పర్చూరు వైసీపీలో మరో ట్విస్టు
ABN , First Publish Date - 2023-05-22T23:37:31+05:30 IST
పర్చూరు నియోజకవర్గ వైసీపీలో సరికొత్త పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. నియోజకవర్గ నాయకుల మధ్య విభేదాలు పెట్రేగిపోయిన నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి గొట్టిపాటి భరత్‌ను పిలిపించుకుని మాట్లాడడం చర్చనీయాంశమైంది. ఇదే సమయంలో మార్టూరు మండలం ద్రోణాదుల వైసీపీ మద్దతుదారు సర్పంచ్ పార్టీలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని, నియోజకవర్గంలో అవినీతి విచ్చలవిడిగా పెరిగిందని మాట్లాడిన వీడియో వైరల్ అవటం కూడా చర్చనీయాంశమైంది.

గొట్టిపాటి భరత్‌ను పిలిచి మాట్లాడిన సీఎం జగన్
చర్చనీయాంశమైన దళిత సర్పంచ్ వీడియో సమాచారం
(ఆంధ్రజ్యోతి, ఒంగోలు)
పర్చూరు నియోజకవర్గ వైసీపీలో సరికొత్త పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. నియోజకవర్గ నాయకుల మధ్య విభేదాలు పెట్రేగిపోయిన నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి గొట్టిపాటి భరత్‌ను పిలిపించుకుని మాట్లాడడం చర్చనీయాంశమైంది. ఇదే సమయంలో మార్టూరు మండలం ద్రోణాదుల వైసీపీ మద్దతుదారు సర్పంచ్ పార్టీలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని, నియోజకవర్గంలో అవినీతి విచ్చలవిడిగా పెరిగిందని మాట్లాడిన వీడియో వైరల్ అవటం కూడా చర్చనీయాంశమైంది. అనేక పరిణామాల అనంతరం జనవరిలో నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జిగా చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ నియమితులయ్యారు. ఆ తర్వాత కూడా నియోజకవర్గంలో పార్టీ నాయకులు ఏకతాటిపై నడవటం లేదు. పైపెచ్చు ఆమంచి అనుకూల, వ్యతిరేక గ్రూపులుగా విడిపోయారు. సాక్షాత్తు ఆ పార్టీ ఇంకొల్లు జడ్పీటీసీ సభ్యుడు అవినీతి, మాఫియా రాజ్యం సాగుతోందంటూ బహిరంగ విమర్శలు చేయడం సంచలనానికి దారితీశాయి. తదనంతరం వివిధ రకాల వ్యాపారులపై అక్రమ కేసులు, అధికారుల దాడులు, ఇతరత్రా చోటుచేసుకున్న పరిణామాలు మరింత వివాదాస్పదంగా మారాయి. ఈ నేపథ్యంలో కొద్దిరోజులక్రితం నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి ఆమంచి కృష్ణమోహన్ ముఖ్యమంత్రిని కలిశారు. వారి మధ్య జరిగిన సంభాషణ ఏమిటనే విషయాన్ని పక్కనబెడితే నియోజకవర్గ పార్టీలో అసంతృప్తితో ఉన్న నాయకులందరినీ వైసీపీ తరఫున ఐప్యాక్ ప్రతినిధులు కలిసి మాట్లాడటం జోరందుకుంది.
సీఎంను కలిసిన భరత్
నియోజకవర్గంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు అటుంచితే, సోమవారం సాయంత్రం 3 గంటల తర్వాత సీఎం జగన్‌ను ఆ నియోజకవర్గానికి చెందిన వైసీపీ మాజీ ఇన్‌చార్జి గొట్టిపాటి భరత్, వారి తల్లి కలిశారు. దివంగత గొట్టిపాటి నరసయ్య కుమారుడైన భరత్ 2014లో వైసీపీ తరఫున నియోజకవర్గంలో పోటీ చేసి ఓడిపోయారు. 2019 ఎన్నికలకు ముందు ఆయనను ఇన్‌చార్జి పదవి నుంచి తప్పించారు. అప్పట్లో పాదయాత్ర సందర్భంగా నియోజకవర్గానికి వచ్చిన జగన్.. భరత్‌కు ఎమ్మెల్సీ పదవి ఇస్తానని హామీ ఇచ్చారు. అవేమీ నెరవేరకపోవడంతో చాలాకాలం నుంచి పార్టీ కార్యక్రమాలకు భరత్ దూరంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో సీఎం కార్యాలయం నుంచి వచ్చిన సమాచారంతో భరత్, ఆయన తల్లి జగన్‌ను కలవటం గమనార్హం. సుమారు అరగంటకు పైగా వారు సీఎం జగన్‌తో సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు. నియోజకవర్గానికి సంబంధించిన అంశాలపైనే ప్రధానంగా చర్చ సాగినట్లు తెలిసింది. ఆ సమావేశం సారాంశం వెల్లడికానప్పటికీ రాజకీయంగా, ముఖ్యంగా పార్టీపరంగా యాక్టివ్‌గా ఉండాలని జగన్ వారికి సూచించినట్లు తెలిసింది. తాజా పరిణామాల నేపథ్యంలో ఈ కలయికపై వైసీపీ శ్రేణులు రకరకాల అంచనాలకు వస్తున్నారు.
దళిత సర్పంచ్ ఆవేదన
కాగా మార్టూరు మండలం ద్రోణాదుల సర్పంచ్ వంకాయలపాటి భాగ్యారావు అనేక అంశాలపై ఆవేదన వ్యక్తం చేస్తూ ఒక వీడియో సందేశాన్ని వైరల్ చేశారు. స్థానికంగా పార్టీలో దళితుల పట్ల చిన్నచూపు చూస్తున్నారని ఆరోపణ చేశారు. గ్రామ సర్పంచ్‌లకు విడుదల కావాల్సిన నిధులను అధికారికంగా ఇన్‌చార్జి ఆపేయిస్తున్నాడని ఆమంచిపై ఆరోపణలు చేశారు. ఇలా రకరకాల ఆరోపణలతో తన ఆవేదనను వ్యక్తం చేస్తూ వీడియో సందేశాన్ని వైరల్ చేశారు. అంతేగాక ఇటీవల యద్దనపూడి మండలంలో వైసీపీలోని రెండు గ్రూపుల మధ్య జరిగిన ఘర్షణలు, వివాదాలు సమసిపోకపోగా మరింత ముదురుతున్నాయి. దీంతో నియోజకవర్గంలోని వైసీపీలో జరుగుతున్న పరిణామాలు అందరిలోను చర్చనీయాంశంగా మారగా, పార్టీ అగ్రనాయకత్వం కలవరం చెందుతోంది.