నన్ను అనొద్దు.. మాట పడొద్దు!
ABN , First Publish Date - 2022-09-27T09:24:04+05:30 IST
‘వైఎస్ఆర్‌ను ఎంతగానో అభిమానించే నాలాంటి వాళ్లతో కూడా ఆయనను తిట్టించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు’ అని వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిలను సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రశ్నించారు.

- నా వ్యక్తిత్వం దెబ్బతీయాలని ప్రయత్నిస్తే నేను వైఎస్ఆర్ గురించి మాట్లాడాల్సి వస్తది
- మాలాంటి అభిమానులతో కూడా మీ నాన్నను తిట్టించే ప్రయత్నం ఎందుకు?
- వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిలపై సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఫైర్
- షర్మిల బీజేపీ వదిలిన బాణం అని వ్యాఖ్య
- ఏపీ రాజధానిగా అమరావతే ఉండాలి
- చంద్రబాబు నిర్ణయం సరైంది
- 3 రాజధానులతో ప్రాంతాల మధ్య గొడవలు పెట్టడమే జగన్ లక్ష్యం: జగ్గారెడ్డి
హైదరాబాద్, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): ‘వైఎస్ఆర్‌ను ఎంతగానో అభిమానించే నాలాంటి వాళ్లతో కూడా ఆయనను తిట్టించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు’ అని వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిలను సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రశ్నించారు. షర్మిల తనను తిడితే.. తాను వైఎస్‌ఆర్‌ను అనాల్సి వస్తుందని, అనవసరంగా రెచ్చగొట్టవద్దని హితవు పలికారు. సోమవారం అసెంబ్లీ మీడియా హాల్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జగ్గారెడ్డి మాట్లాడారు. ‘సంగారెడ్డి పర్యటనలో ఉన్న షర్మిల నా రాజకీయ వ్యక్తిత్వంపై మాట్లాడినందువల్లే నేను వైఎస్ఆర్ గురించి మాట్లాడాల్సి వస్తోంది’ అన్నారు. ‘వైఎస్ఆర్ చనిపోయినప్పుడు బాధపడ్డట్లుగా.. నా తండ్రి చనిపోయినప్పుడు కూడా ఏడ్వలేదు’ అని పేర్కొన్నారు. వైఎస్ఆర్ చనిపోయినప్పుడు మేమంతా దుఖంలో ఉంటే.. వాళ్ల ఇంట్లోవాళ్లు మాత్రం ఎవరు సీఎం అవ్వాలన్న అంశంపై స్కెచ్ వేసుకుంటూ ఉన్నారని జగ్గారెడ్డి ఆరోపించారు. రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలన్నదే వైఎస్ఆర్ కోరిక అని, ఆయన వారసులుగా జగన్, షర్మిల దాన్ని నెరవేరుస్తున్నారా అని నిలదీశారు. ‘ఆస్తుల దగ్గర, వైఎ్‌సఆర్‌కు శ్రద్ధాంజలి ఘటించేటప్పుడు జగన్, షర్మిల కలిసే ఉంటారు. రాజకీయం వచ్చేసరికి ఇద్దరం వేర్వేరని మాట్లాడతారు. జగనన్న వదిలిన బాణాన్ని అంటూ అప్పట్లో పాదయాత్ర చేసిన షర్మిల.. ఇప్పుడేమో వైఎస్ వదిలిన బాణాన్ని అని మాట్లాడుతున్నారు’ అని విమర్శించారు.
వైఎస్‌ఆర్ వల్లే వచ్చానన్న సంగతి తెలియదా
తాను ఏ పార్టీలో ఉంటే, ఎక్కడ తిరిగితే షర్మిలకు ఎందుకని జగ్గారెడ్డి ప్రశ్నించారు. ‘మొదటిసారి టీఆర్‌ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన నేను వైఎస్ఆర్ వల్లే కాంగ్రె్‌సలోకి వచ్చిన సంగతి షర్మిలకు తెలియదా’ అని నిలదీశారు. వైఎస్ఆర్‌ను అభిమానించే తనతో ఆయన లోపాలను ఎత్తి చూపించేలా చేసింది షర్మిలేనన్నారు. ‘వైఎస్ఆర్ కూడా పార్టీ మారిన విషయం షర్మిలకు తెలియదా? 1978లో రెడ్డి కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన వైఎస్ఆర్.. మళ్లీ తిరిగి కాంగ్రెస్‌లోకి రాలేదా?’ అని ప్రశ్నించారు. ‘నేను ఎంత వైఎస్ఆర్ అభిమానినైనా.. షర్మిల నా వ్యక్తిత్వాన్నే దెబ్బతీసే ప్రయత్నం చేస్తే ఊరుకుంటానా’ అని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. షర్మిల బీజేపీ బాణం కావొచ్చన్న అనుమానం తనకుందన్నారు. ఆమె ఇంతవరకు బీజేపీని తిట్టినట్లు, మోదీని ప్రశ్నించినట్లు చూడలేదని, దీన్నిబట్టి చూస్తే షర్మిల బీజేపీ వదిలిన బాణమే అన్నారు. జగన్ కూడా బీజేపీ మనిషే అన్నారు. హైదరాబాద్‌లో ఉన్న ఏపీ ప్రజల ఓట్లు కాంగ్రె్‌సకు పడకుండా అడ్డుకునేపనిలో షర్మిల ఉన్నారని జగ్గారెడ్డి ఆరోపించారు. జగన్, షర్మిల, విజయమ్మ ముగ్గురూ బీజేపీ డైరెక్షన్‌లోనే పని చేస్తున్నారన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావద్దన్నదే బీజేపీ స్కెచ్ అని, అందులో భాగంగానే వీరు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
ఫ్యాక్షన్ రాజకీయాలు చేస్తే ఎలా
ఏపీకి రాజధానిగా అమరావతే ఉండాలని జగ్గారెడ్డి అన్నారు. ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్, కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి, మస్తాన్ వలీలూ దీన్నే సమర్థించారని గుర్తు చేశారు. రాజధానిగా అమరావతి విషయంలో చంద్రబాబు మంచి నిర్ణయం తీసుకున్నారన్నారు. రాజధానికి అమరావతి పేరుపెట్టడంలో చంద్రబాబు విస్త్రృత దృక్ఫథంలో ఆలోచించి నిర్ణయం తీసుకున్నారు. మూడు రాజధానుల పేరుతో ప్రాంతాల మధ్య గొడవలు పెట్టడమే జగన్ రాజకీయమన్నారు. మూడు రాజధానులతో అభివృద్ధి జరగదని జగ్గారెడ్డి అభిప్రాయపడ్డారు. ఏపీ హెల్త్ వర్సిటీకి ఎన్టీఆర్ పేరును తీసేసి వైఎ్‌సఆర్ పేరును పెట్టడం సరైన నిర్ణయం కాదన్నారు. విలువలు లేని రాజకీయం చేస్తే జగన్ చరిత్రహీనుడిగా మిగిలిపోతారన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఫ్యాక్షన్ తరహాలోనే రాజకీయాలు చేస్తే ఎలా అని జగన్‌ను ప్రశ్నించారు. రాహుల్ గాంధీ భారత్ జోడో పాదయాత్రతో ఆంధ్రదేశ్‌లో కాంగ్రెస్ రాజకీయంగా ఇంకా బలోపేతం అవుతుందని జగ్గారెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.