33 నెలలుగా జీతం ఇవ్వట్లే!

ABN , First Publish Date - 2022-12-02T05:12:34+05:30 IST

హైదరాబాద్‌, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): ఓ గని (క్వారీ)లో జరుగుతున్న పరిణామాల గురించి సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద వివరాలివ్వడం ఆ మహిళా ఉద్యోగికి కష్టాలు తెచ్చిపెట్టింది. ఫలితంగా తాను పనిచేస్తున్న శాఖ నుంచే ఆమె ఏడేళ్లుగా తీవ్ర వేధింపులు ఎదుర్కొంటున్నారు. వాటిని

33 నెలలుగా జీతం ఇవ్వట్లే!

వీఆర్‌ఎస్‌ అడిగినా ఇవ్వడం లేదు..

ఏడేళ్లుగా మహిళా ఉద్యోగికి తీవ్ర వేధింపులు..

ఆర్టీఐ కింద వివరాలివ్వడమే ఆమె చేసిన నేరం

కక్ష పెంచుకొని శాఖాధిపతి వేధింపులు

సీఎం దృష్టికి తీసుకెళ్లిన బాధితురాలు

ఫలితంగా అంతర్గత విచారణ..

వేధింపులు వాస్తవం అని నిర్ధారణ

అయినా ఆమెపై కొత్త ఆరోపణలు తెరపైకి

33 నెలలుగా జీతం అందని దైన్యం.. హైకోర్టుకు వెళ్లిన బాధితురాలు

ఏడేళ్లుగా న్యాయం కోసం ఎదురు చూపు

హైదరాబాద్‌, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): ఓ గని (క్వారీ)లో జరుగుతున్న పరిణామాల గురించి సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద వివరాలివ్వడం ఆ మహిళా ఉద్యోగికి కష్టాలు తెచ్చిపెట్టింది. ఫలితంగా తాను పనిచేస్తున్న శాఖ నుంచే ఆమె ఏడేళ్లుగా తీవ్ర వేధింపులు ఎదుర్కొంటున్నారు. వాటిని భరించలేక స్వచ్ఛంద ఉద్యోగ విరమణ (వీఆర్‌ఎ్‌స)కు దరఖాస్తు చేసుకున్నా ఆ ఫైలును ఆమోదించడం లేదు. పైగా గత 33 నెలలుగా ఆమెకు జీతమూ ఇవ్వడం లేదు. విషయం మీడియా ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టికి వెళ్లినా.. న్యాయం కోసం బాదితురాలు మహిళా కమిషన్‌ను ఆశ్రయించినా న్యాయం దక్కలేదు తనకు న్యాయం చేయాలంటూ సదరు మహిళా ఉద్యోగి చేస్తున్న పోరాటాన్ని తొక్కిపెట్టేందుకు బాధితురాలిపై కొత్త ఆరోపణలు పుట్టించారు! ఫలితంగా ఆమె దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ఆ ఉద్యోగినిపై ఆ శాఖకు చెందిన చీఫ్‌ కక్షగట్టారని, ఫలితంగా ఆమెకు న్యాయం జరగడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. ఒక శాఖలో విధులు నిర్వహిస్తున్న ఆ మహిళా ఉద్యోగి 2013లో పదోన్నతిపై భద్రాచలం నుంచి నిజామాబాద్‌ సర్కిల్‌ కార్యాలయానికి సూపరింటెండెంట్‌గా వెళ్లారు. అక్కడ మేనేజర్‌గా పనిచేస్తున్న అధికారి ఉద్యోగ విరమణ చేయడంతో ఇన్‌చార్జి మేనేజర్‌ బాధ్యతల కోసం సదరు మహిళా ఉద్యోగి, మరో ఉద్యోగి పోటీపడ్డారు. మరో ఉద్యోగి మీద అవినీతి కేసు ఉండటంతో ఇన్‌చార్జి మేనేజర్‌ బాధ్యతలను మహిళా ఉద్యోగికే కట్టబెట్టారు. ఆమె ఆ ఉద్యోగ బాధ్యతల్లో ఉండగా కొందరు తెలంగాణ ఉద్యమకారులు ఆర్టీఐ కింద నిజామాబాద్‌ జిల్లా మామిడిపల్లి క్వారీకి సంబంధించిన సమాచారాన్ని అడిగారు. ఆమె నిబంధనల ప్రకారం ఆ సర్కిల్‌ హెడ్‌ అనుమతి తీసుకుని సంబంధిత సమాచారాన్ని ఇచ్చారు. దాని ఆధారంగానే వారు హైకోర్టులో పిటిషన్‌ వేశారు. లోకాయుక్తలోనూ కేసు ఫైల్‌ చేశారు. ఈ పరిణామంపై అప్పట్లో ఉన్న ఆ శాఖాధిపతి, నాడు ఆ శాఖకు అదనపు విజిలెన్స్‌ చీఫ్‌గా ఉన్న అధికారి ఈ అంశంపైనే ఆమెపై కోపం పెంచుకున్నారన్నది బహిరంగ రహస్యం. ఈ వ్యవహారాన్ని మనుసులో పెట్టుకొని సదరు మహిళా అధికారిని ఇన్‌చార్జి మేనేజర్‌ పోస్టు నుంచి తొలగించారు. ఆ బాధ్యతలను అవినీతి కేసు కారణంగా పక్కనబెట్టిన మరో ఉద్యోగికి అప్పగించారు. అప్పటి నుంచే ఆమెపై వేధింపులు మొదలయ్యాయి. సదరు ఇన్‌చార్జి మేనేజర్‌, ఆమెపై పలు ఫిర్యాదులు చేశారు. పైగా పనిచేస్తున్న చోటే వేధింపులకు గురిచేస్తుండటంతో ఆమె నిజామాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. స్వీకరించిన పోలీసులు, నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ విషయం మీడియాలో రావడంతో సీఎం దృష్టికి వెళ్లింది. ఆయన చొరవతో అంతర్గత విచారణకుగాను ఓ కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ విచారణలో సదరు మహిళా ఉద్యోగిపై వేధింపులు వాస్తవమేనని తేల్చారు. పని ప్రదేశంలో వేధింపులు ఎదుర్కొంటున్న బాధితురాలిగా గుర్తించి మూడు నెలలు జీతంతో కూడిన సెలవు ఇచ్చారు. వేధింపుల బెడద తప్పేందుకు ఆమెను డిప్యూటేషన్‌ కింద హైదరాబాద్‌ సచివాలయానికి పంపారు. అయితే అప్పటికే మహిళా ఉద్యోగిపై సదరు ఇన్‌చార్జి మేనేజర్‌ ఇచ్చిన ఫిర్యాదులపై ఆ శాఖాధిపతి దర్యాప్తు ప్రారంభించారు. తమ శాఖాధిపతి తనను లక్ష్యంగా చేసుకున్నారని, తనపై విచారణ కోసం ఆయన స్థానంలో ఓ మహిళా అధికారిని నియమించాలంటూ ఆమె 2015 ఆగస్టు 3న రాష్ట్ర మహిళా కమిషన్‌ను ఆశ్రయించారు. స్పందించిన కమిషన్‌ చైర్‌పర్సన్‌, తమ ఎదుట హాజరు కావాలంటూ ఆ శాఖాధికారికి అదేనెల 30న లేఖ రాశారు. అయితే కమిషన్‌ ముందు ఆ శాఖాధిపతి హాజరుకాలేదు. కానీ అదేరోజు మహిళా కమిషన్‌కు ఒక లేఖ రాశారు. విచారణ కోసం ఓ మహిళా అధికారిణిని నియమించామని, ఆమెతో విచారణ పూర్తి చేయించి నివేదిక అందజేస్తామంటూ లేఖలో తెలిపారు. అయితే ఆ మహిళా అధికారి నియామకం జరగలేదు. సదరు శాఖాధిపతే విచారణను కొనసాగించి.. ఆమెపై చర్యలు తీసుకోవాలంటూ నివేదిక ఇచ్చేశారు. ఆ నివేదిక ఆధారంగా సదరు మహిళా ఉద్యోగి జీతంలో రూ.20వేలు కోతపడేలా చర్యలు తీసుకున్నారు. దీనిపై ఆ ఉద్యోగిని హైకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం ఈ అంశం హైకోర్టు విచారణలో ఉంది. కాగా బాధిత ఉద్యోగినిపై విచారణ కోసం మహిళా అధికారిని నియమిస్తామంటూ రాజ్యాంగబద్ధ సంస్థ అయిన రాష్ట్ర మహిళా కమిషన్‌కు లేఖ రాసి.. దాన్ని పక్కనబెట్టి తద్విరుద్ధంగా ఉన్నతాధికారే విచారణ పూర్తిచేసి చార్జిషీట్‌ రూపొందించడం సహజ న్యాయసూత్రాలను ఉల్లంఘించడమేనన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. తనకు జరిగిన అన్యాయంపై సీఎం కేసీఆర్‌, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి, గవర్నర్‌ తమిళి సై, మహిళా కమిషన్‌, డీవోపీటీ (డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ పర్సనల్‌ ట్రైనింగ్‌), కేంద్రప్రభుత్వానికి ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని సదరు ఉద్యోగిని వాపోతున్నారు.

Updated Date - 2022-12-02T05:13:12+05:30 IST