Venkaiahnaidu: చదువు ర్యాంకుల కోసం కాదు.. ఇష్టపడి, కష్టపడి చదవండి
ABN , First Publish Date - 2023-08-21T10:53:51+05:30 IST
చదువు ర్యాంకులు కోసం కాదని... విజ్ఞానం, వివేకం పెంచుకోవడానికి అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు.
గుంటూరు: చదువు ర్యాంకులు కోసం కాదని... విజ్ఞానం, వివేకం పెంచుకోవడానికి అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు (Former Vice President Venkaiah Naidu) అన్నారు. సోమవారం గుంటూరులో భాష్యం విద్యాసంస్థల విద్యార్థుల సన్మాన కార్యక్రమంలో వెంకయ్య పాల్గొన్నారు. భాష్యంలో చదవి జేఈఈ అడ్వాన్సుడ్ ఫలితాల్లో అఖిలభారత స్థాయి ఓపెన్ కేటగిరీ 5, 10వ ర్యాంకు సాధించిన విద్యార్థులను మాజీ ఉపరాష్ట్రపతి సన్మానించారు. ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ... ఇష్టపడి, కష్టపడి చదవాలన్నారు. కులాల కుమ్ములాటలో యువకులు దూరవద్దని సూచించారు. ప్రాధమిక విద్య మాతృభాషలో జరగాలని.. కొత్త విద్యా విధానంలో ఈ అంశానికి ప్రాధాన్యత ఇచ్చారని వెంకయ్య తెలిపారు.
మన దేశం ఇప్పుడు అంతరిక్ష పరిశోధనలో దూసుకెళ్తోందని అన్నారు. చంద్రయాన్ 3 ద్వారా ఇస్రో సత్తా ప్రపంచానికి తెలిసిందన్నారు. తెలుగువారు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారని అన్నారు. సత్య నాదెళ్ల, సుందర్ పిచాయ్, రుషి షునాక్ వంటి వారు భారతదేశ ప్రతిష్టను పెంచారని చెప్పుకొచ్చారు. సేవ చేయడం కోసం రాజకీయాలు కీలకమన్నారు. విద్య అందించడం కూడా సేవలో భాగమే అని తెలిపారు. దేశాన్ని ఆర్థిక శక్తిగా తయారు చేయాలన్నారు. సెల్ ఫోన్, ఎలక్ట్రానిక్ ఉపకరణాలకు బానిసలు కావద్దని సూచించారు. సాంకేతికత అవసరమే కానీ పూర్తిగా దానిమీదే ఆధార పడవద్దన్నారు. చిన్న చిన్న సమాచారం కోసం కూడా ఇంటర్నెట్‌పై ఆదారపడుతున్నారని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.