Ambati Rambabu: సాగర్ పంచాయితీపై అంబటి ఏమన్నారంటే..!
ABN , First Publish Date - 2023-12-01T15:53:26+05:30 IST
ఈరోజు ఇంత ఇష్యూ సాగర్ దగ్గర జరగడానికి కారణం మాజీ సీఎం చంద్రబాబే. ఆయన హక్కును వదులుకున్నారు.. తెలంగాణకు తాకట్టు పెట్టారు. కేసుకు భయపడి పారిపోయారు.
తాడేపల్లి: తెలంగాణలో వైసీపీ లేదు.. అయినా అక్కడ రాజకీయాలపై ఇంట్రెస్ట్ లేదని ఆ పార్టీ సీనియర్ నేత, జలవనరుల శాఖా మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) స్పష్టం చేశారు. నాగార్జన సాగర్ వివాదంపై మంత్రి మీడియాతో మాట్లాడారు. ‘‘నాగార్జన సాగర్ దగ్గర 13వ గేటు వరకూ రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. తెలంగాణలో ఓ రాజకీయ పార్టీకి సాయం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ చర్యకు పాల్పడింది అంటున్నారు. ఈ చర్య ఆ రోజే ఎందుకు చేశారని.. ఆ రోజు పోలీసు బలగాలు ఎన్నికల ప్రక్రియలో ఉంటాయి గనుక అని కొందరు చెబుతున్నారు. ఏపీ పత్రికలే సాగర్ మీద దండయత్ర అని రాశాయి. అర్థరాత్రి హల్‌చల్ అంటూ రాశాయి. సాగర్ దగ్గర తీసుకున్న చర్య న్యాయమైనది, ధర్మబద్ధం అయినది. ఏపీ విభజన సమయంలో కృష్ణా నది జలాలను, నదిని విభజించారు. కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డును కేంద్రం ఏర్పాటు చేసింది. కేఆర్ఎంబీ సాగర్‌ను స్వాధీనం చేసుకుంటామంటే తెలంగాణ ఒప్పుకోలేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు.’’ అని గుర్తుచేశారు.
‘‘ఈరోజు ఇంత ఇష్యూ సాగర్ దగ్గర జరగడానికి కారణం మాజీ సీఎం చంద్రబాబే. ఆయన హక్కును వదులుకున్నారు.. తెలంగాణకు తాకట్టు పెట్టారు. కేసుకు భయపడి పారిపోయారు. ఏపీవాళ్లు ప్రాజెక్టు దగ్గరకు వెళ్లాలన్న వారి పర్మిషన్ తీసుకోవల్సిన పరిస్థితి వచ్చింది. మన నీరును మన రైతులకు విడుదల చేయడం అంటే అన్యాయం అవుతుందా? మన భూభాగంలోకి మన పోలీసులు వెళ్తే అది ఎలా దండయాత్ర అవుతుంది. మన ప్రాంతంలో వారికి తాగునీరు, సాగునీరు కావాలి. ఆ హక్కును తిరిగి తీసుకోవడానికి జగన్ ప్రభుత్వం ప్రయత్నం చేసింది... దీన్ని అందరూ అభినందించాలి. ఇది ఎవరి ఓటమి కాదు.. గెలుపు కాదు. తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. మా ప్రాంతాన్ని మేము స్వాధీనం చేసుకున్నాం. మా నీళ్లు మేం ఇచ్చుకుంటున్నాం. ఇది ఘర్షణ కాదు మా హక్కును మేం పునరుద్దరించుకున్నాం.’’ అని స్పష్టం చేశారు.