Jagan offer to Adani: అదానీ గురించి దేశమంతా అలాఇలా అనుకుంటుంటే..

ABN , First Publish Date - 2023-02-09T02:40:11+05:30 IST

అదానీ గ్రూప్‌ కంపెనీలపై వైసీపీ సర్కారు మరోసారి అంతులేని ప్రేమను కురిపించింది. బుధవారం జరిగిన కేబినెట్‌ భేటీలో ఆ సంస్థకు చెందిన కంపెనీలకు భూ సంతర్పణ చేసింది.

Jagan offer to Adani: అదానీ గురించి దేశమంతా అలాఇలా అనుకుంటుంటే..

రాష్ట్రంలో భారీగా భూసంతర్పణ

వందల ఎకరాలిచ్చిన జగన్‌ సర్కారు

కేబినెట్‌ సమావేశంలో కీలక నిర్ణయాలు

పంప్డ్‌ హైడ్రో స్టోరేజీ పవర్‌ ప్రాజెక్టుకు భారీగా భూములు

విశాఖలో మరో డేటా సెంటర్‌కు 60 ఎకరాలు

139 ఎకరాల్లో ఇప్పటికీ మొదలేకానీ పనులు

అయినా, అదానీ గ్రూప్‌నకు అదనంగా భూములు

అదానీ వ్యవహారంపై అటు దేశం, ఇటు పార్లమెంటు అట్టుడికిపోతున్నాయి. ‘అదానీ దోస్త్‌ మోదీ బదులివ్వాలి’ అనే డిమాండ్లతో న్యూస్‌ చానళ్ల స్టూడియోలు, మీడియా తెరలు మార్మోగిపోతున్నాయి. అదానీ పెట్టుబడులు కుదేలవుతున్నాయి. ఎన్ని కాయకల్ప చికిత్సలు చేస్తున్నా ఈ కంపెనీ షేర్ల పతనం ఇంకా పూర్తిగా సర్దుకోలేదు. అయినా.. అదానీ గ్రూప్‌ కంపెనీలపై వైసీపీ సర్కారు అంతులేని ప్రేమ కించిత్తు కూడా తగ్గలేదు. బుధవారం జరిగిన రాష్ట్ర కేబినెట్‌ భేటీలో ఆ సంస్థకు చెందిన కంపెనీలకు భారీగా భూ సంతర్పణ చేసింది. వందల ఎకరాల భూములను కేబినెట్‌ సమావేశంలో పంప్డ్‌ హైడ్రో స్టోరేజీ పవర్‌ ప్రాజెక్టు, డేటా సెంటర్‌ల కోసం కేటాయించింది.

విశాఖపట్నం (ఆంధ్రజ్యోతి): అదానీ గ్రూప్‌ కంపెనీలపై వైసీపీ సర్కారు మరోసారి అంతులేని ప్రేమను కురిపించింది. బుధవారం జరిగిన కేబినెట్‌ భేటీలో ఆ సంస్థకు చెందిన కంపెనీలకు భూ సంతర్పణ చేసింది. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని తాడిమర్రి మండలం పెద్దకోట్ల, దాడితోట గ్రామాల్లో అదానీ గ్రీన్‌ ఎనర్జీ లిమిటెడ్‌కు 500 మెగావాట్ల పంప్డ్‌ హైడ్రో స్టోరేజ్‌ పవర్‌ ప్రాజెక్టు ఏర్పాటు చేసేందుకు 406.46 ఎకరాల భూమిని, ఎకరం రూ.5లక్షల చొప్పున కేటాయించాలన్న ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. అలాగే... ఈ ప్రాజెక్టు కోసం కడప జిల్లాలో 470 ఎకరాలు, మన్యం పార్వతీపురం జిల్లాలో 362 ఎకరాలు...ఇదే జిల్లాలో మరో 318 ఎకరాలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా విశాఖలో డేటా సెంటర్‌ ఏర్పాటు కోసం మరో 60.29 ఎకరాలు కేటాయిస్తున్నట్టు ప్రకటించింది. విశాఖలో డేటా సెంటర్‌ కోసం స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌ కింద ఏర్పాటుచేసిన ‘వైజాగ్‌ టెక్‌ పార్క్‌ లిమిటెడ్‌ (వీటీపీఎల్‌)’కు ఈ భూమి కేటాయిస్తున్నట్టు పేర్కొంది. ఈ భూమిలో రూ.7,210 కోట్ల పెట్టుబడితో 100 మెగావాట్ల డేటా సెంటర్‌, బిజినెస్‌ పార్కు, స్కిల్‌ యూనివర్సిటీ, రిక్రియేషన్‌ సెంటర్‌ ఏర్పాటుచేసి, 14,285 మందికి ఉపాధి కల్పించాల్సి ఉంటుందని తెలిపింది. భూమితో పాటు ప్రభుత్వ పారిశ్రామిక విధానంలో మినహాయింపులు, రాయితీలు ఇవ్వనున్నట్టు మంత్రివర్గం ప్రకటించింది.

‘అస్మదీయుల’కు పంపకాలు..

పంప్డ్‌ స్టోరేజీ హైడల్‌ పవర్‌ ప్రాజెక్టు కోసం అరబిందోకు నంద్యాలలో 800 మెగవాట్ల విద్యుదుత్పత్తి ప్లాంటు కోసం 340 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. కడప జిల్లాకు చెందిన షిర్డి సాయి ఎలకా్ట్రనిక్స్‌ లిమిటెడ్‌కు కడపలో 450 ఎకరాలు, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 736 ఎకరాలను కేటాయించింది. ఇండోసోల్‌ సోలార్‌కు కడపలో 1200 మెగావాట్ల ప్లాంటు కోసం 450 ఎకరాలు , మరో 1000 మెగావాట్ల ప్లాంటు కోసం ఇంకో 400 ఎకరాలు కేటాయించింది. అదేవిధంగా అరబిందోకు అనంతపురంలో 800 మెగావాట్ల ప్లాంటుకోసం 650 ఎకరాలను కేబినెట్‌ ఆమోద ముద్ర వేసింది .అదేవిధంగా ఎకోరన్‌ 1000 మెగవాట్ల చొప్పున విండ్‌, సోలార్‌ ప్రాజెక్టులను అనంతపురం, శ్రీసత్యసాయి, కర్నూలు జిల్లాల్లో ఏర్పాటు చేసేందుకు కేబినెట్‌ ఆమోదం చెప్పింది. అదానీ మూడేళ్ల క్రితం ఏర్పాటు చేసిన వీటీపీఎల్‌కు విశాఖలో మొదట 130 ఎకరాలు, ఆ తరువాత మరో 9 ఎకరాలు కేటాయించారు. అందులో 200 మెగావాట్ల డేటా సెంటర్‌, బిజినెస్‌ పార్కు, స్కిల్‌ యూనివర్సిటీ, రిక్రియేషన్‌ సెంటర్‌ను ఏర్పాటుచేయాలని ఒప్పందం జరిగింది. దీనికి పెట్టుబడి రూ.14,634 కోట్లు. ఇవ్వాల్సిన ఉద్యోగాల సంఖ్య 24,990. భూమి కేటాయించిన మూడేళ్లలో పనులు ప్రారంభించాలి. ఇప్పటివరకు దానికే అతీగతీ లేదు. కొత్తగా మరో 60.29 ఎకరాలు కేటాయించడంపై పారిశ్రామిక వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి.

సీఈఏ మార్గదర్శకాలకూ తూట్లు

పంప్ట్‌ స్టోరేజీ హైడల్‌ పవర్‌ ప్రాజెక్టు పాలసీ 2022 డిసెంబరు 20 వతేదీన జారీ చేసిన జీవో నంబరు 25 మేరకు అదానీ, శ్రీషిర్డీ సాయి, అరబిందో, ఇండోసోల్‌ కంపెనీలకు కేబినెట్‌ ఆమోద ముద్ర వేసింది. కేంద్ర విద్యుత్తు సంస్థ (సీఈఏ) మార్గదర్శకాల మేరకు .. పంప్డ్‌ స్టోరేజీ హైడల్‌పవర్‌ ప్లాంట్ల కోసం ఇచ్చే భూములను పారదర్శకంగా టెండర్లను పిలిచి ప్రభుత్వానికి అధిక ఆదాయాన్ని.. దీర్ఘకాలిక లబ్ధిని చేకూర్చే సంస్థలకే కేటాయించాలి. కానీ .. రాష్ట్రంలో టెండరు ప్రక్రియ జరగకుండానే .. ప్రభుత్వం ఆమోద ముద్ర వేయడం .. అందునా .. వ్యాపార రంగంలో మునిగిపోతున్న అదానీ సంస్థకు పంప్డ్‌ స్టోరేజీ హైడల్‌ పవర్‌ ప్లాంటులను అప్పగించడం విమర్శలకు తావిస్తోంది.

Updated Date - 2023-02-09T14:54:38+05:30 IST