రోడ్డు.. కబ్జా

ABN , First Publish Date - 2023-04-29T00:34:25+05:30 IST

రోడ్డు పక్కన ఉన్నవాళ్లు ఎవరైనా అడుగో.. అరడుగో ఆక్రమిస్తుంటారు. మొట్లో, ప్రహరీనో కట్టుకుంటుంటారు.

రోడ్డు.. కబ్జా
నవభారత్‌ నగర్‌ నాలుగోలైను రెండో అడ్డ రోడ్డు వేయించేందుకు కార్పొరేటర్‌ తోలించిన మట్టి, చివరన కారు షెడ్డు

గుంటూరు, ఏప్రిల్‌ 28 (ఆంధ్రజ్యోతి): రోడ్డు పక్కన ఉన్నవాళ్లు ఎవరైనా అడుగో.. అరడుగో ఆక్రమిస్తుంటారు. మొట్లో, ప్రహరీనో కట్టుకుంటుంటారు. అయితే ఇక్కడ ఏకంగా రోడ్లను, పార్కు స్థలాన్ని అమాంతం మింగేస్తున్నారు. వీరి చర్యలతో ప్రస్తుతం అసలు అక్కడ రోడ్డు ఉందంటే ఎవరూ నమ్మలేరంటే ఆశ్చర్యం కాదు. ఇది ఎక్కడో మారుమూల కాదు. గుంటూరు నగరంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నవభారత్‌ నగర్‌లో. నవభారత్‌నగర్‌ 4వ లైనులో 40 ఏళ్ల క్రితం ఉడా ఆమోదించిన లే అవుట్‌లో భూదందా చోటుచేసుకుంది. కొందరు రాజకీయ ప్రముఖులు, కార్పొరేషన్‌ అధికారులతో చేతులు కలిపి భూ ఆక్రమణకు పాల్పడుతున్నారు. రోడ్డు, ఇతర ప్రజావసరాల కోసం వదిలిన ఖాళీ స్థలాలు అక్రమార్కులకు వరంగా మారాయి. నవభారత్‌నగర్‌లో గజం స్థలం రూ.70 వేలు ఉంది. దీంతో కొంతమంది నవభారత్‌నగర్‌ నాలుగోలైనులోని తొలి అడ్డరోడ్డులో ఉన్న 1800 గజాల స్థలంలో పార్కు నిర్మించాలని స్థానికులు ఎప్పటి నుంచో కోరుతున్నారు. ఈ స్థలాన్ని కొందరు ఆక్రమించి తప్పుడు పత్రాలు పుట్టించారు. ఇదే ప్రాంతంలోని రెండో అడ్డరోడ్డు ఆనవాలు కూడా లేకుండా కొందరు చేశారు. ఒకరు రోడ్డు మీద కార్‌ పార్కింగ్‌ షెడ్డు నిర్మించుకుంటే, మరొకరు ఏకంగా గోడౌన్‌ కట్టేసుకున్నాడు. ఇంకొకరు రోడ్డుకు అడ్డంగా ప్రహరి కట్టేసుకున్నాడు. మరో చివర ఇంకో వ్యక్తి ఏకంగా గొడ్ల చావడి నిర్మిచాడు. వీరంతా తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించి వాటిని సొంతం చేసుకునేపనిలో మునిగిపోయారు. ఆక్రమణలను అడ్డుకోవడానికి స్థానిక కార్పొరేటర్‌ చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు. రోడ్డు మధ్యలో నిర్మించిన షెడ్డును తొలగిస్తే రోడ్డు వేస్తామని కార్పొరేటర్‌ చెప్పినా అక్రమార్కులు లెక్క చేయలేదు. దీంతో ఆయన రోడ్డు వేసేందుకు మట్టి తోలినా వారు పట్టించుకోలేదు. ఈ ఆక్రమణలపై స్థానికుల ఫిర్యాదుతో నగర కమిషనరే ఇటీవల పరిశీలనకు వచ్చారు. లే అవుట్‌ను పరిశీలించి గొడ్ల చావడిని తక్షణం తొలగించాలని ఆదేశించారు. అయినప్పటికీ గొడ్ల చావడి అలాగే ఉంది. ఆక్రమణల పర్వంపై గతంలో స్థానికులు ఫిర్యాదులు చేశారు. దీంతో కార్పొరేషన్‌ అధికారులు విచారణ జరిపి ప్రభుత్వ సర్వేయరు అక్రమాలను నిగ్గు తేల్చారు. అయినప్పటికీ ఈరోజు వరకు అతడిపై చర్యలు లేవు. సర్వేయరు వ్యవహారం, ఆక్రమణలపై కౌన్సిల్‌ సమావేశాల్లో కార్పొరేటర్లు అధికారులను నిలదీసినా అధికారుల్లో స్పందన లేదు. ఈ పరిస్థితుల్లో కొందరు స్థానికులు పదేళ్లుగా కోర్టులో పోరాడుతున్నారు. దాదాపు రూ.20 కోట్ల విలువ చేసే స్థలాన్ని సంరక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వం, అధికారుల నుంచి వీరికి కనీస సహకారం లేదు.

Updated Date - 2023-04-29T00:34:25+05:30 IST