Bharat Vs India : భారత్, ఇండియా మధ్య తేడా చెప్పిన లాలూ ప్రసాద్ యాదవ్.. వైరల్ అవుతున్న పాత వీడియో..

ABN , First Publish Date - 2023-09-06T15:26:38+05:30 IST

జీ20 సదస్సుకు హాజరయ్యే విదేశీ నేతలను విందుకు ఆహ్వానిస్తూ రాష్ట్రపతి భవన్ పంపిన ఆహ్వాన పత్రాల్లో రాష్ట్రపతిని ‘ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా’కు బదులుగా ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’ అని సంబోధించడంతో అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్యుద్ధం జరుగుతోంది.

Bharat Vs India : భారత్, ఇండియా మధ్య తేడా చెప్పిన లాలూ ప్రసాద్ యాదవ్.. వైరల్ అవుతున్న పాత వీడియో..
Lalu Prasad Yadav

న్యూఢిల్లీ : మన దేశం పేరును మార్చబోతున్నారనే ప్రచారం నడుమ గతంలో లాలూ ప్రసాద్ యాదవ్ ఇచ్చిన ఇంటర్వ్యూ వైరల్ అవుతోంది. జీ20 సదస్సుకు హాజరయ్యే విదేశీ నేతలను విందుకు ఆహ్వానిస్తూ రాష్ట్రపతి భవన్ పంపిన ఆహ్వాన పత్రాల్లో రాష్ట్రపతిని ‘ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా’కు బదులుగా ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’ అని సంబోధించడంతో అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్యుద్ధం జరుగుతోంది.

ఆర్జేడీ చీఫ్, బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ గతంలో ఓ న్యూస్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. లాలూ ఉదయాన్నే వేప పుల్లతో దంత ధావనం చేసుకుంటున్న సమయంలో ఆ విలేకరి ఆయనను ఇంటర్వ్యూ చేశారు. ఢిల్లీలో మీకు వేప పుల్లలు దొరుకుతున్నాయా? అని ఆ విలేకరి ఆయనను అడిగారు. అందుకు ఆయన బదులిస్తూ, ఢిల్లీ ‘ఇండియా’ పరిధిలో ఉన్నందువల్ల వేప పుల్లలు దొరకడం కష్టంగా ఉందని, పాట్నా ‘భారత్’ క్రింద ఉందని చెప్పారు.

బిహార్ రాజధాని నగరం పాట్నాలో వేప పుల్లలు విరివిగా దొరుకుతాయని, ఢిల్లీ నగరంలో అవి దొరకడం చాలా కష్టంగా ఉందని లాలూ అభిప్రాయం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.


జీ20 సదస్సు న్యూఢిల్లీలో ఈ నెల 9, 10 తేదీల్లో జరుగుతుంది. దాదాపు 30 దేశాలకు చెందిన అగ్ర నేతలు ఈ సమావేశాల్లో పాల్గొంటారు. ఈ ఏడాది ఈ సదస్సుకు భారత దేశం అధ్యక్షత వహిస్తోంది. ఈ సదస్సుకు హాజరయ్యే వివిధ దేశాల అగ్ర నేతల గౌరవార్థం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Draupadi Murmu) ఈ నెల 9న విందు ఇవ్వబోతున్నారు. దీని కోసం రాష్ట్రపతి భవన్ పంపిన ఆహ్వాన పత్రికల్లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు బదులుగా ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని రాశారు. అదేవిధంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటనకు సంబంధించిన పత్రాల్లో కూడా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భారత్ అని రాశారు. జీ20 సదస్సు కోసం రూపొందించిన పుస్తకంలో కూడా మన దేశాన్ని భారత్ అని పేర్కొన్నారు. జీ20 నేతల సమావేశంలో పాల్గొనే భారతీయ అధికారులకు జారీ చేసే గుర్తింపు కార్డుల్లో ‘ఇండియన్ అఫిషియల్’కు బదులుగా ‘భారత్ అఫిషియల్’ అని రాశారు. ఈ నేపథ్యంలో మన దేశం పేరును గతంలో మాదిరిగానే భారత్ అని మార్చబోతున్నారనే ప్రచారం జరుగుతోంది.


ఇవి కూడా చదవండి :

Rahul Gandhi : యూరోప్ పర్యటనకు వెళ్లిన రాహుల్ గాంధీ?

India : ‘ఇండియా’ పేరుపై హక్కు పాకిస్థాన్‌దేనా?

Updated Date - 2023-09-06T15:26:38+05:30 IST