Dengue: అమ్మో.. బాగానే పెరిగాయిగా... రాష్ట్రంలో 113 మందికి డెంగ్యూ
ABN , First Publish Date - 2023-09-15T06:53:49+05:30 IST
రాష్ట్రంలో గత వారం రోజుల వ్యవధిలో డెంగ్యూ(Dengue) బాధితుల సంఖ్య 113కు చేరింది. దీంతో ఈ జ్వరం రాష్ట్ర వ్యాప్తంగా విజృంభించకుండా రాష్ట్ర ప్రభుత్వం తక్షణ చర్యలకు దిగింది.
- 24 వేలమంది వైద్యసిబ్బందితో నిరోధక చర్యలు
చెన్నై, (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో గత వారం రోజుల వ్యవధిలో డెంగ్యూ(Dengue) బాధితుల సంఖ్య 113కు చేరింది. దీంతో ఈ జ్వరం రాష్ట్ర వ్యాప్తంగా విజృంభించకుండా రాష్ట్ర ప్రభుత్వం తక్షణ చర్యలకు దిగింది. రాష్ట్రమంతా డెంగ్యూ జ్వరాలను నిరోధించే చర్యల నిమిత్తం 24 వేలమంది వైద్యసిబ్బంది రంగంలోకి దింపింది. ఇటీవల మధురవాయల్‌కు చెందిన నాలుగేళ్ల బాలుడు డెంగ్యూతో మరణించిన విషయం తెలిసిందే. అదే సమయంలో తిరువారూరు, పుదుకోట, తంజావూరు, తిరువణ్ణామలై, కడలూరు(Tiruvarur, Pudukota, Thanjavur, Tiruvannamalai, Cuddalore) తదితర జిల్లాల్లో ఈ జ్వరాలు అధికమవుతున్నాయి. గురువారం ఉదయం రాష్ట్ర వ్యాప్తంగా 30 మంది ఈ జ్వరంతో బాధపడుతూ వివిధ ఆస్పత్రుల్లో చేరారు. గడిచిన 13 రోజుల్లో 204 మంది ఈ జ్వరాలకు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. రోజూ సగటున 15 నుంచి 20 మంది వరకు డెంగ్యూతో చికిత్స కోసం ఆస్పత్రుల్లో చేరుతున్నారని ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు.
కాగా డెంగ్యూ ప్రబలిన ప్రాంతాల్లో అధికారులు ఎక్కడికక్కడ రోగులను పరీక్షిస్తున్నారు. మరీ ముఖ్యంగా రాష్ట్ర సరిహద్దు జిల్లాలైన కోయంబత్తూరు, కన్నియకుమారి తదితర ప్రాంతాల్లో ముమ్మరంగా పరీక్షలు జరుపుతున్నారు. ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం(Health Minister M. Subramaniam) గురువారం ఈ పరీక్షలను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా వుంచుకోవాలని సూచించారు. ఇళ్ల చుట్టూ చేరే మురుగునీటిలో పెరిగే దోమల కారణంగానే డెంగ్యూ జ్వరాలు వ్యాపిస్తాయన్నారు. ఇళ్లలో ఏ ప్రాంతంలో నీటి నిల్వలు లేకుండా పాత ప్లాస్టిక్ సామగ్రి, పాత టైర్లు లేకుండా జాగ్రత్త వహించాలని విజ్ఞప్తి చేశారు. ఈ జ్వరాలపై ప్రజల్లో అవగాహన కల్పించేలా ప్రచార కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నామని చెప్పారు. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో దోమల నిర్మూలన కార్యక్రమాలను కూడా ముమ్మరంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు.