Chief Minister: చిన్న వయస్సులోనే రాజకీయాల్లోకి వచ్చా.. నా జీవితాశయం ఏంటంటే...

ABN , First Publish Date - 2023-03-01T08:55:10+05:30 IST

పిన్న వయస్సులోనే తాను రాజకీయాల్లో ప్రవేశించానని, గత 55 యేళ్లుగా ప్రజాసేవకే అంకితమయ్యాయని, ప్రస్తుతం తమ ప్రభుత్వ

Chief Minister: చిన్న వయస్సులోనే రాజకీయాల్లోకి వచ్చా.. నా జీవితాశయం ఏంటంటే...

చెన్నై (ఆంధ్రజ్యోతి): పిన్న వయస్సులోనే తాను రాజకీయాల్లో ప్రవేశించానని, గత 55 యేళ్లుగా ప్రజాసేవకే అంకితమయ్యాయని, ప్రస్తుతం తమ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలన్నదే తన జీవితాశయమని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌(Chief Minister MK Stalin) అన్నారు. స్థానిక కొరట్టూరులోని అన్నా శతజయంతి స్మారక గ్రంథాలయం మీటింగ్‌ హాలులో మంగళవారం ఉదయం ఏర్పాటైన సభలో మార్చి 1న సీఎం 70వ జన్మదిన వేడుకలను జరుపుకోనున్న సందర్భంగా ఏడు కొత్త పథకాలకు ఆయన శ్రీకారం చుట్టారు. రాష్ట్రవ్యాప్తంగా మానవ వ్యర్థాలను తొలగించేందుకు డీఐసీసీఐ సంస్థతో ఒప్పందం, చిన్నారుల్లో పౌష్టికాహార లోపం నిర్మూలన పథకం, దివ్యాంగులకు ఉచిత ఇంటి నివేశన పట్టాల పంపిణీ పథకం, హిజ్రాలకు నెలసరి ఆర్థిక సాయం పెంపు, 33 ప్రభుత్వ ఆసుపత్రులకు శంకుస్థాపన ఇలా... ఏడు పథకాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ డీఎంకే అధికారంలోకి వచ్చినప్పటి నుండి సెయింట్‌ జార్జి కోటలో రూపొందించే ప్రతి పథకం ఫలితాలు మారుమూల గ్రామాలకు చేరాలని అధికారులకు ఎప్పటికప్పుడు ఆదేశాలిస్తున్నానని చెప్పారు. తమిళనాడు(Tamil Nadu)ను నిరుద్యోగరహిత రాష్ట్రంగా, సామాజిక సమానత్వం వెల్లివిరిసే ప్రాంతంగా తీర్చి దిద్దటమే తన ధ్యేయమన్నారు. విద్య, ప్రజారోగ్యం, బలహీనవర్గాల సంరక్షణ, శిశు సంరక్షణ, సామాజిక అభివృద్ధి, సామాజిక న్యాయం అంటూ ఏడు ప్రాధాన్యతా రంగాలకు పెద్దపీట వేసేలా ఏడు పథకాలను ప్రారంభించినట్లు తెలిపారు. ఇదే కోవలో మరిన్ని పథకాలు అమలు చేయనున్నామని ఆయన తెలిపారు.

55 యేళ్ల ప్రజాజీవితం...

మార్చి 1న 70వ వడిలో అడుగిడబోతున్న తాను 55 యేళ్ళ జీవితాన్ని ప్రజాసేవకే అంకితం చేశానని, పిన్న వయస్సులోనే రాజకీయ ప్రవేశం చేశానని తెలిపారు. ముఖ్యమంత్రిగా, పార్టీ అధ్యక్షుడిగా తాను ఎవరితోనూ పోల్చుకోవడం లేదని, తనకు తానే పోటీపడి ప్రజలకు మరిన్ని సంక్షేమ పథకాలను అమలు చేసి తీరుతానని శపథం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కేఎన్‌ నెహ్రూ, పి.గీతాజీవన్‌, సామినాథన్‌, ఎం.సుబ్రమణ్యం, పీకే శేఖర్‌బాబు, అన్బిల్‌ మహేష్‌ పొయ్యామొళి, ఎండీఎంకే నేత వైగో, కాంగ్రెస్‌ లెజిస్లేచర్‌ పార్టీ నాయకుడు సెల్వపెరుంతగై, వివిధ శాఖలకు చెందిన ప్రభుత్వ కార్యదర్శులు శివదాస్‌ మీనా, కన్‌సోంగమ్‌ జడక్‌ సిరు, డాక్టర్‌ ఆర్‌ నాంద్‌కుమార్‌, డాక్టర్‌ ఇరా సెల్వరాజ్‌ తదితరులు పాల్గొన్నారు. స్టాలిన్‌ ఈ సభలో ప్రకటించిన ఏడు పథకాల ప్రకటన వివరాలు ఇలా ఉన్నాయి.

- యంత్రాలతో మానవ వ్యర్థాల తొలగింపు

రాష్ట్రవ్యాప్తంగా డీఐసీసీఐ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని మానవ వ్యర్థాలను యంత్రాలతో తొలగించనున్నారు. భూగర్భ డ్రైనేజీలోని చెత్తాచెదారాన్ని పారిశుధ్య కార్మికులు యంత్రాల ద్వారా తొలగించనున్నారు. తొలుత చెన్నై కార్పొరేషన్‌లో ఈ పథకం చేపడతారు. ఆ తర్వాత అన్ని కార్పొరేషన్లు, మునిసిపాలిటీలకు విస్తరిస్తారు.

- పౌష్టికాహార లోపం నిర్మూలన

రాష్ట్రంలో పౌష్టికాహార లోపంతో బాధపడే ఆరు నెలల పసికందుల నుంచి ఆరేళ్ళ బాలబాలికల వరకూ ఆర్‌యూటీఎఫ్‌ పుష్టికరమైన ఆహారాన్ని అందించనున్నారు. ఈ పథకంలో చిన్నారుల మాతృమూర్తులకు కూడా పౌష్టికాహరం సరఫరా చేస్తారు. పౌష్టికాహార కిట్లను కూడా పంపిణీ చేస్తారు. పౌష్టికాహార పథకంలో ప్రస్తుతం వారానికి ఒక కోడిగుడ్డును పంపిణీ చేస్తుండగా ఇకపై మూడు కోడిగుడ్లు, బిస్కెట్లు పంపిణీ చేయాలని స్టాలిన్‌ ఉత్తర్వులు జారీచేశారు.

- బడిపిల్లల అల్పాహార పథకం విస్తరణ

రాష్ట్రవ్యాప్తంగా కొన్ని కార్పొరేషన్లు, మునిసిపాలిటీల్లో అమలు చేస్తున్న బడి పిల్లల అల్పాహార పథకాన్ని 433 పాఠశాలల్లో విస్తరించనున్నారు. ప్రస్తుతం ఈ పథకం అమలవుతున్న 36 నగర పంచాయతీల్లో మరో 433 పాఠశాలలకు విస్తరింపజేస్తారు. ఈ విస్తరణతో రాష్ట్రవ్యాప్తంగా 1,06,404 మంది బడిపిల్లలు లబ్ధి పొందనున్నారు.

- కొత్త ఆసుపత్రులకు శంకుస్థాపన

రాష్ట్రంలో అందరికీ మెరుగైన వైద్యం అందించే దిశగా కొత్త ఆసుపత్రుల నిర్మాణ పథకం చేపట్టనున్నారు. ఆ మేరకు రాష్ట్రంలో కొత్తగా 44 చోట్ల నెలకొల్పనున్న ఆసుపత్రులకు ముఖ్యమంత్రి స్టాలిన్‌ వీడియో కాన్ఫరెన్సింగ్‌ ద్వారా శంకుస్థాపన చేశారు.

- దివ్యాంగులకు ఉచిత ఇళ్ళ పట్టాలు

రాష్ట్రవ్యాప్తంగా దారిద్య్ర రేఖకు దిగువగా ఉన్న దివ్యాంగులకు ఇంటి పట్టాలు పంపిణీ, దివ్యాంగుల ఆర్థిక స్థితిగతులను అంచనావేసి రెవెన్యూ శాఖ ద్వారా ఇళ్లను కూడా నిర్మించి ఇవ్వనున్నారు.

- హిజ్రాలకు సాయం పెంపు

రాష్ట్రవ్యాప్తంగా హిజ్రాలకు ప్రతినెలా ప్రభుత్వం ఇస్తున్న ఆర్థికసాయాన్ని రూ.1000 నుంచి రూ.1500కు పెంపు. 2008లో ఏర్పాటైన హిజ్రాల సంక్షేమ సంఘం ద్వారా వీరికి మరిన్ని సదుపాయాలను కల్పించనున్నారు.

Updated Date - 2023-03-01T08:55:10+05:30 IST