Share News

Mohamed Muizzu: వీలైనంత త్వరగా భారత సైన్యాన్ని వెనక్కు పంపుతాం.. మరోసారి మాల్దీవుల అధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2023-10-29T22:47:14+05:30 IST

తాను అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన వారం రోజుల్లోపే భారత సైన్యాన్ని తమ గడ్డ నుంచి వెనక్కు భారతదేశానికి పంపుతానని మాల్దీవుల నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన మహ్మద్ ముయిజ్జు ఇదివరకే సంచలన వ్యాఖ్యలు..

Mohamed Muizzu: వీలైనంత త్వరగా భారత సైన్యాన్ని వెనక్కు పంపుతాం.. మరోసారి మాల్దీవుల అధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలు

తాను అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన వారం రోజుల్లోపే భారత సైన్యాన్ని తమ గడ్డ నుంచి వెనక్కు భారతదేశానికి పంపుతానని మాల్దీవుల నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన మహ్మద్ ముయిజ్జు ఇదివరకే సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి ఆయన ఆ అంశాన్ని ప్రస్తావించారు. భారత సైనిక సిబ్బందిని వీలైనంత త్వరగా తమ తీరం నుంచి వెనక్కి పంపేందుకు మాల్దీవులు కృషి చేస్తుందని తెలిపారు. దేశ విదేశాంగ విధానానికి ఇది అవసరమని.. మాల్దీవుల తీరం నుండి భారత సైన్యాన్ని వెనక్కు పంపడమే తన ఎన్నికల ప్రచారంలో ప్రధాన విధామని పేర్కొన్నారు. ఈ విషయంపై తాను భారతదేశంతో స్పష్టమైన, వివరణాత్మక దౌత్యపరమైన సంప్రదింపులు జరుపుతానని వెల్లడించారు.


ఇక్కడ తన దృష్టి అసలు సైనిక సిబ్బంది సంఖ్యపై కాదని, మాల్దీవుల్లో భారతీయ సైనికులెవరూ ఉండకుండా చూసుకోవడమేనని మహ్మద్ ముయిజ్జు వివరణ ఇచ్చారు. ఈ విషయంపై భారత ప్రభుత్వంతో చర్చించి.. ఒక మార్గాన్ని కనుగొంటామన్నారు. మాల్దీవుల్లో మోహరించిన భారతీయ సైనిక సిబ్బందిని తొలగించే తన ప్రచార వాగ్దానానికి కట్టుబడి ఉంటానని ఆయన నొక్కి చెప్పారు. తమ గడ్డపై విదేశీ దళాలు అక్కర్లేదని మాల్దీవుల ప్రజలు తెలిపారని.. వారి అభీష్టం మేరకే భారత సైన్యాన్ని వెనక్కు పంపాలని నిర్ణయించానని తెలిపారు. ఇదే సమయంలో.. భారతీయ సైనికులు తిరిగి వెనక్కు వెళ్లాక, వారి స్థానంలో ఇతర దేశాల సైనికులు ఉండరని ఆయన స్పష్టం చేశారు. తాము అన్ని దేశాల నుండి సహాయ, సహకారం కోరుకుంటున్నాము.. పరస్పర ప్రయోజనకరమైన ద్వైపాక్షిక సంబంధాలను కోరుతున్నామని చెప్పుకొచ్చారు.

కాగా.. మాల్దీవుల ప్రస్తుత అధ్యక్షుడు ఇబ్రహీం సోలిహ్‌పై మహ్మద్ ముయిజ్జు ఘనవిజయం సాధించారు. ఈయన మాల్దీవుల అధ్యక్షుడిగా నవంబర్ 17న బాధ్యతలు చేపట్టనున్నారు. ఈయనను చైనా మద్దతుదారుగా విస్తృతంగా పరిగణిస్తారు. ఎన్నికల్లో ముయిజ్జు విజయం సాధించిన తర్వాత చైనా ఆయనకు శుభాకాంక్షలు తెలిపింది. చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ మాట్లాడుతూ.. మాల్దీవుల ప్రజల ఎంపికను చైనా గౌరవిస్తుందని, కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జుకు అభినందనలని తెలిపింది.

Updated Date - 2023-10-29T22:47:14+05:30 IST