Atchannaidu: చిత్తూరు డైయిరీ అమూల్‌కు అప్పగించొద్దంటూ సీఎస్‌కు టీడీపీ లేఖ

ABN , First Publish Date - 2023-07-03T17:34:22+05:30 IST

చిత్తూరు డైయిరీని అమూల్‌కు అప్పగించొద్దంటూ ఏపీ సీఎస్‌కు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు లేఖ రాశారు. లేఖలో ఏముంది అంటే.. ‘‘చిత్తూరు డైయిరీని పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చి జగన్ రెడ్డి మాట తప్పారు. అమూల్‌కు ధారాదత్తం చేస్తూ తెలుగువారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారు. మౌలిక వసతులు, సహకార డైయిరీల ఆస్తులు కలిపి 6 వేల కోట్ల ప్రజాసంపదను అమూల్‌కు దోచిపెడుతున్నారు.

Atchannaidu: చిత్తూరు డైయిరీ అమూల్‌కు అప్పగించొద్దంటూ సీఎస్‌కు టీడీపీ లేఖ

అమరావతి: చిత్తూరు డైయిరీని అమూల్‌కు అప్పగించొద్దంటూ ఏపీ సీఎస్‌కు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు (Atchannaidu) లేఖ రాశారు. లేఖలో ఏముంది అంటే.. ‘‘చిత్తూరు డైయిరీని పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చి జగన్ రెడ్డి మాట తప్పారు. అమూల్‌కు ధారాదత్తం చేస్తూ తెలుగువారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారు. మౌలిక వసతులు, సహకార డైయిరీల ఆస్తులు కలిపి 6 వేల కోట్ల ప్రజాసంపదను అమూల్‌కు దోచిపెడుతున్నారు. సహకార వ్యవస్థను మూసివేసేలా ప్రభుత్వ నిర్ణయాలు ఉన్నాయి. సహకార డైయిరీలను పునరుద్ధరిస్తామన్న హామీ ఏమైంది? ప్రభుత్వ నిర్ణయాలతో పాడి రైతులకు ద్రోహం చేస్తున్నారు. కమీషన్లు, కేసుల మాఫీ కోసమే అమూల్‌కు చిత్తూరు డైయిరీ అప్పగిస్తున్నారా? చిత్తూరు డైయిరీకి చెందిన రూ.650 కోట్ల ఆస్తులు సైతం కట్టబెట్టారు. చివరకు చిత్తూరు డైయిరీ వ్యవస్థాపకుడి విగ్రహం సైతం కూలగొట్టడం ప్రభుత్వ టెర్రరిజానికి నిదర్శనం కాదా? ఎన్నికలకు ముందు పాడి రైతులకు లీటర్‌ పాలకు రూ.4 బోనస్‌ ఇస్తామనే హామీపై మాటతప్పి మడమతిప్పారు. సహకార రంగ డైయిరీలను సమర్థవంతంగా నడిపే సత్తా ఇక్కడి వారికి లేదా? ఇక్కడి ఉద్యోగాలను, సంపదను పొరుగున ఉన్న అమూల్‌కు ధారాదత్తం చేస్తున్నారు. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు అమూల్ మోసాన్ని గ్రహించి దూరం పెట్టాయి. జగన్ రెడ్డి మాత్రం గుజరాత్‌కు చెందిన అమూల్ డైయిరీకి బ్రాండ్ అంబాసిడర్‌లా వ్యవహరిస్తున్నారు. అమూల్ వల్ల ప్రజలకు కలిగే లాభాలేమిటో ప్రభుత్వం సమాధానం చెప్పాలి. అమూల్ కంటే స్థానిక డైయిరీలే రైతులకు ఎక్కువ ధర చెల్లిస్తున్నాయి. ఇప్పటికైనా ప్రజావిరుద్ధ చర్యలు మానుకుని అమూల్‌కు దాసోహమవడం మానుకోవాలి. చిత్తూరు డైయిరీని అమూల్‌కు ధారాదత్తం చేయకుండా ఇక్కడి సహకార డైయిరీలకు ప్రభుత్వం మద్దతుగా నిలవాలి.‌‌’’ అని అచ్చెన్నాయుడు లేఖలో కోరారు.

Updated Date - 2023-07-03T17:34:22+05:30 IST