశ వ్యక్తం చేశాడు. మ్యాచ్‌ను విశ్లేషించిన అక్తర్... పాక్ ఎలాంటి వ్యూహాలు లేకుండానే మైదానంలోకి దిగిందని దుయ్యబట్టాడు. కెప్టెన్ బాబర్ ఆజమ్ పనికిమాలినవాడని ఈ ఓటమి తెలియజేస్తోందని అభివర్ణించాడు.
‘‘ మన టాప్, మిడిలార్డర్ ఆటగాళ్లు జాగ్రత్తగా ఆడాలని చెబుతూనే ఉన్నాను. అలాగైతేనే విజయవంతమవ్వగలం. ఈ విషయాన్ని ఎందుకు గ్రహించలేకపోయారో నాకు అర్థం కావడం లేదు. ఇలాగైతే స్థిరంగా రాణించడం కష్టమే. పాకిస్తాన్‌కు చేతకాని కెప్టెన్ ఉన్నాడు. పాకిస్తాన్ వరల్డ్ కప్ నుంచి నిష్ర్కమించింది. నవాజ్ చివరి ఓవర్ వేసిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయాం’’ అని అక్తర్ మండిపడ్డారు. ఈ మేరకు తన యూట్యూబ్ ఛానల్‌లో ఒక వీడియోను పోస్ట్ చేశాడు.
జట్టులో మార్పులు, బాబర్ ఆజమ్ బ్యాటింగ్ ఆర్డర్ మార్పు వంటి కొన్ని సూచనలు కూడా చేశాడు. ‘‘ బాబర్ వన్‌డౌన్‌లో బ్యాటింగ్ చేయాలి. షాహిన్ షా అఫ్రిదీ ఫిటినెస్ పెద్ద ఎదురుదెబ్బ. కెప్టెన్సీ, నిర్వహణలో పెద్ద లోపాలుగా కనిపిస్తున్నాయి. మీరు తిరిగి పుంజుకోగలరు. కానీ మీరు ఏలాంటి క్రికెట్ ఆడుతున్నారు?. ప్రత్యర్థి జట్టు మిమ్మల్ని గెలవనిస్తుందనే భావనలో ఉండొద్దు.’’ అని అక్తర్ సూచనలు చేశాడు. కాగా సూపర్-12లో భాగంగా పాకిస్తాన్ తన తదుపరి మ్యాచ్‌ను నెదర్లాండ్‌పై ఆడనుంది. ఆదివారం ఈ మ్యాచ్ జరగనుంది. ఆ మ్యాచ్‌లో ఓడిపోయే జట్టు టీ20 వరల్డ్ కప్‌లో ప్లే ఆఫ్ అవకాశాలను వదులుకోవాల్సి ఉంటుంది.