Pathaan row : షారూఖ్ ఖాన్ నాకు రాత్రి 2 గంటలకు ఫోన్ చేశారు : అస్సాం సీఎం
ABN , First Publish Date - 2023-01-22T12:54:13+05:30 IST
బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ (Shah Rukh Khan) రాత్రి రెండు గంటలకు తనకు ఫోన్ చేశారని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ
న్యూఢిల్లీ : బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ (Shah Rukh Khan) రాత్రి రెండు గంటలకు తనకు ఫోన్ చేశారని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ (Himanta Biswa Sarma) చెప్పారు. ‘పఠాన్’ సినిమాను ప్రదర్శించే థియేటర్ వద్ద కొందరు నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తుండటం గురించి ప్రస్తావించారని, శాంతిభద్రతలను పరిరక్షించడం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత అని తాను చెప్పానని తెలిపారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగిన చర్యలు చేపడతామని హామీ ఇచ్చానని తెలిపారు.
శర్మ ఆదివారం ఇచ్చిన ట్వీట్‌లో, బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ తనకు ఫోన్ చేశారని, రాత్రి రెండు గంటలకు తనతో మాట్లాడారని చెప్పారు. ఆయన సినిమా ప్రదర్శన సందర్భంగా గువాహటిలో జరిగిన సంఘటన గురించి ఆయన ఆందోళన వ్యక్తం చేశారన్నారు. శాంతిభద్రతలను పరిరక్షించడం రాష్ట్ర ప్రభుత్వ కర్తవ్యమని, అందుకు కట్టుబడి ఉంటామని తాను హామీ ఇచ్చానన్నారు. జరిగిన సంఘటనలపై దర్యాప్తు జరిపిస్తామని, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు.
శనివారం విలేకర్లు అడిగిన ప్రశ్నకు హిమంత బిశ్వ శర్మ స్పందిస్తూ, ‘‘షారూఖ్ ఖాన్ ఎవరు? ఆయన గురించి, ఆయన సినిమా ‘పఠాన్’ గురించి నాకేమీ తెలియదు. ఖాన్ నాకు ఫోన్ చేయలేదు. చాలా మంది బాలీవుడ్ ప్రముఖులు ఫోన్ చేసి, సమస్యను చెప్తూ ఉంటారు ఆయన ఫోన్ చేస్తే, విషయాన్ని పరిశీలిస్తాను. శాంతిభద్రతలకు విఘాతం కలిగితే చర్యలు తీసుకుంటాం’’ అని తెలిపారు.
ఇదిలావుండగా, ‘పఠాన్’ సినిమాలో బేషరమ్ రంగ్ (సిగ్గులేని రంగు) పాటలో దీపిక పదుకొనే కాషాయ రంగు బికినీ ధరించడంపై వివాదం జరుగుతోంది. ఈ సినిమాను నిషేదించాలని విశ్వహిందూ పరిషత్ తదితర సంస్థలు కోరుతున్నాయి.