Dengue fever: కలకలం రేపుతున్న ‘డెంగీ’.. ఒక్క బెంగళూరులోనే 900 మందికి
ABN , First Publish Date - 2023-07-14T10:16:38+05:30 IST
నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలోని దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ ఒక మాదిరి నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. ఇదే సమయంలో
- అప్రమత్తంగా ఉండాలంటున్న వైద్యులు
బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలోని దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ ఒక మాదిరి నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. ఇదే సమయంలో అనేక జిల్లాల్లో డెంగీ జ్వరాలు(Dengue fever) క్రమేపీ పెరుగుతుండటంతో ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. రాష్ట్రవ్యాప్తంగా జనవరి నుంచి ఇంతవరకు 3వేల మందికి పైగా డెంగీ జ్వరాలతో అలమటిస్తూ ఆసుపత్రుల్లో చేరారని ఆరోగ్య శాఖ ఉన్నతాధికారి ఒకరు గురువారం వెల్లడించారు. రాజధాని బెంగళూరు నగరంలో సుమారు 900 మందికి డెంగీ సోకినట్లు ఆయన తెలిపారు. డెంగీ జ్వరాల విషయంలో విజయపుర(Vijayapura) రెండో స్థానంలో ఉంది. డెంగీ వైరస్ 1తో పెద్దగా ప్రాణాపాయం ఉండదని అయితే వైరస్ 2తో మాత్రం ఇబ్బందేనని ఆయన వివరించారు. డెంగీ బారిన పడ్డవారిలో హఠాత్తుగా తీవ్ర జ్వరం, తలనొప్పి, గొంతునొప్పి, వాంతులు, కడుపునొప్పి ఒళ్ళంతా నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తాయన్నారు. వర్షాకాలం కావడంతో ఇంటి చుట్టు పరిసరాల్లో నీరు నిలిచిపోకుండా చూసుకోవాలని దీనివల్ల దోమలు వృద్ధి చెందుతాయన్నారు. వర్షాకాలం పూర్తయ్యేంత వరకు దోమల నియంత్రణకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. డెంగీ జ్వరం వల్ల దేహంలో నీటి ప్రమాణం గణనీయంగా తగ్గిపోయి ప్రాణాపాయం ఏర్పడే ప్రమాదం ఉంటుందన్నారు. కాగా వర్షాలు అధికంగా పడుతున్న కోస్తా జిల్లాల్లో ఇప్పటికే ఆరోగ్య శాఖ ర్యాపిడ్ టెస్టింగ్ బృందాలను రంగంలోకి దించిందన్నారు. డెంగీతో ప్రజలు ఏమాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అయితే అప్రమత్తత పాటించాలని సదరు అధికారి వివరించారు. కాగా రాజధాని బెంగళూరు నగరంలో గత 12 రోజుల అవధిలోనే 178 డెంగీ కేసులు నమోదైనట్లు బీబీఎంపీ ఆరోగ్య శాఖాధికారులు తెలిపారు. నగరంలో నెల రోజులుగా జ్వరాలతో అలమటిస్తున్న 3,565 మందికి రక్తపరీక్షలు జరిపామని ఇందులో వెయ్యిమంది విషయంలో అనుమానాలు ఉండటంతో ల్యాబ్‌కు పంపగా 900 మందికి డెండీ నిర్ధారణ అయిందన్నారు. డెంగీకి గురై నగరంలో పవన్‌కుమార్ (30) అనే కానిస్టేబుల్ మృతి చెందారు. ఇతనిని చిత్రదుర్గ నివాసిగా గుర్తించారు. కాగా నగరంలో చికెన్ గన్యాతో బీఈఎంపీ పరిధిలో 400 మందికి పైగా అలమటిస్తున్నట్లు అధికారులు తెలిపారు.