26 kgs Rice Bag: భారీగా పెరిగిన బియ్యం రేట్లు..!

ABN , First Publish Date - 2023-07-16T12:07:18+05:30 IST

తెలుగు రాష్ట్రాల నుంచి బియ్యం ఆయా రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి. ఇక్కడ ఒక పంట పోవడం, పొరుగు రాష్ట్రాలకు ఎగుమతి కావడంతో బియ్యం రేట్లు పెంచేస్తున్నారు. ఈరోజు ఉన్న ధర రేపు ఉండడం లేదు. లలిత, అక్షయ, ఆవుదూడ, బెల్‌ తదితర రకాలు మూడు, నాలుగు నెలల క్రితం 26 కిలోల బస్తా రూ.1,200-రూ.1,250 మధ్య లభించేవి. ఇప్పుడు రూ.1,450-రూ.1,550కి అమ్ముతున్నారు.

26 kgs Rice Bag: భారీగా పెరిగిన బియ్యం రేట్లు..!

నిత్యావసర సరకుల ధరలు నింగిని తాకుతున్నాయి. బియ్యం దగ్గర నుంచి కూరగాయల వరకూ అన్నింటి రేట్లు భారీగా పెరిగిపోయాయి. ఇక పప్పుల సంగతి చెప్పనక్కర్లేదు. వ్యాపారుల పప్పులే ఉడుకుతున్నాయి. కొనుగోలుదారులకు కష్టాలే మిగులుతున్నాయి. ఈ ధరలు తట్టుకోలేక రోజు కూలీలు కూరలు వండుకోవడం మానేస్తున్నారు. పచ్చడి మెతుకులతో కాలం నెట్టుకువస్తున్నారు.


బియ్యం కిలో రూ.55-60

ప్రభుత్వం కిలో రెండు రూపాయలకు బియ్యం ఇస్తున్నా వాటిని ఎవరూ తినడం లేదు. ప్రతి ఒక్కరు సన్న బియ్యాన్నే వాడుతున్నారు. ఈ అలవాటు తెలుగు రాష్ట్రాల నుంచి పొరుగునున్న తమిళనాడు, కేరళ, ఒడిశాలకు పాకింది. దాంతో బియ్యం ఆయా రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి. ఇక్కడ ఒక పంట పోవడం, పొరుగు రాష్ట్రాలకు ఎగుమతి కావడంతో బియ్యం రేట్లు పెంచేస్తున్నారు. ఈరోజు ఉన్న ధర రేపు ఉండడం లేదు. లలిత, అక్షయ, ఆవుదూడ, బెల్‌ తదితర రకాలు మూడు, నాలుగు నెలల క్రితం 26 కిలోల బస్తా రూ.1,200-రూ.1,250 మధ్య లభించేవి. ఇప్పుడు రూ.1,450-రూ.1,550కి అమ్ముతున్నారు.

పచ్చిమిర్చి ఘాటు

కూరల్లో వేసుకునే పచ్చిమిర్చి రెండు నెలల క్రితం కిలో రూ.28 ఉండేది. ఇప్పుడు అదే మిర్చి కిలో రూ.120కి రైతుబజార్లలోనే అమ్ముతున్నారు. బయట అయితే రూ.200కుపైగా పలుకుతోంది. పంట పోవడం వల్ల సరకు అందుబాటులో లేదని, అందుకే పెరిగిపోయిందని అంటున్నారు. వెల్లుల్లి కిలో మంచి రకం కిలో రూ.80 పెడితే లభించేది. ఇప్పుడు అది కిలో రూ.170కి చేరింది. అల్లం కిలో రూ.80 ఉండేది. అది రూ.200కి పెరిగింది. అయినా ఒక్కోసారి మార్కెట్‌లో దొరకడం లేదు. ఇక టమాటా సంగతి చెప్పక్కర్లేదు. రైతుబజార్లలో కిలో రూ.100 చొప్పున అమ్ముతున్నారు. బయట రూ.140. రెండు రోజులకు ఓసారి ప్రభుత్వం రైతుబజార్లలో రాయితీ ధరపై కిలో రూ.50కి ఇస్తోంది. అవి అందరికీ అందడం లేదు. ముందువెళ్లిన వారికే లభిస్తున్నాయి. ఈ ధరలన్నీ ఎప్పుడు దిగివస్తాయో తెలియడం లేదు. ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఉంది. ధరలు దిగివచ్చేలా ప్రయత్నాలు ఏమీ చేయడం లేదు.

ఇదిలా వుంటే పులి మీద పుట్రలా నెలనెలా విద్యుత్‌ బిల్లులు పెరిగిపోతున్నాయి. ఏసీలు వాడని ఇళ్లకు కూడా వేయి రూపాయల వరకు బిల్లు కట్టాల్సి వస్తోంది. ఇంతకు ముందు కంటే 30 నుంచి 40 శాతం బిల్లులు పెరిగాయి. వినియోగం పెరగకపోయినా కేవలం అదనపు చార్జీల వల్ల అధిక మొత్తాలు చెల్లించాల్సి వస్తోంది. విద్యా సంవత్సరం మొదలు కావడంతో ప్రైవేటు పాఠశాలలు ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. పిల్లల పుస్తకాలు, యూనిఫారాలు అక్కడే కొనాలని వేధిస్తున్నారు. ఇవన్నీ వేలల్లో ఉంటున్నాయి. అరకొర ఆదాయంతో నగరంలో ఎలా బతకాలా? అని దిగువ మధ్య తరగతి ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ఖర్చులకు డబ్బులు సరిపోక అప్పులు చేయకతప్పడం లేదని వాపోతున్నారు.

Updated Date - 2023-07-16T12:07:21+05:30 IST