International Biryani Day: నిమిషానికి 219, ఏడాదికి 7.6 కోట్లు.. స్విగ్గీలో రికార్డులు బద్దలు కొట్టిన బిర్యానీ

ABN , First Publish Date - 2023-07-02T20:18:44+05:30 IST

జూలై 2న అంతర్జాతీయ బిర్యానీ దినోత్సవాన్ని (International Biryani Day) పురస్కరించుకుని ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ (Swiggy) గత ఏడాది కాలంలో తమ యాప్‌లో నమోదైన ఆర్డర్ల రికార్డులను బయటపెట్టింది. గత 12 నెలల్లో భారతీయులు 76 మిలియన్లకు పైగా బిర్యానీ (biryani) ఆర్డర్‌లు అంటే 7.6 కోట్లకు పైగా ఆర్డర్లు చేశారని స్విగ్గీ వెల్లడించింది.

International Biryani Day: నిమిషానికి 219, ఏడాదికి 7.6 కోట్లు.. స్విగ్గీలో రికార్డులు బద్దలు కొట్టిన బిర్యానీ

బిర్యానీ.. ఈ పేరు వింటే చాలు నోట్లో నీళ్లు ఊరుతాయి. బిర్యానీ వాసన వస్తే చాలు ఎప్పుడెప్పుడు వెళ్లి తినేద్దామా అని ఆత్రుతగా ఎదురుచూసేవారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. నలుగురు స్నేహితులు కలిసినా, పండగ అయినా, దావత్ అయినా, పెళ్లి అయినా బిర్యానీ ఉండాల్సిందే. బిర్యానీ రైస్ మధ్యలో చికెన్ లేదా మటన్ ముక్క పెట్టుకోని తింటుంటే వచ్చే ఆనందమే వేరు. పాత కాలంలో పెద్దలు తింటే గారెలే తినాలి అని చెప్పిన సామెత ఎంత నిజమో.. ఈ రోజుల్లో తింటే బిర్యానినే తినాలి అనే మాట కూడా అంతే నిజం. అలాంటి బిర్యానీని మనవాళ్లు ఎందుకు వదులుతారు. అందుకే బిర్యానీ ఆర్డర్లలో రికార్డులు బద్దలయ్యాయి.

biryani in hyderabad.webp

జూలై 2న అంతర్జాతీయ బిర్యానీ దినోత్సవాన్ని (International Biryani Day) పురస్కరించుకుని ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ (Swiggy) గత ఏడాది కాలంలో తమ యాప్‌లో నమోదైన ఆర్డర్ల రికార్డులను బయటపెట్టింది. గత 12 నెలల్లో భారతీయులు 76 మిలియన్లకు పైగా బిర్యానీ (biryani) ఆర్డర్‌లు అంటే 7.6 కోట్లకు పైగా ఆర్డర్లు చేశారని స్విగ్గీ వెల్లడించింది. 2023 జనవరి నుంచి 2023 జూన్ 15 వరకు అంటే ఐదున్నర నెలల్లో చేసిన ఆర్డర్‌లతో పోలిస్తే.. 2022 సంవత్సరం మొత్తంలో చేసిన బిర్యానీ ఆర్డర్‌లలో కంటే 8.26 శాతం అధిక వృద్ధి నమోదైందని స్విగ్గీ ప్రకటించింది. అంటే మన బిర్యానీ ప్రియుల దెబ్బకు గత ఏడాది కాలంలో నమోదైన రికార్డులు ఈ ఏడాది 6 నెలల్లోనే బద్దలయ్యాయి. స్విగ్గీ యాప్ ద్వారా దేశవ్యాప్తంగా 2.6 లక్షల రెస్టారెంట్లు (Biryani Restaurants) బిర్యానీని అందిస్తున్నాయని, 28 వేలకు పైగా రెస్టారెంట్లు బిర్యానీలో ప్రత్యేకతను కల్గి ఉన్నాయని చెప్పుకొచ్చింది.

20230310123001-ambur-20chicken-20biryani.webp

"సుగంధ లక్నో బిర్యానీ నుంచి హైదరాబాదీ మసాలా దమ్ బిర్యానీ వరకు, రుచిగల కోల్‌కతా బిర్యానీ నుంచి సువాసన గల మలబార్ బిర్యానీ వరకు.. సగటున దేశవ్యాప్తంగా నిమిషానికి 219 బిర్యానీ ఆర్డర్‌లు నమోదవుతున్నాయని" అని స్విగ్గీ అధికారికంగా ప్రకటించింది. స్విగ్గీ తెలిపిన వివరాల ప్రకారం అత్యధికంగా బిర్యానీ రెస్టారెంట్లు ఉన్న నగరాల జాబితాలో బెంగళూరు ( Bengaluru) అగ్ర స్థానంలో ఉంది. బెంగళూరులో ఏకంగా 24,000 బిర్యానీ రెస్టారెంట్లు ఉన్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో 22,000 రెస్టారెంట్లతో ముంబై (Mumbai), 20,000 రెస్టారెంట్లతో ఢిల్లీ ( Delhi) ఉన్నాయి.

Egg-Biryani-Recipe-4-1280x720.jpg

ఇక అత్యధిక మంది బిర్యానీని ఆర్డర్ చేస్తున్న నగరాల జాబితాలో మన హైదరాబాద్ (Hyderabad) మొదటి స్థానంలో ఉంది. ఈ ఏడాది జూన్ వరకు హైదరాబాద్ వాసులు ఏకంగా 7.2 మిలియన్ల బిర్యానీ ఆర్డర్లను నమోదు చేశారు. ఆ తర్వాత 5 మిలియన్ల ఆర్డర్లతో బెంగళూరు, 3 మిలియన్ల ఆర్డర్లతో చెన్నై(Chennai) రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. కాగా చెన్నైలోని ఓ వ్యక్తి ఒకేసారి రూ.31,532 బిర్యానీని ఆర్డర్ చేయడం ఓ రికార్డుగా మారింది.

chicken-Biryani.jpg

కాగా అత్యధిక ఆదరణ పరంగా దమ్ బిర్యానీ (Dum Biryani) ముందుంది. 85 వేరియంట్‌లను కల్గి ఉన్న దమ్ బిర్యానీకి ఈ ఏడాది ఇప్పటివరకు 6.2 మిలియన్లపై పైగా ఆర్డర్లు వచ్చాయని స్విగ్గీ వెల్లడించింది. ఆ తర్వాతి స్థానాల్లో 3.5 మిలియన్ల ఆర్డర్లతో బిర్యానీ రైస్(Biryani Rice), 2.8 మిలియన్ల ఆర్డర్లతో హైదరాబాదీ బిర్యానీ(Hyderabad Biryani) ఉన్నాయి. అయితే ఇవన్నీ ఒక్క స్విగ్గీలో నమోదైన ఆన్‌లైన్ ఆర్డర్ల వివరాలు మాత్రమే. జోమాటోలో (Zomato) కూడా నమోదైన ఆన్‌లైన్ ఆర్డర్ల వివరాలను వెల్లడిస్తే బిర్యానీ ప్రియుల సంఖ్య మరింత పెరగనుంది. అలాగే ఆర్డర్ పెట్టుకోవడానికి నేరుగా రెస్టారెంట్లు లేదా బిర్యానీ సెంటర్లకు వెళ్లి తినే వారి సంఖ్య కూడా భారీగా ఉంటుంది.

Updated Date - 2023-07-02T20:31:16+05:30 IST