అత్యాధునిక ఆర్టీసీ బస్టాండు

ABN , First Publish Date - 2023-05-18T01:10:12+05:30 IST

ఇంటర్‌ మోడల్‌ ఇంటిగ్రేటెడ్‌ బస్‌ టెర్మినల్‌కు గ్రీన్‌సిగ్నల్‌ మూడున్నరేళ్ల వ్యవధిలో రూ. 600కోట్లతో నిర్మాణం

అత్యాధునిక ఆర్టీసీ బస్టాండు
బస్‌ టెర్మినల్‌ నమూనా

తిరుపతి(కొర్లగుంట), మే 17: తిరుపతి ఆర్టీసీ సెంట్రల్‌ బస్టాండు స్థానంలో ఇంటర్‌ మోడల్‌ ఇంటిగ్రేటెడ్‌ బస్‌ టెర్మినల్‌ నిర్మాణానికి మరో ముందడుగు పడింది.బహుళ అంతస్తుల షాపింగ్‌ కాంప్లెక్సుతో కూడిన బస్టాండును దాదాపు రూ.600కోట్ల వ్యయంతో నిర్మించేందుకు నమూనా ను దాదాపు ఓకే చేశారు.సాయిల్‌ టెస్టు, నమూనా తయారీ పనులను చేపట్టిన న్యూఢిల్లీకి చెందిన రైట్స్‌ కంపెనీ ప్రతినిధుల బృందం బుధవారం తిరుపతిలోని ఆర్టీసీ ప్రధాన కార్యాలయంలో వీడియో ప్రదర్శన ద్వారా బస్‌ టెర్మినల్‌ గురించి పూర్తిస్థాయిలో అధికారులకు వివరించారు. మూడు రకాల నమూనాలను ప్రదర్శించగా అందులో ఒక మోడల్‌ను ఎంపిక చేశారు.టౌన్‌ప్లానింగ్‌ విభాగ ఆమోదం కోసం ఆర్టీసీ ఉన్నతాధికారులు నమూనాను పంపారు.

3ఎకరాల్లో బహుళ అంతస్తుల భవనం

13ఎకరాల విస్తీర్ణంలో అంతర్భాగంలో మూడంతస్తులు(దాదాపు 4,500స్కూటర్లు, కార్లకు పార్కింగ్‌ సౌకర్యం),ఆపైన 14అంతస్తులు నిర్మించనున్నారు. ఫస్ట్‌ ఫ్లోరులో సువిశాలమైన రెండు కార్గో కేంద్రాలు, 80ఫ్లాట్‌ఫామ్స్‌, 20వెయిటింగ్‌ ప్లాట్‌ఫామ్స్‌, 20ఎలక్ర్టిక్‌ బస్సుల చార్జింగ్‌ ప్లాట్‌ఫామ్స్‌ ఏర్పాటు చేయనున్నారు. అన్ని అంతస్తుల్లో అత్యాధునికమైన తాగునీటి, మరుగుదొడ్ల కేంద్రాలుంటాయి. వాహనాలు లోనికి రావడానికి మూడు , బయటకు వెళ్లేందుకు రెండు ప్రవేశ ద్వారాలు ఏర్పాటు చేయనున్నారు. ఆర్టీసీకి సంబంధించి 20కార్యాలయాలు, మూడంతస్తుల్లో వాణిజ్య సముదాయాలు(ఒక్కో అంతస్తులో 30నుంచి 40వరకు దుకాణాలు)వుంటాయి.రెండంతస్తుల్లో విశ్రాంతి గదులు, సినిమాహాల్స్‌, వైద్యసౌకర్యాలు, హోటల్స్‌, రిజర్వేషన్‌ కౌంటర్లు, బేబీకేర్‌ కేంద్రాలు, కాన్ఫరెన్స్‌హాల్స్‌, ఏటీఎంలు, ఈవీ చార్జ్‌స్టేషన్లు ఏర్పాటు చేస్తారు. భవనం పైన హెలిపాడ్‌ సౌకర్యం కల్పించనున్నారు. రైల్వేస్టేషన్‌ నుంచి 30అడుగుల వెడల్పు, 500మీటర్లతో వంతెన, పక్కనే ఎస్కలేటర్‌ను ఏర్పాటు చేస్తారు. నలుమూలల్లో నాలుగు అధునాతన లిఫ్టులు, ఫైర్‌ సేఫ్టీ సదుపాయం, ప్రత్యేక విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ నిర్మించనున్నారు.రోప్‌వే ఏర్పాటు ప్రతిపాదనను అధికారులు తిరస్కరించారు. పుణ్యక్షేత్రంలో రోప్‌వేలు ఆమోదయోగ్యం కాదని భావించారు.

రూ. 10కోట్లతో మంగళంలో బస్టాండు

తిరుపతి శివారు ప్రాంతమైన మంగళంలో రూ. 10కోట్లతో అధునాతన బస్టేషన్‌ నిర్మించనున్నారు. రెండంతస్తులు, 30ప్లాట్‌ఫామ్స్‌, కార్యాలయాలు, విశ్రాంతి గదులు తదితర వసతులతో బస్టేషన్‌ నిర్మాణం జరగనుంది. త్వరలోనే నమూనాలు రూపొందించనున్నారు. వచ్చే మూడునెలల్లో టెండర్లు ఖరారయ్యే అవకాశముంది.

యలమండ్యంలో ఛార్జింగ్‌ స్టేషన్‌

ఆర్టీసీలో విద్యుత్‌ బస్సులు క్రమేపీ పెరుగుతున్న క్రమంలో వీటి ఛార్జింగ్‌కోసం రేణిగుంట సమీపంలోని యలమండ్యంలో 27ఎకరాల స్థల సేకరణకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.తిరుపతి,అలిపిరి డిపోలతో పాటు మూడేళ్లలో ఇక్కడ ఛార్జింగ్‌స్టేషన్‌ ఏర్పాటుకు ఆమోదం లభించింది. ఇక్కడ రెండు బస్సు డిపోలు, 1400ఎలక్ర్టిక్‌ బస్సులకు ఛార్జింగ్‌ చేసుకునే సౌకర్యం కోసం కసరత్తు చేస్తున్నారు. ఇక్కడే కమర్షియల్‌ కాంప్లెక్స్‌ కూడా నిర్మించనున్నారు.

Updated Date - 2023-05-18T01:10:12+05:30 IST