Karnataka Elections 2023: అమూల్‌ తరహాలోనే.. గుజరాత్‌ మిర్చి ఘాటు

ABN , First Publish Date - 2023-04-15T16:23:12+05:30 IST

కర్ణాటక రాష్ట్రంలో (Karnataka) అమూల్‌, నందిని డెయిరీ ఉత్పత్తుల వివాదం (Amul vs Nandini) తారస్థాయికి చేరింది. ఎన్నిAకల వేడి (Karnataka Elections 2023) తోడవడంతో..

Karnataka Elections 2023: అమూల్‌ తరహాలోనే.. గుజరాత్‌ మిర్చి ఘాటు

బెంగళూరు (ఆంధ్రజ్యోతి): కర్ణాటక రాష్ట్రంలో (Karnataka) అమూల్‌, నందిని డెయిరీ ఉత్పత్తుల వివాదం (Amul vs Nandini) తారస్థాయికి చేరింది. ఎన్నికల వేడి (Karnataka Elections 2023) తోడవడంతో మరింత ఘాటైన విమర్శలు కొనసాగుతున్నాయి. ఇదే సందర్భంలోనే రాష్ట్ర మార్కెట్‌లోకి గుజరాత్‌లో పండించే బ్యాడగి మిరప పుష్ప రకం (Pushpa Mirchi) చేరడం మరోసారి వివాదాస్పదమవుతోంది. ఇది కూడా పెను వివాదానికి దారి తీసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో మసాలా పొడులు తయారు చేసే పలువురు వ్యాపారులు గుజరాత్‌ నుంచి పుష్ప రకం మిరపను కొనుగోలు చేశారు. కానీ మార్కెట్‌లో నేరుగా పుష్ప రకం విక్రయాలు జరిగిన దాఖలాలు లేవు. రాష్ట్రానికి చెందిన 70 మందికి పైగా మిరప వ్యాపారులు గుజరాత్‌ మిరపను సమీపంలోని కోల్డ్‌స్టోరేజ్‌లలో నిల్వ ఉంచి అవసరాన్ని బట్టి వాడుకుంటున్నట్టు తెలుస్తోంది.

బ్యాడగి రకం మిరప ఆంధ్ర, తెలంగాణతోపాటు వివిధ రాష్ట్రాల నుంచి మార్కెట్‌కు వస్తుంది. ఇది దశాబ్దాల కాలంగా కొనసాగుతున్న విధానమే. హావేరి జిల్లా బ్యాడగి తాలూకాలో మిరపసాగు కావడం లేదు. దీంతో ఇతర ప్రాంతాల నుంచి వచ్చే మిరప మార్కెట్‌లో విక్రయాలు సాగుతున్నాయి. ఇదే తరుణంలోనే గుజరాత్‌లో పండించే పుష్ప రకం మిరప వాడుతున్నట్టు తెలుస్తోంది. గుజరాత్‌ నుంచి పుష్ప రకం మిరప బ్యాడగి ఏపీఎంసీ మార్కెట్‌లోకి రాలేదని కార్యదర్శి సతీశ్‌ వెల్లడించారు. మసాలా పొడులు తయారు చేసే వ్యాపారులు నేరుగా దిగుమతి చేసుకుంటున్నారని వెల్లడించారు.

బ్యాడగి మార్కెట్‌లో కడ్డీ, డబ్బీ, గుంటూరు తరహా వంగడాలలో గుజరాత్‌ మిరప పోటీనే కాదని వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు. ఎరుపు రంగు ఎక్కువగా ఉండడంతో ఆకర్షణీయంగా ఉంటుందని వ్యాపారులు కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. గుజరాత్‌ మిరపను టెండర్ల ద్వారా కొనుగోలు చేసిన దాఖలాలు లేవు. ఏపీఎంసీ చట్టప్రకారం దేశంలోని ఏ ప్రాంతంలోని దిగుబడినైనా ఎక్కడైనా మార్కెటింగ్‌ చేసుకునే వీలుంది. అయితే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోని కోల్డ్‌ స్టోరేజ్‌లలో నిల్వ ఉన్నట్టు తెలుస్తోంది. దేశంలో బ్యాడగి మిరప సాగులో ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలు అగ్రస్థానంలో ఉన్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లోనే దాదాపు 60 శాతం పంట దిగుబడి కానుంది. కర్ణాటక నాల్గవ స్థానంలో ఉండగా గుజరాత్‌ ఏడో స్థానంలో ఉంది. దేశంలో మిరప ఉత్పత్తిలో గుజరాత్‌ వాటా కేవలం ఒకశాతం కంటే తక్కువ ఉంది. కర్ణాటక 10 శాతం ఉత్పత్తి చేయనుంది.

Updated Date - 2023-04-15T16:23:24+05:30 IST