Vijayashanti: మోదీ రాకను కమ్యూనిస్టులు వ్యతిరేకించడం విడ్డూరాల్లో కెల్లా విడ్డూరం
ABN , First Publish Date - 2022-11-11T12:01:53+05:30 IST
తెలంగాణకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాకను కమ్యూనిస్టులు వ్యతిరేకిస్తుండటం విడ్డూరాల్లో కెల్లా విడ్డూరంగా ఉందని బీజేపీ నేత విజయశాంతి అన్నారు.
హైదరాబాద్: తెలంగాణ (Telangana)కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra modi) రాకను కమ్యూనిస్టులు వ్యతిరేకిస్తుండటం విడ్డూరాల్లో కెల్లా విడ్డూరంగా ఉందని బీజేపీ నేత విజయశాంతి (Vijayashanti) అన్నారు. కార్మిక, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి అంటూ కమ్యూనిస్టులు పదే పదే చెప్పే ప్రగతి మార్గంలో మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం (Central government) ఎంతో పురోగతి సాధించిన విషయాన్ని వారు ముందుగా గ్రహించాలన్నారు. దేశంలో వ్యవసాయ - పారిశ్రామిక రంగాల అభివృద్ధి, ఉద్యోగ కల్పన కోసం రోజ్‌గార్ మేళాలు, ముద్ర లోన్లు, బీమా పథకాలు, స్కిల్ ఇండియా, మేకిన్ ఇండియా, శ్రమయేవ జయతే, అటల్ పెన్షన్, స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా, ఉజ్జ్వల ప్లాన్ ఇలా అన్ని వర్గాలకూ ప్రత్యేక పథకాలతో మోదీ సర్కారు విస్తృత ప్రజాదరణ సాధించిందని చెప్పారు. అధికార టీఆర్‌ఎస్ (TRS)ను రోజూ ఒకవైపు తిడుతూనే మొన్నటి మునుగోడు ఉపఎన్నిక (Munugodu by poll)లో ఎర్రజెండా వదిలేసి గుడ్డిగా గులాబీ జెండా పట్టుకున్న కమ్యూనిస్టులు.. తెలంగాణలో తమ కార్యకర్తల విశ్వాసాన్ని కూడా కోల్పోతున్నారని మండిపడ్డారు. ఇప్పుడు రాష్ట్రంలోకి ప్రధాని రాకను వ్యతిరేకించడం ద్వారా కమ్యూనిస్టులు వారి విలువను మరింతగా తగ్గించుకుంటున్నారన్నారు. కార్మికులు, చిరు వ్యాపారులు, చిన్న పరిశ్రమలకు ఊతమిచ్చే పథకాలతో విస్తృత ప్రజాదరణ పొందిన ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనను నిరసించే ఈ కమ్యూనిస్టుల తదుపరి అడుగు టీఆర్‌ఎస్‌తో కలిసి కనుమరుగైపోయేందుకే అని స్పష్టంగా తెలుస్తోందని విజయశాంతి అన్నారు.