బాదుడే బాదుడు...!

ABN , First Publish Date - 2023-05-30T23:51:04+05:30 IST

వైసీపీ సర్కారు మరో బాదుడుకు తెరదీసింది. ఇప్పటికే భూముల విలువ ఆకాశాన్నంటగా మళ్లీ పెంచబోతోంది. దీంతో రిజిస్ర్టేషన్లు మరింత భారం కానున్నాయి. ఈ నేపథ్యంలోనే నాలుగు రోజులుగా సర్వర్‌ డౌన్‌ కావడం, భూమలు విలువ పెంపునకు కసరత్తు ప్రారంభమవడం వంటి విషయాలు తెలియడంతో క్రయవిక్రయదారులు ఆందోళనకు గురవుతున్నారు. పెరిగిన ధరలతో రిజిస్ట్రేషన్‌ చార్జీలు చెల్లించాల్సి వస్తుందని భయపడుతున్నారు. అదనపు భారం పడుతుందనే ఆందోళనతో లావాదేవీలు పూర్తిచేసుకునేందుకు రిజిస్ర్టార్‌ కార్యాలయాలకు పోటెత్తుతున్నారు. అయితే సిబ్బంది మాత్రం ఎలాంటి సమాధానం చెప్పలేని పరిస్థితి నెలకొంది. దీంతో కృతిమంగా సర్వర్‌ డౌన్‌ చేశారా? అనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

బాదుడే బాదుడు...!
ఒంగోలులోని రిజిస్ర్టేషన్‌ కార్యాలయం

మళ్లీ పెరగనున్న భూముల విలువ

మరింత భారం కానున్న రిజిస్ట్రేషన్లు

మూడు రోజులుగా సర్వర్‌ డౌన్‌

కార్యాలయాలకు పోటెత్తిన జనం

పెంపునకు ఆమోదం తెలిపిన కమిటీ

వైసీపీ సర్కారు మరో బాదుడుకు తెరదీసింది. ఇప్పటికే భూముల విలువ ఆకాశాన్నంటగా మళ్లీ పెంచబోతోంది. దీంతో రిజిస్ర్టేషన్లు మరింత భారం కానున్నాయి. ఈ నేపథ్యంలోనే నాలుగు రోజులుగా సర్వర్‌ డౌన్‌ కావడం, భూమలు విలువ పెంపునకు కసరత్తు ప్రారంభమవడం వంటి విషయాలు తెలియడంతో క్రయవిక్రయదారులు ఆందోళనకు గురవుతున్నారు. పెరిగిన ధరలతో రిజిస్ట్రేషన్‌ చార్జీలు చెల్లించాల్సి వస్తుందని భయపడుతున్నారు. అదనపు భారం పడుతుందనే ఆందోళనతో లావాదేవీలు పూర్తిచేసుకునేందుకు రిజిస్ర్టార్‌ కార్యాలయాలకు పోటెత్తుతున్నారు. అయితే సిబ్బంది మాత్రం ఎలాంటి సమాధానం చెప్పలేని పరిస్థితి నెలకొంది. దీంతో కృతిమంగా సర్వర్‌ డౌన్‌ చేశారా? అనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

ఒంగోలు(క్రైం), మే 30 : భూముల రిజిస్ట్రేషన్‌ ధరలు పెరగనున్నాయి. ఆ మేరకు మార్కెట్‌ విలువ రివిజన్‌ కమిటీ ఆమోదం తెలిపింది. రేపటి నుంచి కొత్త విలువను అమలులోకి తెచ్చేందుకు వైసీపీ సర్కారు సర్వం సిద్ధం చేసినట్లు సమాచారం. స్పెషల్‌ రివిజన్‌ పేరుతో భూముల ధరలు పెంచి ఆదాయం సమకూర్చుకునేందుకు చర్యలు చేపట్టారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎక్కువ క్రయవిక్రయాలు జరిగే ప్రాంతాలతో పాటుగా రహదారుల పక్కన ఉన్న భూములకు 30 నుంచి 50శాతం విలువ పెంచే విధంగా ప్రణాళికలు సిద్ధం చేశారు. భూముల విలువ పెరిగితే అదే విధంగా రిజిస్ర్టేషన్‌ చార్జీలు పెరుగుతాయి. ఈ క్రమంలో నాలుగు రోజులుగా సర్వర్‌ డౌన్‌ పేరుతో రిజిస్ట్రేషన్‌లు నిలిచిపోయాయి. దీంతో జిల్లావ్యాప్తంగా ఉన్న సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాల వద్ద క్రయ, విక్రయదారులు పోటెత్తారు. కాగా వివిధ కారణాలతో 2020 ఆగస్టులోనే భూములు ధరలను అమాంతం పెంచిన విషయం తెలిసిందే. అయితే తిరిగి ఆగస్టులో కాకుండా ప్రత్యేక రివిజన్‌ పేరుతో మళ్లీ విలువ పెంచేందుకు కసరత్తు చేసి ప్రతిపాదనలు సిద్ధంగా ఉంచారు. వాటికి రివిజన్‌ కమిటీలు ఆమోదం కూడా తెలిపాయి. ఈ తరుణంలో నాలుగు రోజులుగా సర్వర్‌ డౌన్‌ కావడంతో క్రయ, విక్రయదారుల్లో ఆందోళన ప్రారంభమైంది.

ప్రభుత్వం ధరలు పెంచి ముక్కుపిండి వసూలు చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించిందా? అనే అనుమానాలు వారు వ్యక్తం చేస్తున్నారు.

రిజిస్ర్టేషన్‌ ధరల వివరాలు

జిల్లావ్యాప్తంగా పెరగనున్న భూముల ధరల వివరాలు ఇలా ఉన్నాయి. ఒంగోలు నగరంలో ఉన్న కొన్ని ప్రాంతాల ధరలు పరిశీలిస్తే సమతానగర్‌లో గతంలో గజం విలువ రూ.16వేలు కాగా పెరగనున్న ధర ప్రకారం రూ.21 వేలు అవుతుంది. లాయర్‌పేటలో గతంలో రూ.22వేలు కాగా ప్రస్తుతం రూ.29వేలు అయ్యే అవకాశం ఉంది. అన్నవరప్పాడులో రూ.22వేలు ఉండగా రూ.28వేలకు పెరగనుంది. అదేవిధంగా కొప్పోలులో పొలం ఎకరా ప్రస్తుతం రూ.20లక్షలు కాగా రూ.24 లక్షలు పెంపునకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ముక్తినూతలపాడులో రూ.33లక్షలు కాగా రూ.40లక్షలు కానుంది. అదేవిధంగా అమ్మనబ్రోలులో గజం రూ.32వేలు కాగా రూ.37వేలు, కంభంలో రూ.35వేలు ఉన్న భూమి రూ.40వేలు, కనిగిరిలో రూ.40వేలు ఉన్న భూమి ధర రూ.50 వేలు, మార్కాపురంలో రూ.43వేలు ఉన్న భూమి విలువ రూ.48వేల వరకు పెరగనుంది.

30 నుంచి 50 శాతం పెంపు

జిల్లాలో భూముల విలువలను 30 నుంచి 50శాతం పెంచేందుకు ప్రతిపాదనలు పంపించగా ఆ మేరకు రివిజన్‌ కమిటీలు ఆమోదం తెలిపాయి. అయితే పెంచిన ధరలు అమలుకు సాఫ్ట్‌వేర్‌ అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా ప్రభుత్వ ఆమోదం కావాలి. ప్రతి సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయం పరిధిలో ఉన్న 20 గ్రామాల్లో మార్కెట్‌ ధర పెంచనున్నారు. వివిధ కంపెనీలు, పరిశ్రమలతో పాటుగా రహదారి పరిసర ప్రాంతాల్లో ఉన్న భూముల విలువలు పెరగనున్నాయి. అంతేకాకుండా క్రయవిక్రయాలు అధికంగా జరుగుతున్న ప్రాంతాల్లో కూడా ధరలు పెంపు అమలుకు రానుంది.

సర్వర్‌ డౌన్‌తో ఆందోళన

భూముల విలువలు పెరిగితే చార్జీలు పెరుగుతాయన్న ఆందోళన నేపథ్యంలో సోమ, మంగళవారాల్లో పెద్దఎత్తున దస్తావేజులు రిజిస్ట్రేషన్‌ కోసం జిల్లాలోని సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాలకు వచ్చాయి. అయితే సర్వర్‌ పనిచేయకపోవడంతో ఆశించిన స్థాయిలో పనులు కాలేదు. జిల్లాకేంద్రమైన ఒంగోలులో సరాసరిగా 50 దస్తావేజులు రిజిస్ట్రేషన్‌ వచ్చాయి. సర్వర్‌ డౌన్‌ కావడంతో సోమవారం 6, మంగళవారం 20 డాక్యుమెంట్లు చేశారు. అవి అసంపూర్తిగా ఉండటం గమనార్హం. మిగతా చోట్ల అదే పరిస్థితి. దీంతో కార్యాలయాల వద్ద ఆందోళనకర వాతావరణం నెలకొంది.

సర్వర్‌ డౌన్‌ సాంకేతిక లోపమే

జిల్లా రిజిస్ర్టార్‌ శ్రీరామ్‌కుమార్‌

సర్వర్‌ డౌన్‌ సాంకేతిక లోపమే. అయినప్పటికి మాన్యువల్‌గా రిజిస్ట్రేషన్లు చేయాలని ఆదేశాలు వచ్చాయి. నేటి నుంచి అదే పద్ధతుల్లో రిజిస్ట్రేషన్లు చేస్తాం. భూముల ధరల పెంపు ప్రక్రియ పూర్తయింది. ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు అందలేదు. అన్నీ సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయాల్లో నేటి నుంచి రిజిస్ట్రేషన్లు పాత పద్ధతిలో జరుగుతాయి. ప్రజలు వినియోగించుకోవచ్చు.

Updated Date - 2023-05-30T23:51:04+05:30 IST