Indian Pharma: అమెరికా ప్రతీకార సుంకాలతో మన ఫార్మా’కు దెబ్బ
ABN , Publish Date - Mar 27 , 2025 | 05:08 AM
అమెరికా భారతీయ ఫార్మా ఉత్పత్తులపై ప్రతీకార సుంకాలు విధిస్తే ఔషధాల ధరలు పెరిగి, కంపెనీల లాభాలు తగ్గిపోతాయని బీఆర్‌ఎస్ ఎంపీ పార్థసారథి రెడ్డి రాజ్యసభలో తెలిపారు. ఈ ప్రభావాన్ని తగ్గించేందుకు అమెరికాతో దౌత్య చర్చలు అవసరమని సూచించారు.

ఔషధాల ధరలు పెరిగిపోయి యూఎస్
మార్కెట్లో మన వాటా తగ్గిపోయే ముప్పు
రాజ్యసభలో బీఆర్‌ఎస్ ఎంపీ, హెటెరో గ్రూప్
సంస్థల చైర్మన్ పార్థసారథి రెడ్డి ఆందోళన
అమెరికాతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం
కుదుర్చుకోవడానికి ప్రాధాన్యమివ్వాలని సూచన
న్యూఢిల్లీ, మార్చి 26: భారతీయ ఫార్మా ఎగుమతులపై అమెరికా గనక ప్రతీకార సుంకాలు విధిస్తే ఔషధాల ధరలు పెరిగిపోయి, ఆ దేశ మార్కెట్లో మన సంస్థల వాటా తగ్గిపోయే ప్రమాదం ఉందని బీఆర్‌ఎస్ ఎంపీ, హెటెరో గ్రూపు సంస్థల చైర్మన్ బి.పార్థసారథి రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. మన ఫార్మా ఉత్పత్తులను అత్యధికంగా దిగుమతి చేసుకుంటున్న దేశం అమెరికాయేనని.. భారత ఫార్మా ఎగుమతుల్లో ఆ దేశ వాటా 31 శాతంగా ఉందని.. 2023-24లో అమెరికాకు మన ఫార్మా ఎగుమతుల విలువ దాదాపు రూ.74 వేల కోట్లని బుధవారం రాజ్యసభలో ఆయన వివరించారు. ఇప్పుడు మన ఫార్మా ఉత్పత్తులపై అమెరికా అధిక సుంకాలు విధిస్తే అక్కడ మన ఔషధాల ధరలు పెరుగుతాయని, ఫలితంగా ఇతర దేశాలతో పోటీని మన కంపెనీలు తట్టుకోలేవని, మరీ ముఖ్యంగా పరస్పర సుంకాల ప్రభావం జనరిక్ మందులపై పడుతుందని.. మన ఫార్మా కంపెనీ లాభాలు తగ్గిపోతాయని, పెట్టిన పెట్టుబడులు వృథా అవుతాయని ఆయన పేర్కొన్నారు. ఈ పరిణామాల వల్ల లక్షలాది మంది ఉద్యోగాలు పోవడమే కాక, మన విదేశీ నిల్వలపైన కూడా ప్రభావం పడుతుందని హెచ్చరించారు. కాబట్టి ప్రభుత్వం ఈ విషయంలో అత్యంత జాగరూకతతో వ్యవహరించాలని, ఫార్మా రంగ ప్రయోజనాలను కాపాడే చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ వ్యవహారాన్ని సానుకూలంగా పరిష్కరించుకోవడానికి అమెరికాతో దౌత్యచర్యలు జరపాలని.. అమెరికాతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడానికి ప్రాధాన్యమివ్వాలని అన్నారు.
ఇవి కూడా చదవండి:
Yogi Adityanath: యోగి విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
కొబ్బరి నీళ్ల కంటే.. మంచి నీళ్లు మేలు.. డాక్టరేంటి ఇలా అన్నాడు..