Delhi Mayor: ఢిల్లీ మేయర్‌గా ఆప్ అభ్యర్థి షెల్లీ ఒబెరాయ్ ఏకగ్రీవ ఎన్నిక
ABN , First Publish Date - 2023-04-26T12:25:59+05:30 IST
ఢిల్లీ మేయర్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి షెల్లీ ఒబెరాయ్ ఏకగ్రీవంగా...
న్యూఢిల్లీ: ఢిల్లీ మేయర్ (Delhi Mayor) ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి షెల్లీ ఒబెరాయ్ (Shelly Oberoi) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి షిఖా రాయ్ బుధవారంనాడు తన నామినేషన్ ఉపసంహరించుకున్నారు. దీంతో షెల్లీ ఒబెరాయ్ ఎన్నిక ఏకగ్రీవమైంది. డిప్యూటీ మేయర్ ఎన్నిక నుంచి కూడా బీజేపీ తప్పుకుంది.
మేయర్ ఎన్నికలో షెల్లీ ఒబెరాయ్, షిఖారాయ్ మధ్య ముఖాముఖీ పోటీ ఉంటుందని అందరూ అంచనా వేసినప్పటికీ బీజేపీ నామినేషన్ ఉపసంహరించుకోవడంతో అధికార పార్టీ గెలుపు నల్లేరుమీద నడకే అయింది.
ఒబెరాయ్ ఫిబ్రవరి 22న ఢిల్లీ మేయర్‌గా నాలుగో ప్రయత్నంలో ఎన్నికయ్యారు. దీనికి ముందు మూడు సమావేశాల్లో ఆప్, బీజేపీ మధ్య గందరగోళం తలెత్తింది. నామినేటెడ్ సభ్యులకు ఓటింగ్ హక్కుల వ్యవహారంపై గొడవ జరగడంతో మూడుసార్లు వాయిదా పడి నాలుగోసారి ఎన్నిక జరిగింది. బీజేపీకి చెందిన రేఖా ఖప్తాను షెల్లీ ఒబెరాయ్ 34 ఓట్ల తేడాతో ఓడించారు. మొత్తం పోలైన 266 ఓట్లలో రేఖా గుప్తా 116 ఓట్లు సాధించారు.
సీఎం అభినందనలు
మేయర్‌గా గెలిచిన ఒబెరాయ్‌కు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అభినందించారు. ''షెల్లీ, ఆలే తిరిగి మేయర్ డిప్యూటీ మేయర్‌గా ఎన్నికైనందుకు నా అభినందనలు. ప్రజలకు ఆప్‌పై ఎన్నో అంచనాలు ఉన్నాయి. వారి అంచనాలను నెరవేర్చేందుకు కష్టపడి పనిచేద్దాం'' అని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.
ఢిల్లీ మేయర్ ఎన్నిక రొటేషనల్ పద్ధతిలో ఐదు సింగిల్ ఇయర్స్ టర్మ్‌తో ఉంటుంది. తొలి సంవత్సరం మహిళలకు రిజర్వ్ చేయగా, రెండో సంవత్సరం ఓపెన్ కేటగిరిగా, మూడు సంవత్సరం రిజర్వ్‌డ్ కేటగిరిగా, తక్కిన రెండేళ్లు ఓపెన్ కేటగిరిగా ఉంది. ఆర్థిక సంవత్సరం ముగిసిన తర్వాత సిటీకి కొత్త మేయర్ వస్తారు. ఈనెల ప్రారంభంలో రెండో టర్మ్ కొనసాగేందుకు ఆప్ మేయర్ అభ్యర్థిగా ఒబెరాయ్, డిప్యూటీ మేయర్‌గా మొహమ్మద్ ఇక్బాల్ నామినేషన్ వేశారు. ఈ ఇద్దరి గెలుపుపై ఆప్ సైత గట్టి ధీమా వ్యక్తం చేసింది. గత ఏడాది డిసెంబర్ 4న ఎంసీడీ ఎన్నికలు జరగగా, ఆప్ విజయకేతనం ఎగురవేసింది.