Dengue fever: రాష్ట్రాన్ని వణికిస్తున్న డెంగ్యూ జ్వరాలు
ABN , First Publish Date - 2023-10-11T09:00:27+05:30 IST
రాష్ట్రాన్ని డెంగ్యూ దోమ భయపెడుతోంది. గత ఎనిమిది రోజుల్లో ఏకంగా 273 మంది డెంగ్యూ(Dengue) బారినపడ్డారు. దీంతో
- 8 రోజుల్లో 273 మంది బాధితులు ఫ అప్రమత్తమైన ప్రజా ఆరోగ్య శాఖ
అడయార్(చెన్నై): రాష్ట్రాన్ని డెంగ్యూ దోమ భయపెడుతోంది. గత ఎనిమిది రోజుల్లో ఏకంగా 273 మంది డెంగ్యూ(Dengue) బారినపడ్డారు. దీంతో ప్రజా ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. డెంగ్యూ ప్రబలకుండా తగిన చర్యలు తీసుకోవాలంటూ ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించింది. ముఖ్యంగా డెంగ్యూ దోమల ఉత్పత్తిని నియంత్రించేలా జనావాసాల్లో రసాయనాలను పిచికారి చేయాలని ఆదేశించింది. రానున్న మూడు నెలల్లో ఈ దోమల వ్యాప్తితో డెంగ్యూ జ్వరపీడితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వైద్య సిబ్బంది అప్రతమత్తంగా ఉండాలని ఆదేశించింది. ఇదే విషయంపై వైద్య ఆరోగ్య శాఖ సంచాలకుడు సెల్వ వినాయగం మాట్లాడుతూ... డెంగ్యూ జ్వరం నిర్ధరణ కోసం నిర్వహించే రక్తపరీక్షల ఫలితాలను ఆరు గంటల్లో ఇచ్చే విధంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపారు. డెంగ్యూ జ్వరం బాడినపడే వారిని గుర్తించేందుకు ప్రతి జిల్లాలోనూ ఒక ప్రత్యేక అధికారిని నియమించినట్టు వెల్లడించారు.
జనవరి నుంచి ఇప్పటివరకు..
ఈ యేడాది జనవరి నుంచి ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా డెంగ్యూ జ్వర పీడితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. జనవరి నుంచి అక్టోబరు 8వ తేదీ వరకు మొత్తం 4847 మంది డెంగ్యూ బారినపడ్డారు. జనవరిలో 866 మంది, ఫిబ్రవరిలో 641, మార్చిలో 512, ఏప్రిల్‌లో 302, మే నెలలో 271, జూన్‌లో 364, జూలైలో 353, ఆగస్టులో 535, సెప్టెంబరులో 730, అక్టోబరు 8వ తేదీ వరకు 273 మంది డెంగ్యూ బారినపడినట్టు ప్రజాఆరోగ్య శాఖ వర్గాలు వెల్లడించాయి. అక్టోబరు నెల ప్రారంభమైన తర్వాత ఏకంగా 273 మంది ఈ జ్వరంబారిన పడ్డారు. జనవరి నుంచి రోజుకు సగటున 40 మంది జ్వర పీడితులుగా నమోదవుతున్నారు. అలాగే, నలుగురు డెంగ్యూ జ్వరపీడితులు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 503 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 2019లో డెంగ్వూ జ్వర పీడితుల సంఖ్య 8527గా ఉంటే 2020లో ఈ సంఖ్య 2410గాను, 2021లో 6039గాను, 2022లో 6430కు చేరుకుంది.
సమాచార హక్కు చట్టం...
ఇదిలావుంటే, ఈ నెల 5వ తేదీ నుంచి 12వ తేదీ వరకు సమాచార హక్కు చట్టంపై అవగాహన కల్పిస్తున్నారు. స్థానిక తేనాంపేటలోని డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (డీఎంఎస్) ప్రాంగణంలో ప్రజా ఆరోగ్య సంచాలకుడు సెల్వవినాయగంతో పాటు ఆ శాఖ ఉద్యోగులు పాల్గొని సమాచార హక్కు చట్టం కింద వైద్య ఆరోగ్య శాఖలో సమాచారం, గణాంకాలు ఏ విధంగా పొందాలన్న అంశంపై అవగాహన కల్పిస్తారు.