Viveka Case: వివేకా హత్య కేసు విచారణలో మరో కీలక పరిణామం.. దస్తగిరికి కోర్టు నోటీసులు
ABN , First Publish Date - 2023-04-20T16:27:34+05:30 IST
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడు దస్తగిరి అప్రూవర్‌గా మారడాన్ని సవాల్ చేస్తూ వైఎస్ భాస్కర్‌రెడ్డి...
హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో (YS Vivekananda Case) నిందితుడు దస్తగిరి (Dastagiri) అప్రూవర్‌గా మారడాన్ని సవాల్ చేస్తూ వైఎస్ భాస్కర్‌రెడ్డి (YS Bhaskar Reddy), వివేకా పీఏ కృష్ణారెడ్డి వేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో (Telangana High Court) విచారణ జరిగింది. దస్తగిరి బెయిల్ రద్దు చేయాలని, దస్తగిరిని సీబీఐ అధికారులు అప్రూవర్‌గా మార్చారని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై ఈరోజు హైకోర్టులో విచారణకు రాగా.. దస్తగిరిని అప్రూవర్‌గా మార్చవద్దని భాస్కర్‌రెడ్డి, కృష్ణారెడ్డి వాదనలు వినిపించారు. వాదనలు విన్న కోర్టు.. ఈ కేసుకు సంబంధించి కౌంటర్ దాఖలు చేయాలని నిందితుడు దస్తగిరికి తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను మూడు వారాలకు హైకోర్టు వాయిదా వేసింది.
ప్రాణహానీ అంటూ దస్తగిరి సంచలన వ్యాఖ్యలు...
వివేకా కేసులో దూకుడు పెంచిన సీబీఐ.. వైఎస్ భాస్కర్‌రెడ్డిని అరెస్ట్ చేయడంతో పాటు ఎంపీ అవినాష్ రెడ్డిని (MP Avinash Reddy) విచారిస్తోంది. ఈ నేపథ్యంలో భద్రతపై దస్తగిరి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు ప్రాణాహానీ ఉందంటూ కడప ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి (AP CM YS Jaganmohan Reddy), ఎంపీ అవినాష్ రెడ్డి నుంచి తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. తనకు సెక్యూరిటీని పెంచాలని కోరారు. దీంతో దస్తగిరికి పోలీసులు భద్రత పెంచారు. దస్తగిరికి రక్షణగా ఇప్పటికే ఉన్న కానిస్టేబుల్‌తో పాటు మరో ఐదుగురు పోలీసుల సిబ్బందితో రక్షణ కల్పించారు. ఆయన ఇంటి సమీపంలోనూ పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని దస్తగిరి మీడియాకు తెలియజేశారు.
అసలు ఈ దస్తగిరికీ, వివేకా హత్యకు సంబంధం ఏంటంటే..
వైఎస్ వివేకానందరెడ్డి హత్య వెనుక ఉన్న ప్రముఖుల పేర్లు వెల్లడించి సంచలనం సృష్టించిన దస్తగిరి.. రెండు సార్లు వాంగ్మూలం ఇచ్చిన సంగతి తెలిసిందే. అక్టోబరులో ఏ-1 నిందితుడిగా ఎర్ర గంగిరెడ్డిని, ఏ-2గా సునీల్ యాదవ్, ఏ-3గా ఉమాశంకర్‌రెడ్డి, ఏ-4గా దస్తగిరిని పేర్కొంటూ పులివెందుల కోర్టులో సీబీఐ ప్రాథమిక చార్జిషీటు దాఖలు చేసింది. అనంతరం దస్తగిరి అప్రూవర్‌గా మారారు. ఆ తర్వాత కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి సన్నిహితుడు, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిని సీబీఐ అరెస్టు చేసింది. అతన్ని ఐదో నిందితుడిగా చేర్చుతూ జనవరి 31, 2022న రెండో చార్జిషీటును పులివెందుల కోర్టుకు సమర్పించింది. ఆ క్రమంలోనే దస్తగిరి అప్రూవర్‌గా మారడాన్ని వ్యతిరేకిస్తూ ఎర్ర గంగిరెడ్డి, ఉమాశంకర్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిని కోర్టు కొట్టివేస్తూ దస్తగిరి అప్రూవర్‌గా మారడం సరైందేనని నిర్ధారించింది. ఆ నేపథ్యంలో అప్పట్లో దస్తగిరి రెండోసారి వాంగ్మూలం ఇచ్చారు.