గందరగోళంగా ‘ఫిష్‌ ఆంధ్ర’

ABN , First Publish Date - 2023-04-12T01:19:14+05:30 IST

జిల్లాలో ఫిష్‌ ఆంధ్ర అవుట్‌ లెట్లు ప్రస్తుతం మూడే నడుస్తున్నాయి.

గందరగోళంగా ‘ఫిష్‌ ఆంధ్ర’

నగరంలో నాలుగు షాపులు ఏర్పాటు

ఒకటి మూత, ప్రస్తుతం నడుస్తున్నవి మూడు

అవి కూడా ఎప్పుడు తెరుస్తారో, ఎప్పుడు మూసేస్తారో తెలియని పరిస్థితి

మార్కెట్‌ రేటుకే విక్రయాలు...వినియోగదారుల పెదవివిరుపు

విశాఖపట్నం, ఏప్రిల్‌ 11 (ఆంధ్రజ్యోతి):

జిల్లాలో ఫిష్‌ ఆంధ్ర అవుట్‌ లెట్లు ప్రస్తుతం మూడే నడుస్తున్నాయి. అవి కూడా ఎప్పుడు ఉంటాయో, ఎప్పుడు మూసేస్తారో తెలియదు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశం మేరకు ఫిష్‌ ఆంధ్ర మినీ తొలి అవుట్‌లెట్‌ను పెదగంట్యాడ మండలం బీసీ రోడ్డులో 2021 సెప్టెంబరులో ఏర్పాటుచేశారు. అది కొద్ది నెలలే నడిచింది. ఆ తరువాత మూతపడింది. మాధవధార, సీతమ్మధార, గోపాలపట్నం, రుషికొండ, మంగమారిపేట, ఆనందపురంలలో ఆరు కేంద్రాల ఏర్పాటుకు మత్స్య శాఖ అధికారులు అనుమతులు ఇచ్చారు. అయితే రుషికొండ, మాధవధార, సీతమ్మధారల్లోనే ఏర్పాటయ్యాయి. మిగిలినచోట్ల ఇంకా పెట్టలేదు. పై మూడు కేంద్రాలు కూడా ఎప్పుడు తెరుస్తారో, ఎప్పుడు మూసేస్తారో తెలియని పరిస్థితి. పెద్దగా ప్రచారం లేదు. వీరికి ప్రభుత్వం తరపున ఎటువంటి చేపల సరఫరా లేదు. అందరిలాగే ఫిషింగ్‌ హార్బర్‌కు వెళ్లి కొని తెచ్చుకొని అమ్ముకోవడమే. తక్కువ ధరకు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అది కూడా లేదు. మార్కెట్‌లో ఏ రేటు అయితే వుందో అంతే రేటుకు అమ్ముతున్నారు. అన్నిరకాలు దొరకడం లేదు.

ఈ యూనిట్‌ పెట్టుకోవడానికి లక్ష రూపాయల నుంచి మూడు లక్షల రూపాయలు అవుతుంది. ఉత్సాహవంతులు అన్నీ సమకూర్చుకొని సక్రమంగా నడుపుకొంటే...40 శాతం రాయితీ ఉంటుందని అధికారులు చెప్పారు. కానీ ఇది కూడా ఇప్పటివరకు తేల్చలేదు. విశాఖపట్నంలో ‘ఫిష్‌ ఆంధ్ర’ ఫిట్‌ కాలేదు.

Updated Date - 2023-04-12T01:19:15+05:30 IST