7 రోజుల్లో 10 లక్షల కోట్లు ఉఫ్!
ABN , First Publish Date - 2023-02-28T01:57:49+05:30 IST
భారత స్టాక్ మార్కెట్ ప్రామాణిక సూచీలు వరుసగా ఏడో రోజూ నష్టాల్లో ముగిశాయి. సూచీలు ఇన్ని రోజులు నష్టాల్లో పయనించడం గడిచిన ఐదు నెలల్లో...
సెన్సెక్స్ మరో 176 పాయింట్లు డౌన్.. నాలుగు నెలల కనిష్ఠ స్థాయికి నిఫ్టీ
ముంబై: భారత స్టాక్ మార్కెట్ ప్రామాణిక సూచీలు వరుసగా ఏడో రోజూ నష్టాల్లో ముగిశాయి. సూచీలు ఇన్ని రోజులు నష్టాల్లో పయనించడం గడిచిన ఐదు నెలల్లో (గత ఏడాది సెప్టెంబరు చివరి వారం తర్వాత) ఇదే తొలిసారి. అమెరికా సహా అభివృద్ధి చెందిన దేశాల సెంట్రల్ బ్యాంక్‌ల ‘వడ్డి’ంపుల పర్వం ఇప్పట్లో ఆగకపోవచ్చన్న ఆందోళనలతో ప్రపంచ మార్కెట్లో ట్రేడింగ్ ట్రెండ్ ప్రతికూలంగా మారింది. దాంతో మన మార్కెట్లోనూ ఇన్వెస్టర్లు వరుసగా అమ్మకాలకు పాల్పడుతున్నారు. సోమవారం ఒక దశ లో 526 పాయింట్ల మేర పతనమై 59,000 స్థాయిని సైతం కోల్పోయిన బీఎ్‌సఈ సెన్సెక్స్.. చివరికి 175.58 పాయింట్ల నష్టంతో 59,288.35 వద్ద స్థిరపడింది. ఎస్‌ఎన్‌ఈ నిఫ్టీ 73.10 పాయింట్ల నష్టంతో 4 నెలల కనిష్ఠ స్థాయి 17,392.70 వద్ద క్లోజైంది. గడిచిన ఏడు ట్రేడింగ్ సెషన్లలో సెన్సెక్స్ 2,031 పాయింట్లు (3.4 శాతం), నిఫ్టీ 643 పాయింట్లు (4.1 శాతం) తగ్గాయి. దాంతో ఈ ఏడు రోజుల్లో స్టాక్ మార్కెట్ వర్గాల సంపద రూ.10.42 లక్షల కోట్లు తగ్గి రూ.257.88 లక్షల కోట్లకు పరిమితమైంది.