Group-2 Special: భారతదేశ చరిత్ర నుంచి ఏయే ప్రశ్నలు అడగొచ్చంటే..?
ABN , First Publish Date - 2023-09-19T16:27:35+05:30 IST
రాష్ట్రస్థాయిలో ఎక్కువ మంది అభ్యర్థులు ప్రిపేర్ అవుతున్న ఉన్నతస్థాయి ఉద్యోగాల పరీక్ష గ్రూప్-2. ఆగస్టు చివరివారంలో నిర్వహించాల్సిన గ్రూప్-2 పరీక్షలు
రాష్ట్రస్థాయిలో ఎక్కువ మంది అభ్యర్థులు ప్రిపేర్ అవుతున్న ఉన్నతస్థాయి ఉద్యోగాల పరీక్ష గ్రూప్-2. ఆగస్టు చివరివారంలో నిర్వహించాల్సిన గ్రూప్-2 పరీక్షలు నవంబరు మొదటివారంలోని 2, 3 తేదీలకు వాయుదాపడ్డాయి. ఈ నేపథ్యంలో అదనంగా లభించిన సమయాన్ని భారతదేశ చరిత్ర ప్రిపరేషన్‌కు సద్వినియోగం చేసుకోగలిగితే విజయం సులువైనట్లే.
మొదటగా చరిత్రలోని సిలబ్‌సను మూడు భాగాలు చేసుకోవాలి. అందుకు అనుగుణంగా పాఠ్యాంశాలను విభజించుకోవాలి. రోజుకు ఒకటి లేదా రెండు పాఠ్యాంశాలను మొదట పూర్తిచేయాలి. ఏయే అంశాల నుంచి బిట్స్ ఎక్కువగా వస్తున్నాయో పాత ప్రశ్న పత్రాల ఆధారంగా గమనించాలి. ఆ అంశాలను కాన్సెప్ట్ విధానంలో అధ్యయనం చేయాలి. సులభమైన ప్రశ్నల కోసం ఎక్కువ సమయాన్ని వృథా చేసుకోవద్దు. ఉదాహరణకు హరప్పా, మొహంజదారో పట్టణాలు ఎక్కడ బయల్పడ్డాయి? బుద్ధుడు ఏ భాషలో బోధనలు చేశాడు లాంటివి కాకుండా సింధు నాగరికత ప్రపంచానికి ఎలాంటి సందేశం ఇచ్చింది? బుద్ధుని బోధనలను తరవాత కాలాల్లో ఏయే రాజ్యాలు, రాజులు ఆచరించి పాటించారు, ప్రచారం చేశారు? వంటి లోతైన ప్రశ్నలపై దృష్టి సారించాలి. అప్పుడే మీకు నూతన సమాధానాలు తెలుస్తాయి. మౌర్యులు భారతదేశానికి ఎలాంటి పాలనను అందించారు? అశోకుని ధమ్మ విధానాలు నేటి మన సమాజంలో కన్పిస్తున్నాయా? మనం వాటిని పాటిస్తున్నామా? లాంటి కాన్సెప్ట్ పద్ధతిలో ప్రిపరేషన్ లేదా రివిజన్ కొనసాగాలి.
చరిత్రను ప్రధానంగా మూడు భాగాలుగా విభజించారు.
1. ప్రాచీన భారతదేశ చరిత్ర
2. మధ్యయుగ భారతదేశ చరిత్ర
3. ఆధునిగ యుగం
ప్రతి భాగంలోనూ చదవాల్సిన ముఖ్య పాఠ్యాంశాలను అందులోని విషయాలను ఒకసారి చూద్దాం.
సింధునాగరికత: వారి ముఖ్య పట్టణాలు, నగర నిర్మాణాలు, సామాజిక విధానాలు, మత విధానాలపై ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది.
ఆర్యుల నాగరికత: వీరి జన్మప్రాంతం? దీనిపై వ చ్చిన వివిధ సిద్ధాంతాలు-గ్రంథాలు, వ్యక్తులపై అవగాహన కలిగి ఉండాలి. వీరు అందించిన వేద సాహిత్యం, వీరి కాలంలో సమాజ ధోరణులు, ఆర్థిక విధానాలు, స్త్రీల పాత్రపై ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది.
జైన, బౌద్ధ మతాలు ఆవిర్భావానికి దారి తీసిన క్రీ.పూ.6వ శతాబ్దం కాలం నాటి సామాజిక, ఆర్థిక పరిస్థితులు, ప్రపంచంలోని నూతన మతస్థాపకుల ప్రభావం? జైన బౌద్ధ మతాల శిల్పకళ, సామాజిక రంగంలో వారి పాత్ర తదితర అంశాలపై ప్రశ్నలు అడగవచ్చు. బుద్ధుని జన్మస్థలం ఏది? బౌద్ధమతం పుట్టిన ప్రాంతం ఏది? లాంటి చిన్న చిన్న ప్రశ్నలపై కాకుండా బౌద్ధమతం భారతదేశానికి అందించిన సేవ మొదలైన కాన్సెప్ట్ ఓరియెంటెడ్ పద్ధతిలో చదివితే ఎలాంటి ప్రశ్నలు వచ్చినా సమాధానం సులువుగా గుర్తించవచ్చు.
ఇక మౌర్య సామ్రాజ్యం, వారి పాలన కేంద్రాలు, సామాజిక ఆర్థిక రంగాలు, ముఖ్యంగా అశోకుని కాలంలో వచ్చిన ‘లిఖిత పూర్వక శాసనాలు’ చాలా ప్రాధాన్యం గలవని భావించాలి. గుప్తులలో వారి పాలన స్వర్ణయుగం, శాస్త్ర-సాంకేతిక రంగాల్లో ఖగోళశాస్త్రం, వైద్య శాస్త్రంలో వారి సేవ- వచ్చిన గ్రంథాలు, వారి పన్నుల విధానంపై ప్రశ్నలు రావొచ్చు.
ప్రాచీన భారతదేశంలో హర్షుడు అతడు అందించిన సాహిత్య, మతసేవ, అతని ఆస్థానంలోకి వచ్చిన చైనా యాత్రికులు, వారి రచనలు, బాణుడు, మయూరుడు లాంటి గొప్ప వ్యక్తులు రాసిన గ్రంథాలు ముఖ్యమైనవి. ప్రత్యేకంగా హర్షుడు రాసిన నాగానందం, రత్నావళి, ప్రియదర్శిని మొదలైన గ్రంథాల్లోని ముఖ్యాంశాలు గుర్తుంచుకోవాలి.
మధ్యయుగంలోని ముఖ్యాంశాలు గమనిస్తే చోళుల పరిపాలన వ్యవస్థలోని ముఖ్యాంశాలను ఒకసారి పునశ్చరణ చేసుకోవాలి. చోళులు అందించిన సేవ? ఉత్తరమేరూర్ శాసనంలోని స్థానిక స్వపరిపాలనాంశం తదితరాలు ప్రధానమైనవి.
ఢిల్లీ సుల్తానుల వంశక్రమం, వారి సామాజిక, వాస్తు, సాహిత్య రంగాల నుంచి ప్రశ్నలు రావొచ్చు. వారి పాలన రంగంలోని అంశాలు..నీటి పారుదల, వ్యవసాయం, బానిసల విభాగం వంటి వాటిపై మరొకసారి దృష్టిసారించాలి. అదేవిధంగా మొఘల్ రాజుల వరుసక్రమం, వారి కాలంలో ఎదుర్కొన్న విదేశీ దాడులు, వారి పాలన రంగం, సాహిత్య- సాంస్కృతిక రంగాల నుంచి 2 లేదా 3 ప్రశ్నలు వచ్చే ఆస్కారం ఉంది.
భక్తి ఉద్యమంలో రామానుజాచార్యుల నుంచి రామానందుని వరకు గల సిద్ధాంతాలు, రచనలు మొదలైనవి అత్యంత ప్రధానమైనవి. సూఫీ మతంలోని వివిధ శాఖలు, వారి స్థాపకులు వంటి వాటిపై కూడా ప్రశ్నలు వస్తాయి. యురోపియన్ పోర్చుగ్రీసు నుంచి ఫ్రెంచ్ వారి వరకు వారి స్థాపనలు వ్యాపార కేంద్రాలు, వారి పాలన మొదలైన వాటి నుంచి ప్రశ్నలు అడగొచ్చు.
ఆధునిక భారతదేశ చరిత్ర: మొదటగా 1857 సిపాయిల తిరుగుబాటు కేంద్రాలు, వారి నాయకులు, ఈ సమయంలో వచ్చిన ముఖ్యమైన స్టేట్స్‌మెంట్స్‌పై ఫోకస్ చేయాలి. బ్రిటిషర్లు బలపడటం, కర్ణాటక యుద్ధాల్లో ఫ్రెంచి వారిని ఓడించడం, ప్లాసీ, బక్సర్, మైసూర్, మరాఠా, సిక్కు యుద్ధాల విజయాలు కీలకం. గవర్నర్స్ లేదా గవర్నర్ జనరల్స్‌ను వరుస క్రమంలో అమర్చుము లాంటి ప్రశ్నలు కూడా రావొచ్చు. 19వ శతాబ్దంలో సామాజిక, సాంస్కృతిక రంగాల్లో వచ్చిన మార్పులు, బ్రహ్మసమాజం, ఆర్యసమాజం, ప్రార్థన సమాజం మొదలైన వాటి ప్రభావం భారతదేశ సమాజంపై ఎంతవరకు ఉంది లాంటి ప్రశ్నలు అడగవచ్చు.
భారత జాతీయ ఉద్యమం, దీనిలో మితవాద(1885-1905), అతివాద(1905-1920), గాంధీ యుగం లాంటి దశలపై ప్రశ్నలు వస్తాయి. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఉదాహరణకు...పంజాబ్, బెంగాల్, మరాఠా, తమిళనాడు లాంటి రాష్ట్రాల్లోంచి వచ్చిన నాయకులు, వారి రచనలపై ప్రశ్నలు అడిగే ఆస్కా రం ఉంది. ఆనాడు ఆంధ్రప్రదేశ్ తమిళనాడులో అంతర్భాగంగా ఉంది కాబట్టి అప్పటి తెలుగు వారి సంఘాలు-సంస్థలు, వారి గ్రంథాలుపై కూడా ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది.
చివరిగా స్వాత్రంత్య్రం అనంతరం ఏకీకరణ(సంస్థానాల విలీనంలో వల్లభాయి పటేల్ పాత్ర, కశ్మీర్, హైదరాబాద్ సంస్థానాల ప్రభావం)పై ప్రశ్నలు రావొచ్చు. దేశంలో పునర్వవస్థీకరణపై కూడా ప్రశ్నలు అడగవచ్చు. ప్రిలిమినరీ పరీక్షలో 30 మార్కులు చరిత్ర నుంచి వస్తాయి కాబట్టి ప్రతి పాఠ్యాంశాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి.
రెఫరెన్స్ బుక్స్:
తెలుగు అకాడమీ పుస్తకాలు
ఎన్‌సీఈఆర్‌టీ(ఇంగ్లీష్ మీడియం వారైతే)
ఓపెన్ యూనివర్సిటీ పుస్తకాలు(అంబేడ్కర్, ఇందిరాగాంధీ విశ్వ విద్యాలయం)
-డాక్టర్ ఐ.నీలా
అసిస్టెంట్ ప్రొఫెసర్
ప్రభుత్వ గురుకుల మహిళా
డిగ్రీ కళాశాల, సూర్యాపేట