భానుడు భగభగ

ABN , First Publish Date - 2023-05-28T00:55:28+05:30 IST

నిర్మానుష్యంగా ఉన్న అనకాపల్లి నుంచి చోడవరం వెళ్లే మార్గం

భానుడు భగభగ
నిర్మానుష్యంగా ఉన్న అనకాపల్లి నుంచి చోడవరం వెళ్లే మార్గం

మాకవరపాలెంలో 42.2 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత

అనకాపల్లి, మే 27 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. గత రెండు, మూడు రోజులుగా పలు మండలాల్లో అక్కడక్కడా వర్షపు జల్లులు కురిసినా శనివారం మాత్రం పలు మండలాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండల తీవ్రత, వడగాడ్పులతో జనం ఉక్కబోతతో అల్లాడిపోయారు. జిల్లాలో మాకవరపాలెంలో అత్యధికంగా 42.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, రాంబిల్లిలో 34.2 డిగ్రీల అత్యల్ప ఉస్ణోగ్రతలు నమోదయ్యాయి. అనకాపల్లి 41,8 డిగ్రీలు, నర్సీపట్నం 41.2, రావికమతం 41.6, నాతవరం 40.7, అచ్యుతాపురం 36.4, బుచ్చెయ్యపేట 40.8, చీడికాడ 39.1, చోడవరం 39.8, దేవరాపల్లి 40.1, గొలుగొండ 40.5, సబ్బవరం 40.7, కె.కోటపాడు 41.1, కశింకోట 40.7, కోటవురట్ల 40.2, రోలుగుంట 40.4, మాడుగుల 40.8, మునగపాక 39.6, నక్కపల్లి 36.8, పరవాడ 36.4, ఎలమంచిలి 36.8, పాయకరావుపేట 38.2, ఎస్‌.రాయవరం 37.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జిల్లాలో రానున్న మరో రెండు రోజులు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, పలు మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశాలు ఉన్నాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.

రహదారులు నిర్మానుష్యం

అనకాపల్లి టౌన్‌: అనకాపల్లి పట్టణంలో భానుడు నిప్పులు చెరిగాడు. ఒక పక్క ఉష్ణోగ్రత, మరో పక్క వడగాడ్పులతో ప్రజలు అల్లాడిపోయారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వివిధ పనులపై పట్టణానికి వచ్చిన గ్రామీణ ప్రజలు ఎండ తీవ్రతకు విలవిలలాడారు. పట్టణంలోని నెహ్రూచౌక్‌, చోడవరం వెళ్లే మార్గం, రింగురోడ్డు, మెయిన్‌రోడ్డు, రైల్వేస్టేషన్‌రోడ్లు జనసందడి లేక నిర్మానుష్యంగా కనిపించాయి. సాయంత్రం నాలుగు గంటల తరువాత వాతావరణంలో మార్పులు వచ్చినప్పటికీ చల్లదనం కానరాకపోవడంతో రోడ్ల మీద తిరిగే వారితో పాటు ఇళ్లల్లో ఉన్న వారు కూడా ఇబ్బందులు పడక తప్పలేదు. ఉష్ణోగ్రతలు పెరగడంతో శీతల పానీయాల దుకాణాలు రద్దీగా మారాయి. రోడ్లపై వ్యాపారాలు సాగించే చిరు వ్యాపారులకు అవస్థలు తప్పలేదు.

Updated Date - 2023-05-28T00:55:42+05:30 IST

News Hub