RBI Annual Report: 2023లో పెరిగిన బ్యాంక్ మోసాలు, వెల్లడించిన RBI
ABN , First Publish Date - 2023-05-30T21:55:30+05:30 IST
2022-23 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకింగ్ రంగంలో మోసాలు(Frauds) పెరిగాయని రిజర్వ్ బ్యాంక్ వెల్లడించింది. బ్యాంకింగ్ రంగంలో మోసాల సంఖ్య 13,530కి చేరుకుందని రిజర్వ్ బ్యాంక్ వార్షిక నివేదికలో పేర్కొంది.
ముంబై: 2022-23 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకింగ్ రంగంలో(Banking Sector) మోసాలు(Frauds) పెరిగాయని రిజర్వ్ బ్యాంక్ వెల్లడించింది. మొత్తం బ్యాంకింగ్ రంగంలో మోసాల సంఖ్య 13,530కి చేరుకుందని, డిజిటల్ చెల్లింపుల విభాగంలో(Digital Payments) మోసాలు ఎక్కువగా జరిగినట్లు 2022-23 రిజర్వ్ బ్యాంక్ వార్షిక నివేదిక(Reserve Bank's Annual Report 2022-23)లో పేర్కొంది. అయితే ఈ మొత్తం విలువ దాదాపు సగానికి తగ్గి రూ.30,252 కోట్లకు చేరుకుందని మంగళవారం రిజర్వ్ బ్యాంక్ వెల్లడించింది.
2021-22లో రూ.59,819 కోట్లతో మొత్తం 9,097 మోసాలు జరిగాయని ఆర్బీఐ(RBI) నివేదికలు చెబుతున్నాయి. 2020-21లో, మోసాల సంఖ్య 7,338 కాగా మొత్తం రూ.1,32,389 కోట్లుగా ఉంది. గత మూడేళ్లలో ప్రైవేట్ రంగ బ్యాంకులు గరిష్ట సంఖ్యలో మోసాలను నివేదించగా, 2022-23లో ప్రభుత్వ రంగ బ్యాంకులు మోసం మొత్తానికి గరిష్టంగా కొనసాగించాయి.
2020-21 కంటే 2021-22 మధ్య కాలంలో నమోదైన మొత్తం మోసాల్లో 55 శాతం తగ్గుదల నమోదు కాగా.. 2021-22 కంటే 49 శాతం తగ్గింపుతో 2022-23లో మోసాలకు మొత్తం తగ్గుదల కొనసాగిందని ఆర్బీఐ చెప్తోంది.
చిన్న వ్యాల్యూ కార్డులు, ఇంటర్నెట్ మోసాలు ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో గరిష్టంగా ఉండగా ప్రభుత్వ రంగం బ్యాంకుల్లో లోన్ పోర్ట్‌ఫోలియోలో ప్రధానంగా మోసాలు జరిగాయని ఆర్బీఐ చెబుతోంది.
గత ఆర్థిక సంవత్సరాల్లో జరిగిన మోసాలకు సంబంధించిన మొత్తం విలువ పరంగా 2021-22లో నివేదించబడిన మోసాలలో 93.7 శాతంగా ఉంది. అదేవిధంగా 2022-23లో 94.5 శాతం మోసాలు నమోదైనట్లు తెలిపింది.
2022-23లో ప్రభుత్వ రంగ బ్యాంకులు రూ.21,125 కోట్లతో కూడిన 3,405 మోసాలను నివేదించగా, ప్రైవేట్ బ్యాంకులు రూ. 8,727 కోట్లతో 8,932 కేసులను నివేదించాయి. మిగిలినవి విదేశీ బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, చిన్న ఫైనాన్స్ బ్యాంకులు చెల్లింపు బ్యాంకుల నుంచి వచ్చినవి.
ఆర్బీఐ డేటా ప్రకారం.. మొత్తం రూ. 30,252 కోట్లలో 95 శాతం రూ.28,792 కోట్లు రుణాలకు సంబంధించిన కేసులు నివేదించబడ్డాయి. అయితే బ్యాంకింగ్ రంగంలో మోసాలను అరికట్టేందుకు మరిన్ని చర్యలు తీసుకుంటామని ఆర్‌బీఐ తెలిపింది.