ఉక్కు అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ
ABN , Publish Date - Mar 23 , 2025 | 01:06 AM
స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కూర్మన్నపాలెంలో ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో శనివారం రాత్రి అఖిలపక్ష కార్మిక సంఘాల పర్యవేక్షణలో ఉద్యోగులు, కార్మికులు కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు.

కూర్మన్నపాలెం,మార్చి 22 (ఆంధ్రజ్యోతి): స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కూర్మన్నపాలెంలో ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో శనివారం రాత్రి అఖిలపక్ష కార్మిక సంఘాల పర్యవేక్షణలో ఉద్యోగులు, కార్మికులు కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా పోరాట కమిటీ చైర్మన్లు డి.ఆదినారాయణ, మంత్రి రాజశేఖర్‌లు మాట్లాడుతూ దీక్షలు చేపట్టి 1,500 రోజులైన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. స్టీల్‌ప్లాంటును సెయిల్‌లో విలీనం చేయాలని, నిర్వాసితులకు న్యాయం చేయాలని, తొలగించిన కాంట్రాక్టు కార్మికులను తక్షణమే విధుల్లోకి తీసుకోవడంతో పాటు ఇకపై ఎవరిని విధుల నుండి తొలగించరాదని డిమాండ్ చేశారు. ఉద్యోగులు, కార్మికులకు పూర్తి స్థాయిలో జీతాలు ఇవ్వడంతో పాటు బకాయిలను తక్షణమే చెల్లించాలన్నారు.
నాయకులు జె.అయోధ్యరామ్, వరసాల శ్రీనివాసరావులు మాట్లాడుతూ ప్లాంటును పరిరక్షించడంతో పాటు నిర్వాసితులకు శాశ్వత ఉపాధి కల్పించాలన్నారు. ప్లాంటుకు మూడేళ్ల పాటు ట్యాక్స్ హాలిడే ప్రకటించాలన్నారు. ఇప్పటికైనా ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తామని పీఎం మోదీ ప్రకటించాలని పేర్కొన్నారు కార్యక్రమంలో నాయకులు ఎన్.రామారావు, కేఎ్‌సఎన్ రావు, నీరుకొండ రామచంద్రరావు, యు.రామస్వామి, జె.రామకృష్ణ, డి.అప్పారావు, ఎన్.సింహాద్రి, పెంటారావు, సత్యారావు, డీసీహెచ్ వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.