మాటలు.. నీటి మూటలు

ABN , First Publish Date - 2023-06-06T00:22:54+05:30 IST

పోలవరం ప్రాజెక్టు పరిధిలో ఈ నాలుగేళ్లల్లో జరిగిన అద్భుతా లంటూ ఏమీ లేవు. దీనిని తామే పూర్తి చేస్తామని, రైతుల కళ్లల్లో వెలుగులు చూస్తామని ఆర్భాటపు ప్రకటనలు చేస్తున్నారు. నిర్వాసితులకు పరిహారం పేరిట పెద్దగా ఊరించారు. పోలవరం ప్రాజెక్టు పను

మాటలు.. నీటి మూటలు

ఈ నాలుగేళ్ల జగన్‌ పాలనలో ఇదే తీరు..

ఆదివాసీలతో అంతా చెడుగుడు

ఓట్ల కాలంలో మాత్రం బారెడు హామీలు

గద్దెనెక్కిన తర్వాత వెనక్కి చూస్తే ఒట్టు

పునరావాసం, పరిహారం గతేమైంది

ప్రాజెక్టుకు కుడి, ఎడమల పెండింగే..

(ఏలూరు–ఆంధ్రజ్యోతి ప్రతినిధి)

పోలవరం ప్రాజెక్టు పరిధిలో ఈ నాలుగేళ్లల్లో జరిగిన అద్భుతా లంటూ ఏమీ లేవు. దీనిని తామే పూర్తి చేస్తామని, రైతుల కళ్లల్లో వెలుగులు చూస్తామని ఆర్భాటపు ప్రకటనలు చేస్తున్నారు. నిర్వాసితులకు పరిహారం పేరిట పెద్దగా ఊరించారు. పోలవరం ప్రాజెక్టు పనులకు ఏ ముహూర్తాన జగన్‌ సర్కార్‌ రివర్స్‌ టెండర్‌ వేసిందో అప్పటి నుంచి అక్కడ అన్నీ రివర్సే. పరిహారం ఇప్పటికీ నిర్వాసితుల చేతిలో పడలేదు. ఇస్తామన్న వ్యక్తిగత పరిహారం జాడే లేదు.

సీఎం జగన్‌ అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత, అంతకుముందు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి నిర్వాసితులకు మరెన్నో హామీలిచ్చారు. ప్రత్యేకించి జగన్‌ సీఎం కాక మునుపు ప్రాజెక్టు ప్రాంతంలో పర్యటించి నిర్వాసిత కుటుంబాలన్నింటికీ ఆనాడు తన తండ్రి వై.ఎస్‌ ఇచ్చిన పరిహారానికి తోడు రెట్టింపు చేస్తామని ప్రకటించారు. వ్యక్తిగత పరిహారంలో ఎలాంటి బేషజాలకు తావివ్వమని, పది లక్షల వ్యక్తిగత పరిహారం అందుతుందని గొప్పలు చెప్పారు. ఆ మేరకు ఈ మధ్యనే జీవో విడుదల చేశారు. భూసేకరణలో ఎకరాకు చెల్లించిన పరిహారం ఐదు లక్షలకు పెంచుతామని, ఎవరూ దిగులు పడనక్కర్లేదంటూ ఎడా పెడా ఓట్లు రాబట్టుకునేందుకు అప్పట్లో హామీల వర్షమే కురిపించారు. ఇంతచేస్తే.. కుక్కునూరు, వేలేరుపాడు ఇలా అన్ని ముంపు మండలాల్లోను వ్యక్తిగత పరిహారం కేవలం కొద్ది మందికి అందలేదు. ఎకరా ఒక్కింటికి మూడున్నర లక్షల పరిహారం పెంపు కొందరి ఖాతాలకే పరిమితమైంది. జగన్‌ హామీలను మాట తప్పిన వైనాన్ని ప్రసార మాధ్యమాలు ఎత్తి చూపినప్పుడల్లా సర్కార్‌ చేసే హడావుడి అంతా ఇంతా కాదు. కుక్కునూరు, వేలేరు పాడుల్లో నిర్వాసితులకు సంబంధించి రీసర్వే పేరిట కాలయాపన చేశారు. జాబితాల వెల్లడి దగ్గరకు వచ్చేసరికి అధికారుల నంగనాచి కబుర్లు. ఇవాళో రేపో మీ ఖాతాలో జమ అవుతుందంటూ ఊరింపులు. చూసీ చూసీ నిర్వాసితుల కళ్లుకాయలు కాసాయే తప్ప ఖాతాల్లో పైసా పడితే ఒట్టు. ఈ రకంగా వేల మంది ఆదివాసీలు జగన్‌ ఇచ్చిన హామీలతో మోసపోయారు. ఇప్పటికీ ఏం చేయాలో తెలియక అచేతన అవస్థలో ఉండిపోయారు. కుటుంబాలన్నీ రెక్కాడితే గాని డొక్కాడనివే. అయినా జగన్‌ సర్కార్‌ మాత్రం కనికరిస్తే అదో పెద్ద రికార్డు అయి ఉండేది. మరింత లోతుగా వెళ్తే పోలవరం ప్రాజెక్టు ఎత్తును 47.75 మీటర్ల నుంచి 41.15 మీటర్లకు కుదించేశారు. ఇంకే ముంది ముంపు గ్రామాల సంఖ్య తగ్గుతుందని, పరిహారం ఇతరత్ర విషయాలు ఆ తర్వాత చూసుకోవచ్చంటూ తేల్చేశారు. తీరా గతేడాది వచ్చిన వరద కాస్తా అనేక గ్రామాలను ముంచేసింది. రోజుల తరబడి 20 అడుగులకు పైనే నిల్వ ఉన్న నీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. కుక్కునూరు, వేలేరుపాడుల్లో నిర్వాసితుల కుటుంబాలు వరదల్లో పడిన తిప్పలు దేవుడికెరుక. జగన్‌ సర్కార్‌ మాత్రం అబ్బే ప్రాజెక్టు కట్టేస్తే ఆ సమస్య ఉండనే ఉండదన్నట్టుగా సీన్‌ క్రియేట్‌ చేస్తోంది. కాని కాఫర్‌ డ్యాం దెబ్బకే అంతలా గోదారి ఊళ్లకు ఊళ్లనే కప్పేసినంత పనిచేయడాన్ని సర్కార్‌ చూడలేకపోయిందనే విమర్శ ఉంది.

ఐకాన్‌.. ఏమైంది

పోలవరం సృష్టికర్త వై.ఎస్‌.రాజశేఖరరెడ్డేనని తెగ బిల్డప్‌ ఇచ్చి, ఆయన పేరు చిరస్మరణీయంగా సందర్శకులకు నిత్యం కనిపించేలా జగన్‌ నాలుగేళ్ల పాలనలో ఇంజనీర్లు డిజైన్‌ చేశారు. వై.ఎస్‌ విగ్రహాన్ని ప్రాజెక్టు వద్ద ఏర్పాటు చేయడం, అక్కడి నుంచి ఐకాన్‌ బ్రిడ్జిని నిర్మించడం, సందర్శకులకు ప్రాజెక్టు ఆసాంతం కనిపించేలా జాగ్రత్తలు తీసుకున్నామని రెండేళ్ల క్రితమే ప్రకటించారు. దీనికయ్యే నిర్మాణ వ్యయాన్ని ప్రభుత్వమే భరిస్తుందన్నట్టు చిత్రీకరించారు. ఇవాళో రేపో ఆ పనులన్నింటినీ చేపడతామన్నట్టుగా అప్పటి జల వనరుల మంత్రి అనిల్‌కుమార్‌ ప్రకటనలు గుప్పించారు. అయితే ప్రాజెక్టు దగ్గర ఐకాన్‌ బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించి ఏ ఒక్కపని ముందుకు సాగలేదు.

ఈ పనుల సంగతేంటి..

పోలవరం పూర్తి చేయడానికి ఈ నాలుగేళ్లల్లో మార్చి మార్చి ముహూర్తాలు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో శరవేగంగా ప్రాజెక్టును పూర్తి చేసి 2019 చివరి నాటికే గోదారి జలాలు తరలిస్తామన్నట్టు అప్పటి ప్రభుత్వం ప్రకటించింది. ఆ తర్వాత అధికార మార్పిడి జరిగి వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండేళ్ల పాటు కరోనా నెపంతో ప్రాజెక్టు పనులన్నీ దాదాపు మూలనపడ్డాయి. అక్కడి నుంచి పనులేవీ తేరుకోలేదు. ప్రత్యేకించి కుడి, ఎడమ ప్రధాన కాల్వలకు కనెక్టవిటీ పనులన్నింటినీ ఎప్పుడో గాలికొదిలేశారు. ప్రాజెక్టు నుంచి ఎడమ కాల్వలోకి నీరు చేర్చేందుకు అనువైన ట్విన్‌ టన్నల్స్‌ (జంట గుహలు) నిర్మాణమైతే దాదాపు తెలుగుశం హయాంలోనే ఒక కొలిక్కి వచ్చి నట్టు వచ్చి ఆగింది. ఆ తర్వాత ఈ నాలుగేళ్లల్లో కరోనా హయాంలో ట్విన్‌ టన్నల్స్‌ పైభాగం కొంతమేర కుప్ప కూలిందే తప్ప వాటి మరమ్మతు పనులు, కనెక్టవిటీ పనులు, హెడ్‌వర్క్స్‌ నుంచి ఎత్తిపోసే లిఫ్ట్‌ పనులన్నీ డిజైన్లకే పరిమితమయ్యాయి. ప్రత్యేకించి స్పిల్‌ చానల్‌ ఎగువున అప్రోచ్‌ చానల్‌ పూడికుపోయిన వైనాన్ని గుర్తించినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. రివిట్‌మెంట్‌ కట్టాల్సి ఉన్నా అదీ జరగలేదు. స్పిల్‌వే వద్ద నావిగేషన్‌ లాక్‌ ఏర్పాటు చేసినా ఇప్పటికీ దాని పూర్తిస్థాయి రూపకల్పన చేయలేకపోయారు. ఇప్పుడు ఎవరైనా పోలవరం ప్రాజెక్టు పనులను చూద్దామని వస్తే కాస్తంత పనులు సాగుతున్న స్పిల్‌వేకు దిగువున డీ వాల్‌ నిర్మాణం లేదా పవర్‌ ప్లాంట్‌ పనులనే చూపిస్తున్నారు. అంతకంటే మించి పోలవరం ప్రాజెక్టులో పనులేవీ పురోగతిలో లేవు.

పునరావాసం.. పరిహారం అదో సీను

లక్షలాది మంది పోలవరం నిర్వాసితుల కుటుంబాలతో ప్రభుత్వం ఆటాడుకుంది. పైపైకి గొప్పలు చెబుతూ వాస్తవంలో మాత్రం ఏమీ చేయలేక చేతులెత్తేసింది. నిర్వాసితులకు నిర్మించిన కాలనీల్లో తొలి జాబితాలో ఉన్నవారు ఆ కాలనీల్లోకి రావడం ఆలస్యమైతే వేరే వారికి ఇళ్లు అప్పగించేశారు. ఇదేంటి ఇలా జరిగిందంటూ అసలు వ్యక్తులు వచ్చి వివాదానికి దిగితే అధికారులు కిమ్మనకుండా కూర్చున్నారు. ఆదివాసీల మధ్య పరస్పరం కొట్లాటలు సాగితే ఎవరికి లాభం ? ఇదే ప్రశ్న ఎవరైనా సంధిస్తే అదేంలేదంటూ నీళ్లు నములుడు. ప్రత్యేకించి భూమికి భూమి పథకం కింద లబ్ధి పొందింది కొంతమందే. మిగతా వారిని గాలికొదిలేశారు. ఇప్పటికీ నిర్వాసితులు పదేపదే కలెక్టరేట్‌ చుట్టూ మోహరించినా, రెవెన్యూ కేంద్రాల వద్ద బైఠాయించినా, మండల కేంద్రాల్లో నిరసన ర్యాలీలు చేసినా జగన్‌ సర్కార్‌ మాత్రం డోంట్‌కేర్‌. పైపైకి నిర్వాసిత కుటుంబాలకు న్యాయం చేస్తామని బీరాలు పలుకుతోంది.

Updated Date - 2023-06-06T00:22:54+05:30 IST