కొబ్బరి బొండాలకు భలే డిమాండ్
ABN , First Publish Date - 2023-06-13T03:56:57+05:30 IST
రాష్ట్రవ్యాప్తంగా కొబ్బరిబొండాలకు భలే డిమాండ్ ఏర్పడింది. బొండాల ధరలు అమాంతం పెరిగాయి.

లీటరు కొబ్బరి నీళ్ల ధర రూ.150!
అమరావతి, జూన్ 12 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా కొబ్బరిబొండాలకు భలే డిమాండ్ ఏర్పడింది. బొండాల ధరలు అమాంతం పెరిగాయి. వారం రోజుల వ్యవధిలో ఒక్కో బొండానికి రూ.5-6పెరిగింది. దీంతో గతనెలలో రూ.16-20వేలు మధ్య ఉన్న వివిధ రకాల వెయ్యి బొండాలు ఇప్పుడు రూ.22-25 వేలకు పెరిగాయని చెప్తున్నారు. ఇది కాకుండా 100 కిలోమీటర్ల రవాణా చార్జీ రూ.5,500 వసూలు చేస్తున్నారు. దీంతో వెయ్యి బొండాల ధర రూ.25-30వేలకు చేరిందంటున్నారు. చిన్న బొండాం రూ.30-35 పలుకుతుండగా, గంగా భవానీ రకం రూ.40పైన చెప్తున్నారు. తాజాగా లీటరు కొబ్బరి నీళ్ల ధర రూ.120 నుంచి రూ.150కు చేరింది. ఎక్కువమంది వర్తకులు ప్రత్యేకంగా తయారైన 750ఎంఎల్, 900 ఎంఎల్ బాటిళ్లను రూ.100, రూ.120కి అమ్ముతున్నారు.
ఇంత డిమాండ్ ఎందుకు?
ఎండలు, వడగాడ్పుల కారణంగా విపరీతమైన డిమాండ్ రావడంతో బొండాల ధరలు పెరిగాయని రిటైల్ వ్యాపారులు చెప్తున్నారు. కానీ, రుతుపవనాల రాక ఆలస్యమై, ఎండలు, వడగాడ్పులకు దిగుబడి లేక బొండాలకు డిమాండ్ వచ్చింది. ప్రస్తుతం ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల్లో కొబ్బరి తోటలపై తెల్ల దోమ దాడి ఉధృతమైంది. తెల్లదోమ సోకితే.. కాపు తగ్గిపోతుందని కొబ్బరి రైతులు చెప్తున్నారు. పొడి వాతావరణం వల్ల తెగుళ్లు వ్యాప్తి చెందుతున్నాయని, వర్షాలు కురిస్తేనే తోటలు జీవం పోసుకుంటాయని అంటున్నారు. కాగా, వేసవి కారణంగా కొన్ని పండ్ల ధరలు విపరీతంగా పెరిగాయి. గత నెల వరకు కిలో రూ.100 చొప్పున అమ్మిన నల్ల, తెల్ల ద్రాక్ష ఇప్పుడు ఏకంగా రూ.200 చెప్తున్నారు. దానిమ్మ పండ్లు రూ.100కు రెండు, మూడు మాత్రమే ఇస్తున్నారు. తెల్ల కిస్‌మిస్ అసలు మార్కెట్‌లోనే లేకుండా పోయింది. నాటు, హైబ్రిడ్ పుచ్చ కాయలు కూడా మార్కెట్‌లో లేకుండా పోయాయి. నల్లవి చిన్న కాయ కూడా రూ.50పైనే చెప్తున్నారు.