కుప్పం ప్రభుత్వాస్పత్రిలో విచారణ ప్రహసనం!

ABN , First Publish Date - 2023-03-30T01:03:10+05:30 IST

ఫిర్యాదుదారులను బయటకు పొమ్మనడంపై ప్రజా సంఘాల నిరసన విచారణకు ముందే డీసీహెచ్‌ఎ్‌సను కలిసిన జడ్పీ ఛైర్మన్‌, ఎమ్మెల్సీ నివేదికను కలెక్టర్‌కు సమర్పిస్తానన్న డీసీహెచ్‌ఎ్‌స

కుప్పం ప్రభుత్వాస్పత్రిలో విచారణ ప్రహసనం!
కుప్పం ప్రభుప్రభుత్వాసుపత్రిలో ధర్నా చేస్తున్న ప్రజా సంఘాల ప్రతినిధులు

కుప్పం, మార్చి 29: కుప్పం ప్రభుత్వాస్పత్రిలో చిన్నారుల ఆరోగ్య దందా, ఆరోగ్యశ్రీ పథకం దుర్వినియోగం, వైద్యుల కమీషను ఆరోపణపై బుధవారం డీసీహెచ్‌ఎ్‌స నాయక్‌ విచారణ జరిపారు. అయితే ఫిర్యాదారులైన తమను విశ్వాసంలోకి తీసుకోకుండా విచారణ జరపడంపై ప్రజా సంఘాల ప్రతినిధులు ఆందోళనకు దిగారు. విచారణకు ముందుగా జడ్పీ ఛైర్మన్‌ శ్రీనివాసులు, ఎమ్మెల్సీ భరత్‌ తదితరులు డీసీహెచ్‌ఎ్‌సను కలవడంతో నివేదిక నిష్పాక్షికతపై విమర్శలు వినిపిస్తున్నాయి.

‘కుప్పం ప్రభుత్వాస్పత్రిలో చిన్నపిల్లల ఆరోగ్యంతో కొంతమంది వైద్యులు చెలగాటమాడుతున్నారు. తమ ప్రైవేటు ల్యాబ్‌లకు పంపి, తప్పుడు రిపోర్టులు తెప్పించి లేని జబ్బులు సృష్టించి, ఆరోగ్యశ్రీ పథకాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. దీనికిగాను ప్రైవేటు ఆస్పత్రుల నుంచి కమీషన్లు తీసుకుంటున్నారు’ అని కొంతమంది ప్రజా సంఘాల నాయకులు సోమవారం కలెక్టరేట్‌లో ‘స్పందన’లో భాగంగా జేసీకి ఫిర్యాదు చేశారు. దీనిపై విచారించి చర్యలు తీసుకోవాలంటూ మంగళవారం ప్రతిపక్ష నేత చంద్రబాబు కలెక్టర్‌కు లేఖ రాశారు. ఈ క్రమంలో డీసీహెచ్‌ఎ్‌సను విచారణకు ఆదేశిస్తూ కలెక్టర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. బుధవారం ఉదయం డీసీహెచ్‌ఎ్‌స నాయక్‌ కుప్పం చేరుకున్నారు. వివిఽధ ప్రజా సంఘాల నాయకులూ ఆస్పత్రికి వచ్చారు. అందులో ఫిర్యాదుదారులైన మునిరాజ్‌బాబు, మహేశ్‌, వేణు, నవీన్‌కూడా డీసీహెచ్‌ఎ్‌సను కలిశారు. విచారణ సమయంలో ఉండకూడదంటూ వారిని డీసీహెచ్‌ఎ్‌స బయటకు పంపించేశారు. ఫిర్యాదుదారులైన తమను అనుమతించకుండా విచారించడం ఏమిటని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతిపరులైన వైద్యులను కాపాడడానికే రహస్య విచారణ చేస్తున్నారని ఆరోపిస్తూ, ఆస్పత్రి ఆవరణలో ధర్నాకు దిగారు. అవినీతిపరులైన వైద్యులను రక్షించడానికే జరిగే ఈ విచారణ తమకు వద్దని ఫిర్యాదుదారులతో పాటు దేవరాజ్‌ నిరసించారు. కలెక్టర్‌ వచ్చి విచారణ చేపట్టాలని డిమాండు చేశారు. వీరి ధర్నా జరగుతుండగానే ఆస్పత్రి లోపల డీసీహెచ్‌ఎ్‌స విచారణ చేపట్టారు. ఆసుపత్రి సూపరింటెండెంట్‌ విజయకుమారి, ఆర్‌ఎంవో రత్నకిశోర్‌తోపాటు అందరు వైద్యులను విచారించారు. ఈ విచారణ సాయంత్రందాకా కొనసాగింది. దీనిపై కలెక్టర్‌కు నివేదిక సమర్పిస్తామని డీసీహెచ్‌ఎ్‌స నాయక్‌ మీడియాకు తెలిపారు. అవినీతి ఆరోపణలు రుజువైతే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

డీసీహెచ్‌ఎ్‌సను కలిసిన ప్రజాప్రతినిధులు

విచారణకు వచ్చిన డీసీహెచ్‌ఎ్‌స నాయక్‌ను ఉదయమే జడ్పీ ఛైర్మన్‌ శ్రీనివాసులు, ఎమ్మెల్సీ భరత్‌ తమ అనుచరులతో కలిశారు. కొద్దిసేపు ఆయనతో మాట్లాడారు. విచారణ ముగిశాక కలెక్టర్‌కు ఇవ్వనున్న ప్రతిని ఒకదాన్ని తమకు కూడా ఇవ్వాలని ఎమ్మెల్సీ భరత్‌ కోరారు. కాగా, విచారణాధికారిని ప్రజాప్రతినిధులు విచారణకు ముందే కలవడం చర్చనీయాంశమైంది. విచారణపై ప్రభావం చూపేందుకే ఈ కలయిక జరిగిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

Updated Date - 2023-03-30T01:03:10+05:30 IST