స్టాఫ్‌ నర్సు పరీక్ష ఎప్పుడు? ఉంటుందా? లేదా? అయోమయంలో అభ్యర్థులు!

ABN , First Publish Date - 2023-05-31T11:53:33+05:30 IST

స్టాఫ్‌ నర్సు పోస్టులకు రాత పరీక్షలు ఎప్పుడు జరుగుతాయో తెలియక అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. పరీక్ష తేదీ కోసం నిరీక్షిస్తున్నారు. అసలు పరీక్ష ఉంటుందా?

స్టాఫ్‌ నర్సు పరీక్ష ఎప్పుడు? ఉంటుందా? లేదా? అయోమయంలో అభ్యర్థులు!
Staff Nurse Exam Date

నోటిఫికేషన్‌ ఇచ్చి 5 నెలలు..

పరీక్ష తేదీ ప్రకటించని సర్కారు

కోచింగ్‌ తీసుకొని మరీ సిద్ధమైన నర్సులు..

పరీక్ష ఉంటుందో లేదోనని ఆందోళన

స్టాఫ్‌ నర్సు పోస్టులకు రాత పరీక్షలు ఎప్పుడు జరుగుతాయో తెలియక అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. పరీక్ష తేదీ కోసం నిరీక్షిస్తున్నారు. అసలు పరీక్ష ఉంటుందా? లేక ఎన్నికల దాకా సాగదీస్తారా? ఒకవేళ పరీక్ష జరిగినా..ఎన్నికల కోడ్‌ వస్తే ఫలితాలు నిలిచిపోయే ప్రమాదం ఉందా? అని అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. వైద్య ఆరోగ్యశాఖలో 5,204 స్టాఫ్‌ నర్సు పోస్టులకు నోటిఫికేషన్‌ ఇచ్చి ఐదు నెలలైంది. కానీ, ప్రభుత్వం ఇప్పటిదాకా పరీక్ష తేదీని ఖరారు చేయలేదు.

హైదరాబాద్‌, మే 30 (ఆంధ్రజ్యోతి): స్టాఫ్‌ నర్సు పోస్టుల భర్తీకి గత ఏడాది డిసెంబరు 30న మెడికల్‌ హెల్త్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ ఏడాది జనవరి 25 నుంచి దరఖాస్తుల ప్రక్రియను ప్రారంభించింది. మొత్తం 49000 దరఖాస్తులొచ్చాయి. తర్వాత పరీక్షకు సన్నద్ధమయ్యేందుకు మెడికల్‌ బోర్డు 2 నెలల గడువిచ్చింది. అంటే ఏప్రిల్‌ చివరి వారం లేదా మే మొదటి వారంలో రాత పరీక్ష ఉంటుందని నర్సులు భావించారు. కానీ, ఇంతవరకు రాత పరీక్ష తేదీలపై స్పష్టతనివ్వలేదు.

తీవ్ర ఒత్తిడిలో అభ్యర్థులు..

స్టాఫ్‌ నర్సు పోస్టుకు దరఖాస్తు చేసినవారిలో మెజారిటీ ప్రస్తుతం ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో పనిచేస్తున్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో పనిచేస్తున్న వారు కూడా ఉన్నారు. వీరంతా విధులకు హాజరవుతూనే పరీక్షలకు సన్నద్ధమయ్యారు. చాలామంది దరఖాస్తు ప్రక్రియ పూర్తవగానే మేలో పరీక్ష ఉంటుందని మార్చి నుంచి కోచింగ్‌ సెంటర్లకు వెళ్లారు. ఆ సెంటర్లలో ఒక్కొక్కరి దగ్గర రూ.7-10 వేల వరకు ఫీజులు వసూలు చేశారు. కోచింగ్‌ తీసుకొని కూడా నెల రోజులు దాటిపోయింది. ఇంకా పరీక్ష తేదీ ఖరారు కాకపోవడంతో చదివినదంతా మర్చిపోతున్నామని వాపోతున్నారు. ఇప్పటికైనా పరీక్ష తేదీని ప్రకటించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

కొత్త కాలేజీల్లో సపోర్టింగ్‌ స్టాఫ్‌ ఎలా?

సర్కారు గత ఏడాది, ఈ ఏడాది కలిపి మొత్తం 17 కొత్త మెడికల్‌ కాలేజీలను ఏర్పాటు చేసింది. ఈ కాలేజీల కోసం ఇప్పటికే అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల నియామకాన్ని చేపట్టి, భర్తీ ప్రక్రియను పూర్తి చేశారు. అయితే వైద్యులకంటే సపోర్టింగ్‌ సిబ్బందే బోధనాస్పత్రుల్లో కీలకం. స్టాఫ్‌ నర్స్‌, ల్యాబ్‌ టెక్నిషీయన్లు, ఇతర పారామెడికల్‌ సిబ్బందే ముఖ్యం. నర్సులే కీలకపాత్ర పోషిస్తారు. ఈ పరిస్థితుల్లో స్టాఫ్‌ నర్సులు లేకపోతే ఎలా అని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2023-05-31T11:53:33+05:30 IST