Sabarimala Jyoti: శబరిమలలో జ్యోతి దర్శనం

ABN , First Publish Date - 2023-01-15T03:19:20+05:30 IST

బరిమలలోని పొన్నంబల మేడు(కాంతమలై)పై హరిహరపుత్రుడు అయ్యప్పస్వామి శనివారం జ్యోతిస్వరూపుడిగా భక్తులకు దర్శనమిచ్చాడు.

 Sabarimala Jyoti: శబరిమలలో జ్యోతి దర్శనం

కోలాహలంగా అయ్యప్ప సన్నిధి

లక్షన్నరకు పైగా భక్తులు

పథనంతిట్ట, జనవరి 14: శబరిమలలోని పొన్నంబల మేడు(కాంతమలై)పై హరిహరపుత్రుడు అయ్యప్పస్వామి శనివారం జ్యోతిస్వరూపుడిగా భక్తులకు దర్శనమిచ్చాడు. మకరవిళక్కు సందర్భంగా శబరి కొండపై అయ్యప్ప స్వామి సన్నిధానం, పంప బేస్‌క్యాంప్‌, టోల్‌గేట్‌, నీలక్కల్‌, పులిమేడు ప్రాంతాలు కోలాహలంగా కనిపించాయి. సాయంత్రం 6.43 సమయంలో జ్యోతి దర్శనమవ్వగానే.. ఈ ప్రాంతాలన్నీ ‘స్వామియే శరణం అయ్యప్పా’ అనే శరణుఘోషలతో మార్మోగిపోయాయి. గత నెలలో భక్తుల రద్దీతో కొండపైన, పంప బేస్‌ వద్ద ఇబ్బందులు ఎదురైన నేపథ్యంలో.. పోలీసులు, ట్రావెన్‌కోర్‌ దేవస్వం బోర్డు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. గత అనుభవాల దృష్ట్యా ఎక్కడా తొక్కిసలాటలు చోటుచేసుకోకుండా ఎక్కడికక్కడ జాగ్రత్తలు తీసుకున్నారు. ముఖ్యంగా శబరి కొండపై అయ్యప్ప సన్నిధానం నుంచి మకరజ్యోతి దర్శనం కోసం భక్తులు పెద్దసంఖ్యలో చేరుతారు. ఈ నేపథ్యంలో అధికారులు ఎన్నడూ లేనివిధంగా శనివారం మధ్యాహ్నం 12 గంటల వరకే భక్తులను దర్శనానికి అనుమతించారు. ఆ తర్వాత దర్శనం స్లాట్లు ఉన్న భక్తులను పంపాబేస్‌ వద్దే నిలిపివేశారు. వారిని ఆదివారం దర్శనానికి అనుమతిస్తామని పేర్కొంటూ.. జ్యోతి దర్శనం కోసం పంపానదికి ఇరువైపులా ఏర్పాట్లు చేశారు. పంప పోలి్‌సస్టేషన్‌ సమీపంలోని హిల్‌టా్‌పపైనా భక్తుల రద్దీ లేకుండా చర్యలు తీసుకున్నారు. రాత్రి 8.45 గంటలకు సన్నిధానంలో ‘మకరసంక్రమ’ పూజలు నిర్వహించారు.

లక్షన్నరకు పైగా భక్తులు

శనివారం తెల్లవారు జాము నుంచి సాయంత్రానికి లక్షన్నరకు పైగా భక్తులు వేర్వేరు ప్రాంతాల నుంచి మకరజ్యోతిని దర్శించుకున్నట్లు అధికారులు వెల్లడించారు. నిజానికి శనివారం 40 వేల మంది భక్తులకు మాత్రమే ఆన్‌లైన్‌ ద్వారా స్లాట్లు విడుదల చేశామని, అయితే.. అంతకు నాలుగింతల సంఖ్యలో భక్తులు నీలక్కల్‌ నుంచి సన్నిధానం దాకా.. పెరియార్‌ పులుల అభయారణ్యం మీదుగా వచ్చే పులిమేడు దారిలో, ఎరుమేళి నుంచి పెద్దపాదం అడవిదారిలో ఉండి, జ్యోతి దర్శనం చేసుకున్నట్లు చెప్పారు.

కటక్‌లో తొక్కిసలాట.. మహిళ మృతి

ఒడిసా రాష్ట్రంలోని కటక్‌ సమీపంలో మహానది పైనున్న బారాంబా-గోపినాథ్‌పూర్‌ బ్రిడ్జి వద్ద జరిగిన మకర సంక్రాంతి మేళాలో జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మృతిచెందారు. మరికొందరు భక్తులు గాయపడ్డారని అధికారులు తెలిపారు. ఏటా మకర సంక్రాంతి సందర్భంగా ఇక్కడి సింఘనాథ్‌, శివాలయాల వద్ద మేళా నిర్వహించడం ఆనవాయితీ. కొవిడ్‌-19 ఆంక్షల వల్ల రెండేళ్లుగా ఈ మేళాను నిర్వహించలేదు. శనివారం సాయంత్రం మేళాకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై.. బ్రిడ్జిపైకి చేరుకున్నారు. ఒక్కసారిగా తొక్కిసలాట జరగడంతో అంజనా స్వానీ అనే 45 ఏళ్ల మహిళ అక్కడికక్కడే చనిపోయారు. మరికొందరు గాయపడ్డారు.

Updated Date - 2023-01-15T03:19:21+05:30 IST