Election Results 2023 : మూడు రాష్ట్రాల్లో కౌంటింగ్ సగం పూర్తయ్యే సరికి బీజేపీ పరిస్థితి...
ABN , First Publish Date - 2023-03-02T13:44:09+05:30 IST
త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల ఫలితాల సరళినిబట్టి ఈ మూడు రాష్ట్రాల్లో ఏర్పడబోయే నూతన ప్రభుత్వాల్లో
న్యూఢిల్లీ : త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల ఫలితాల సరళినిబట్టి ఈ మూడు రాష్ట్రాల్లో ఏర్పడబోయే నూతన ప్రభుత్వాల్లో బీజేపీ ఉండే అవకాశం కనిపిస్తోంది. నాగాలాండ్‌లో బీజేపీ కూటమి భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. మేఘాలయలో ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్‌పీపీతో చర్చలు జరుపుతోంది. త్రిపురలో బీజేపీ కూటమి సగానికి పైగా స్థానాల్లో ముందంజలో కనిపిస్తోంది.
కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఓ టీవీ చానల్‌తో మాట్లాడుతూ, ఈ ఎన్నికలు బీజేపీకి సకారాత్మకమైనవి (Positive) అని వ్యాఖ్యానించారు. ఈశాన్య రాష్ట్రాల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభంజనాన్ని ఎవరూ నిరాకరించలేరని చెప్పారు. ఈశాన్య రాష్ట్రాలు అభివృద్ధి వెలుగులను చూస్తున్నాయన్నారు. మేఘాలయలో ఎన్‌పీపీతో పొత్తు అవకాశాలను తోసిపుచ్చలేమన్నారు.
మరోవైపు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురువారం సాయంత్రం 7.30 గంటలకు బీజేపీ ప్రధాన కార్యాలయంలో విజయోత్సవ ప్రసంగం చేయబోతున్నారు.
గురువారం మధ్యాహ్నం 1:25 గంటలకు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, త్రిపురలో బీజేపీ కూటమి 30, వామపక్ష కూటమి 16, తిప్ర మోత పార్టీ 12 స్థానాల్లోనూ, ఇతరులు ఒక స్థానంలోనూ ముందంజలో ఉన్నారు. ఈ రాష్ట్రంలో 60 శాసన సభ నియోజకవర్గాలు ఉన్నాయి. కనీసం 31 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు. బీజేపీ 30 స్థానాల్లో ఆధిక్యంలో ఉంటూ, మరో రెండు స్థానాల్లో విజయం సాధించినట్లు తెలుస్తోంది.
నాగాలాండ్‌లో బీజేపీ కూటమి 10 స్థానాలను గెలుచుకుని, మరో 30 స్థానాల్లో ముందంజలో ఉంది. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ఖాతా తెరవలేదు. ఎన్‌పీఎఫ్ 3 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అదేవిధంగా ఎన్‌సీపీ 4, ఇతరులు 10 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఇతరులు ముగ్గురు విజయం సాధించారు. ఈ రాష్ట్రంలో 60 శాసన సభ నియోజకవర్గాలు ఉన్నాయి. కనీసం 31 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు.
మేఘాలయలో బీజేపీ 5 స్థానాల్లో ముందంజలో కనిపిస్తోంది. కాంగ్రెస్ కూడా ఐదింటిలో ఆధిక్యంలో ఉంది. ఎన్‌పీపీ 23 స్థానాల్లో ముందంజలో ఉంటూ, మూడు స్ఠానాల్లో విజయ బావుటాను ఎగురవేసింది. టీఎంసీ కూడా ఐదింటిలో ఆధిక్యతను ప్రదర్శిస్తోంది. ఇతరులు ఒకరు విజయం సాధించగా, 17 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. ఈ రాష్ట్రంలో 60 శాసన సభ నియోజకవర్గాలు ఉన్నాయి. కనీసం 31 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు.
త్రిపురలో ప్రభుత్వ ఏర్పాటుకు 31 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. షెడ్యూల్డు తెగలకు కేటాయించిన 20 స్థానాల్లో తిప్ర మోత పార్టీ అభ్యర్థులు ప్రారంభంలో 12 స్థానాల్లో ఆధిక్యంలో ఉండేవారు. దీంతో అధికార బీజేపీ, వామపక్ష-కాంగ్రెస్ కూటమిని ఈ పార్టీ దెబ్బతీయగలిగింది. ఈ నేపథ్యంలో త్రిపురలో తదుపరి ప్రభుత్వ ఏర్పాటులో ఈ పార్టీ కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని విశ్లేషకులు చెప్తున్నారు. వామపక్ష పార్టీల నేతలు ఇప్పటికే తిప్ర మోత పార్టీ నాయకత్వంతో మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది. పరిస్థితులు అనుకూలిస్తే సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మద్దతివ్వాలని కోరుతున్నట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి :
Tripura Election Result 2023: తిప్ర మోత పార్టీ లేకుండా త్రిపురలో ప్రభుత్వ ఏర్పాటు సాధ్యమేనా?