Share News

Khammam: ఆడపిల్ల పుడితే స్వీట్‌బాక్స్‌

ABN , Publish Date - Mar 24 , 2025 | 05:05 AM

ఆడపిల్ల పుట్టిన కుటుంబానికి స్వీట్‌బాక్స్‌ అందించాలని ఖమ్మం జిల్లా కలెక్టర్‌ ముజమ్మిల్‌ఖాన్‌ అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఆడపిల్ల పుట్టిన కుటుంబం ఇంటికి అధికారులు వెళ్లి శుభాకాంక్షలు తెలిపి, స్వీట్‌బాక్స్‌ అందించాలని సూచించారు.

Khammam: ఆడపిల్ల పుడితే స్వీట్‌బాక్స్‌

  • దివ్యాంగులకు ఉచితభోజనం

  • వినూత్న కార్యక్రమాలతో జనంలోకి

  • ఖమ్మం కలెక్టర్‌ ముజమ్మిల్‌ఖాన్‌ శైలే విభిన్నం

ఖమ్మం కలెక్టరేట్‌, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): ఆడపిల్ల పుట్టిన కుటుంబానికి స్వీట్‌బాక్స్‌ అందించాలని ఖమ్మం జిల్లా కలెక్టర్‌ ముజమ్మిల్‌ఖాన్‌ అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఆడపిల్ల పుట్టిన కుటుంబం ఇంటికి అధికారులు వెళ్లి శుభాకాంక్షలు తెలిపి, స్వీట్‌బాక్స్‌ అందించాలని సూచించారు. ఇంట్లో అమ్మాయి పుడితే అదృష్టం అనే భావన కల్పించడంతోపాటు తద్వారా ఆడ పిల్లల జననాల శాతం పెంచడమే లక్ష్యంగా ‘గర్ల్‌ప్రైడ్‌‘ కార్యక్రమానికి కలెక్టర్‌ ముజమ్మిల్‌ఖాన్‌ శ్రీకారం చుడుతున్నారు. ఇదొక్కటే కాదు.. జిల్లా కలెక్టర్‌గా ముజమ్మిల్‌ఖాన్‌ గతంలోనూ పలు వినూత్న కార్యక్రమాలతో సామాన్యులకు చేరువయ్యారు. కలెక్టరేట్‌లోని వేర్వేరు విభాగాల్లో పనుల కోసం జిల్లా నలుమూలల నుంచి వచ్చే సామాన్యుల్లో దివ్యాంగులు కూడా ఉంటారు. వారి ఆకలి తీర్చేందుకు ముజమ్మిల్‌ఖాన్‌ చర్యలు చేపట్టా రు. దివ్యాంగులకు ఒక టోకెన్‌ ఇస్తారు.


ఆ టోకెన్‌ ఇచ్చిన దివ్యాంగులకు ఉచితంగా భోజనం పెడతారు. ఇక మహిళా సాధికారతను ప్రోత్సహించడానికి ముజమ్మిల్‌ఖాన్‌ చర్యలు చేపట్టారు. వారి అభివృద్ధికి కలెక్టరేట్‌ క్యాంటిన్‌తోపాటు జిల్లా లో 19 చోట్ల మహిళలతో టీ-క్యాంటిన్లు ఏర్పాటు చేయించారు. ఏ అధికారికి ఆలోచన రాని విధంగా థర్డ్‌ జెండర్ల ఆరోగ్యం కోసం జిల్లా ఆసుపత్రిలో ప్రత్యేక కేర్‌ కేంద్రం ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు. ఆర్ధిక చేయూత కోసం వారితో స్వయం సహాయ సంఘాలు ఏర్పాటు చేయించారు. థర్డ్‌ జెండర్ల స్వయం సహాయ సంఘాలకు రుణాలందించి ప్రోత్సహించారు. భార్యాభర్తలు ఉద్యోగులైతే వారి పిల్లల ఆలనాపాలన కోసం కలెక్టరేట్‌లో ప్రత్యేకంగా డేకేర్‌ సెంటర్‌ ఏర్పాటు చేయించడంతోపాటు దాని నిర్వహణకు సిబ్బందినీ నియమించారు.

Updated Date - Mar 24 , 2025 | 05:05 AM