Girl: ఆడపిల్లల్లో ఆ లోపం ఉంటే...!
ABN , First Publish Date - 2023-08-29T12:19:42+05:30 IST
పుట్టుకతోనే అవయవలోపం వెంట తెచ్చుకునే వాళ్లుంటారు. వీళ్లలో పునరుత్పత్తి అవయవ లోపంతో పుట్టే ఆడపిల్లలూ ఉంటారు. అలాంటి పిల్లలకు సర్జరీతో సహజసిద్ధమైన లైంగిక జీవితాన్ని ఆస్వాదించే అవకాశం కల్పించవచ్చు అంటున్నారు వైద్యులు.
పుట్టుకతోనే అవయవలోపం వెంట తెచ్చుకునే వాళ్లుంటారు. వీళ్లలో పునరుత్పత్తి అవయవ లోపంతో పుట్టే ఆడపిల్లలూ ఉంటారు. అలాంటి పిల్లలకు సర్జరీతో సహజసిద్ధమైన లైంగిక జీవితాన్ని ఆస్వాదించే అవకాశం కల్పించవచ్చు అంటున్నారు వైద్యులు.
ఈ లోపాన్ని వైద్య పరిభాషలో ఎమ్‌ఆర్‌కెహెచ్ సిండ్రోమ్ అంటారు. ప్రతి ఐదు వేల ఆడపిల్లల జననాలలో ఒకరికి ఈ సమస్య ఉంటూ ఉంటుంది. వీళ్లలో జననేంద్రియం, గర్భాశయం పరిపూర్ణంగా ఎదిగి ఉండకపోవచ్చు. లేదంటే బాహ్య జననేంద్రియం సాధారణంగా లేదా పాక్షికంగా ఉన్నప్పటికీ, లోపల వెజైనా, గర్భాశయ లోపం ఉండి ఉండవచ్చు. దాంతో ఆడపిల్లలు ఈ సమస్యతో పుట్టారు అనే విషయాన్ని తల్లి ఆలస్యంగా తెలుసుకుంటుంది. ఆడపిల్లలు టీనేజీ వయసుకు చేరుకున్నా తొలి నెలసరి కనిపించని సందర్భాల్లో తల్లులు పిల్లలను వైద్యుల దగ్గరకు తీసుకొచ్చినప్పుడు, ఈ సమస్య బయల్పడుతూ ఉంటుంది.
పెళ్లికి ఆటంకం లేకుండా...
ఇలాంటి ఆడపిల్లలను పెళ్లికి తగ్గట్టుగా సిద్ధం చేయడం కోసం వెజైనల్ క్యావిటీ తయారు చేయవలసి ఉంటుంది. లేని గర్భాశయాన్ని సృష్టించలేకపోయినా, సరోగసీ ద్వారా పిల్లలను కనే అవకాశాలున్నాయి కాబట్టి, అది పెద్ద సమస్య కాకపోవచ్చు. కానీ వెజైనా లేకపోవడం ఆడపిల్లల పెళ్లికి పెద్ద అడ్డంకి అవుతుంది. పది పదిహేనేళ్ల కిత్రం వెజైనల్ రీకన్‌స్ట్రక్షన్ కోసం స్కిన్ గ్రాఫ్ట్, లోకల్ ఫ్లాప్స్‌ను అమర్చేవారు. కానీ ఇవన్నీ కాలక్రమేణా మూసుకుపోతూ ఉంటాయి. అలాంటప్పుడు రెండో సర్జరీ అవసరం పడుతూ ఉండేది. కానీ ఇప్పుడు అంతకు మించిన మెరుగైన ప్రత్యామ్నాయ వైద్యం అందుబాటులోకి వచ్చింది.
అద్దె గర్భంతో...
‘సిగ్మాయిడ్ కోలన్‘ అనే పెద్ద పేగులోని ఒక భాగాన్ని, దానికి జరిగే రక్తసరఫరా ఆధారంగా ఆ భాగాన్ని వెజైనాకు ట్రాన్స్‌ఫర్ చేస్తారు. వెజైనల్ రీకన్‌స్ట్రక్షన్‌కు సిగ్మాయిడ్ కోలన్‌ను ఎంచుకోవడానికి కొన్ని కారణాలున్నాయి. దీన్లో మ్యూకస్ ఉత్పత్తి అవుతూ ఉంటుంది. కాబట్టి సహజసిద్ధమైన యోనిలా ఇది ఉపయోగపడుతుంది. పైగా ఇది లైవ్ టిష్యూ కాబట్టి కొలాప్స్ అయ్యే అవకాశం ఉండదు. అలాగే ఈ సర్జరీతో ఎలాంటి తర్వాతి జాగ్రత్తలూ తీసుకోవలసిన అవసరం ఉండదు. శుభ్రతను పాటించగలిగితే, ఈ యోని జీవితకాలం ఉపయోగపడుతూనే ఉంటుంది. కాబట్టి పెళ్లికి ఆటంకం ఉండదు. అయితే గర్భాశయం లేకపోయినా, అండాశయాలు ఉంటాయి కాబట్టి అండాలను సేకరించి, భర్త వీర్యంతో కలిపి, అద్దె గర్భం ద్వారా పిల్లలను కనవచ్చు.
లైంగిక తృప్తికి ఢోకా ఉండదు
ఈ కోవకు చెందిన ఆడపిల్లల్లో బాహ్య జననాంగమంతా సాధారణంగానే ఉంటుంది కాబట్టి లైంగిక సంతృప్తి పరంగా ఎటువంటి ఇబ్బందీ ఉండదు. సర్జరీ తర్వాత సర్జరీ తాలూకు గాయమంతా ఒక వారంలో పూర్తిగా మానిపోతుంది. అయితే అమర్చినది పెద్ద పేగు కాబట్టి మ్యూకస్ ఉత్పత్తి ఎక్కువగా ఉంటుంది. ఆ పరిస్థితి మూడు నెలల్లోగా సర్దుకుంటుంది. అయితే అప్పటివరకూ ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. అలాగే శుభ్రత పాటించాలి.
-డాక్టర్ రాజేష్ వాసు
కన్సల్టెంట్ ప్లాస్టిక్ అండ్ ఈస్థటిక్ సర్జన్,
స్టార్ హాస్పిటల్స్, హైదరాబాద్.