North Korea : కిమ్ జోంగ్ ఉన్ వారసురాలు ఈమె!?

ABN , First Publish Date - 2023-02-09T14:25:27+05:30 IST

ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ (Kim Jong Un) తన రాజకీయ వారసురాలిని రంగంలోకి దించినట్లు కనిపిస్తోంది.

North Korea : కిమ్ జోంగ్ ఉన్ వారసురాలు ఈమె!?
Kim Jong Un, Kim Ju Ae

న్యూఢిల్లీ : ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ (Kim Jong Un) తన రాజకీయ వారసురాలిని రంగంలోకి దించినట్లు కనిపిస్తోంది. ఆయన రెండో కుమార్తె కిమ్ జు ఆయే (Kim Ju Ae) ఇటీవల పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటుండటంతో ఈ ఊహాగానాలకు తెర లేచింది. తొమ్మిదేళ్ల వయసుగల కిమ్ జు ఆయే తాజాగా మంగళవారం ఉత్తర కొరియా సైన్యం వ్యవస్థాపక దినోత్సవాల సందర్భంగా జరిగిన విందులో తన తండ్రితో కలిసి పాల్గొన్నారు.

ఉత్తర కొరియా అధికారిక కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ బుధవారం తెలిపిన వివరాల ప్రకారం, కిమ్ జోంగ్ ఉన్ తన కుమార్తెతో కలిసి కొరియన్ పీపుల్స్ ఆర్మీ జనరల్ ఆఫీసర్స్ లాడ్జింగ్ క్వార్టర్స్‌ను మంగళవారం సందర్శించారు. అనంతరం జరిగిన విందులో రక్షణ దళాలను ఉద్దేశించి ప్రసంగించారు. విదేశాల నుంచి ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రపంచంలో బలమైన సైన్యంగా నిలుస్తున్నందుకు ప్రశంసించారు. ఈ విందు ప్యాంగ్యాంగ్‌లోని యాంగక్డో హోటల్‌లో జరిగింది. కిమ్, ఆయన సతీమణి, ఆయన కుమార్తె కలిసి ఎర్ర తివాచీపై నడుస్తూ వస్తున్న ఫొటోలను స్టేట్ మీడియా ప్రచురించింది. కిమ్, ఆయన కుమార్తె తెలుపు రంగు చొక్కాలు, నల్లని రంగు సూట్స్ ధరించారు. ఆమె తన తండ్రి పక్కనే కూర్చున్నారు. ఈ విందుకు సీనియర్ మిలిటరీ అధికారులు హాజరయ్యారు. కిమ్ జోంగ్ ఉన్‌తో కలిసి ఆమె అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడం ఇది నాలుగోసారి. ఆమె గౌరవనీయమైన, ప్రియాతిప్రియమైన అధినేత కుమార్తె అని ఉత్తర కొరియా మీడియా తెలిపింది. ఆమె వరుసగా అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటుండటంతో దేశాన్ని పరిపాలించబోయే నేత ఆమేనని పరిశీలకులు ఊహిస్తున్నారు.

గత నవంబరులో ఆమె ఇంటర్‌కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ ఫ్లైట్ టెస్ట్‌కు హాజరయ్యారు. తన తండ్రితో కలిసి మిలిటరీ సైంటిస్ట్స్ సమావేశానికి, బాలిస్టిక్ మిసైల్స్ తనిఖీకి హాజరయ్యారు.

మరికొందరు మాత్రం ఆమె పరిపాలకురాలు కాబోతోందనే ఊహాగానాలను అంగీకరించడం లేదు. ఇప్పుడు ఈ విధంగా ఊహించడం అపరిపక్వమవుతుందని చెప్తున్నారు. ఆమె ప్రవర్తన కృత్రిమంగా ఉందని అంటున్నారు.

ఉత్తర కొరియా ఉన్నత స్థాయి సైనిక అధికారులతో మంగళవారం జరిగిన సమావేశంలో కిమ్ మాట్లాడుతూ, యుద్ధ సన్నద్ధతను మరింత పెంచుకునేందుకు విన్యాసాలను పెంచాలని ఆదేశించారు. ఆయుధాల ప్రదర్శనను మరింత పెంచాలని పిలుపునిచ్చారు.

ఇప్పటికే దక్షిణ కొరియా, అమెరికా-ఉత్తర కొరియా మధ్య ఉద్రిక్త వాతావరణం ఉన్న సంగతి తెలిసిందే.

Updated Date - 2023-02-09T14:25:31+05:30 IST