Sharad Pawar: వెనక్కి తగ్గని పవార్... మోదీపై ఘాటు విమర్శలు

ABN , First Publish Date - 2023-08-16T18:19:49+05:30 IST

నేషలిస్టు కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్ కేంద్రంలోని ఎన్డీయే కూటమికి దగ్గరవుతున్నారని, ఆయన కుమార్తెకు కేంద్ర మంత్రి పదవి, పవార్‌కు కేంద్రంలో మరో కీలక పదవి ఇవ్వబోతున్నారంటూ ఊహాగానాల నేపథ్యంలో పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీరుపై విమర్శలు గుప్పించారు. మణిపూర్ అంశంపై ప్రధాని మౌనాన్ని ఎండగట్టారు.

Sharad Pawar: వెనక్కి తగ్గని పవార్... మోదీపై ఘాటు విమర్శలు

ముంబై: నేషలిస్టు కాంగ్రెస్ పార్టీ (NCP) చీఫ్ శరద్ పవార్ (Sharad Pawar) కేంద్రంలోని ఎన్డీయే (NDA) కూటమికి దగ్గరవుతున్నారని, ఆయన కుమార్తెకు కేంద్ర మంత్రి పదవి, పవార్‌కు కేంద్రంలో మరో కీలక పదవి ఇవ్వబోతున్నారంటూ ఊహాగానాల నేపథ్యంలో పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీరుపై విమర్శలు గుప్పించారు. మణిపూర్ అంశంపై ప్రధాని మౌనాన్ని ఎండగట్టారు. ఈశాన్య రాష్ట్రం రగులుతుంటే ప్రధాని మౌన ప్రేక్షకుడిగా ఉన్నారని, ఎన్నికల ర్యాలీలకు వెళ్లడం కంటే మణిపూర్ అంశాన్ని కీలకంగా తీసుకుని అక్కడికి వెళ్లి ప్రజలను స్వాంతన పలకాలని సూచించారు.


''మణిపూర్ పరిస్థితి చాలా బాధాకరంగా ఉంది. మోదీ ఒకసారి అక్కడికి వెళ్లి ప్రజల్లో విశ్వాసం పాదుకొలపాలని మేము కోరుతున్నాం. కానీ ఆయనకు ఈ అంశంపై ఎలాంటి ప్రాధాన్యత ఉన్నట్టు కనిపించడం లేదు'' అని పవార్ అన్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కావడానికి ముందు పార్లమెంటు వెలుపల ఆయన మూడు నిమిషాల వీడియో సందేశం ఇచ్చి ఊరుకున్నారని, కానీ పార్లమెంటులో అవిశ్వాస తీర్మానంపై మాత్రం సుదీర్ఘ ఉపన్యాసం చేశారని అన్నారు.


అధికారం చేతుల్లో పెట్టుకుని...

అధికారాన్ని భారతీయ జనతా పార్టీ, ఆ పార్టీ భాగస్వాముల చేతుల్లో పెట్టుకున్నారని, సమాజంలో ఐక్యత కోసం పాటుపడాల్సిన వారు ప్రజలను విడగొట్టేందుకు అధికారాన్ని ఉపయోగించుకుంటున్నారని పవార్ తప్పుపట్టారు. వాళ్లు (బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే) రాష్ట్ర ప్రభుత్వాలను ఎలా కుప్పకూలుస్తున్నారనడానికి చాలా ఉదాహరణలే ఉన్నాయన్నారు. గోవా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ఇలా అనేక రాష్ట్రాల్లో ప్రభుత్వాలను పడగొట్టారని అన్నారు. మహారాష్ట్రలోని ఉద్ధవ్ థాకరే సారథ్యంలోని ప్రభుత్వాన్ని ఏ విధంగా కుప్పకూల్చారో ప్రతి ఒక్కరూ చూశారని తెలిపారు.


ఎన్నికల గుర్తుపై...

ఎన్నికల గుర్తుపై మాట్లాడుతూ, ఉద్ధవ్ థాకరే విషయంలో ఎలా జరిగిందో తమకూ (ఎన్‌సీపీ) అలాగే జరిగిందని, కేంద్రంలోని కొన్ని శక్తులు అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నాయని తూర్పారబట్టారు. తమ పార్టీ గుర్తు విషయంలోనూ ఇదే జరిగిందన్నారు. ఎన్నికల కమిషన్ సొంతగా నిర్ణయం తీసుకుంటుందా లేదా అనేది అసలు విషయం కాదని, ఆ నిర్ణయం వెనుక కేంద్రం ప్రభావం ఉందని ఆరోపించారు. అయినప్పటికీ ఎన్నికల గుర్తుపై తాను పెద్దగా విచారించేదిలేదని, తాను 14 ఎన్నికల్లో పోటీ చేశానని, కొత్త గుర్తుతో వెళ్లానని, ప్రతి సారి గెలుస్తూ వచ్చానని చెప్పారు.


''గత 8-10 రోజుల నుంచి మహారాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలను కలుస్తూనే ఉన్నాను. రెండ్రోజుల క్రితమే షోలాపూర్ ప్రాంతంలోని సాంగోలలో కనీసం వెయ్యి మంది అనేక ప్రాంతాల్లో నా కారు ఆపారు. పుణె, సతారా, ఇతర ప్రాంతాల్లోని కార్యకర్తలు కూడా నన్ను కలుసుకునేందుకు వచ్చారు. గురువారంనాడు బీడ్‌ వెళ్లి కార్యకర్తలను కలుస్తాను'' అని పవార్ తెలిపారు.

Updated Date - 2023-08-16T18:19:49+05:30 IST