మన్యంలో భారీ వర్షం
ABN , Publish Date - Apr 04 , 2025 | 12:53 AM
మన్యంలో గురువారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. వాతావరణం చల్లబడడంతో జనం ఊరట చెందారు. జిల్లా కేంద్రం పాడేరు మొదలుకుని ఏజెన్సీలోని అన్ని మండలాల్లోనూ ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది.

- ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ.. సాయంత్రం జోరువాన
- చల్లబడిన వాతావరణం
- ఊరట చెందిన జనం
పాడేరు, ఏప్రిల్ 3(ఆంధ్రజ్యోతి): పాడేరులో ఉదయం నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు సాధారణ వాతావరణం నెలకొంది. ఆ తరువాత వాతావరణం మారిపోయి ఆకాశం మేఘావృతమై నాలుగు గంటలకు భారీ వర్షం మొదలైంది. సమారు గంటన్నర పాటు భారీగా వర్షం కురిసింది. పాడేరు, పరిసర ప్రాంతాలతో పాటు ముంచంగిపుట్టు, పెదబయలు, హుకుంపేట, జి.మాడుగుల, చింతపల్లి, జీకేవీధి ప్రాంతాల్లో భారీగా, కొయ్యూరులో మోస్తరుగా వర్షం పడింది. రాత్రి సైతం జల్లులతో కూడిన వర్షం కొనసాగింది.
కొయ్యూరులో 36.3 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత
ఏజెన్సీలో గురువారం వర్షం కురిసినప్పటికీ గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో మాత్రం ఎటువంటి మార్పులేదు. కొయ్యూరులో 36.3 డిగ్రీలు, జి.మాడుగులలో 35.5, డుంబ్రిగుడలో 34.9, అరకులోయలో 34.5, హుకుంపేటలో 34.0, జీకేవీధిలో 33.2, చింతపల్లిలో 32.8, అనంతగిరిలో 30.1 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
చింతపల్లిలో...
చింతపల్లి: మండలంలో ఓ మోస్తరు వర్షం కురిసింది. గురువారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత అధికంగా ఉంది. మధ్యాహ్నం రెండు గంటలకు ఒక్కసారిగా వాతావరణంలో మార్పు వచ్చింది. సాయంత్రం నాలుగు గంటల నుంచి ఐదు గంటల వరకు వర్షం కురిసింది. వర్షం వల్ల లంబసింగి వారపు సంతలో వర్తకులు, వినియోగదారులు ఇబ్బంది పడ్డారు.
జీకేవీధిలో...
గూడెంకొత్తవీధి: మండలంలో గురువారం వర్షం కురిసింది. మధ్యాహ్నం రెండు గంటల నుంచి నాలుగు గంటల వరకు వర్షం పడడంతో ప్రధాన రహదారులు, పంట పొలాలు జలమయమయ్యాయి. జీకేవీధి వారపు సంతలో వర్తకులు, వినియోగదారులు వర్షానికి ఇబ్బంది పడ్డారు.
డుంబ్రిగుడలో..
డుంబ్రిగుడ: మండల పరిధిలో పలు చోట్ల గురువారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రంగా కాసింది. ఆ తరువాత ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో గిరిజనులు ఉపశమనం పొందారు.
జి.మాడుగులలో..
జి.మాడుగుల: మండలంలోని బొయితిలి మద్దిగరువు, నుర్మతి భీరం పంచాయతీల పరిఽధిలో గురువారం భారీ వర్షం కురిసింది. గురువారం మద్దిగరువు వారపు సంత కావడంతో కురిసిన వర్షానికి వర్తకులు, వినియోగదారులు ఇబ్బందులు పడ్డారు.
ధారకొండలో..
సీలేరు: జీకేవీధి మండలం ధారకొండలో గురువారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రతతో ఇబ్బంది పడిన జనం సాయంత్రం వర్షం కురవడంతో ఊరట చెందారు.
ముంచంగిపుట్టులో..
ముంచంగిపుట్టు: మండల పరిధిలో గురువారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండకాయగా, సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయి వర్షం కురిసింది.