Gali Janardhan Reddy : ఎదురు ‘గాలి’
ABN , First Publish Date - 2023-05-14T03:54:43+05:30 IST
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో మైనింగ్ దిగ్గజం గాలి జనార్దన్ రెడ్డి కొత్తగా స్థాపించిన కల్యాణ రాజ్య ప్రగతి పక్ష(కేఆర్‌పీపీ) పార్టీ ఒక్క నియోజకవర్గంలో మాత్రమే విజయం సాధించింది.
జనార్దన్‌రెడ్డి మినహా పార్టీలో అంతా ఓటమి
బళ్లారి, మే 13: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో మైనింగ్ దిగ్గజం గాలి జనార్దన్ రెడ్డి కొత్తగా స్థాపించిన కల్యాణ రాజ్య ప్రగతి పక్ష(కేఆర్‌పీపీ) పార్టీ ఒక్క నియోజకవర్గంలో మాత్రమే విజయం సాధించింది. అయితే, కష్టకాలంలో తనను ఆదుకోని బీజేపీని ఓడించడంలో మాత్రం ఆయన సఫలమయ్యారు. మాజీ మంత్రిగానూ బీజేపీలో ఒక వెలుగు వెలిగిన ఆయన ఆ పార్టీని ఓడిస్తానని ప్రతిన బూని తాజా అసెంబ్లీ ఎన్నికల ముందే(గత ఏడాది డిసెంబరులో) సొంత పార్టీని స్థాపించారు. కేఆర్‌పీపీ పార్టీ తరఫున 47 మంది అభ్యర్థులను బరిలో నిలిపారు. అయితే గాలి జనార్దన్ రెడ్డి మినహా ఆ పార్టీలో మరెవ్వరూ విజయం సాధించలేదు. కానీ, బళ్లారి ప్రాంతంలో బీజేపీ ఓట్లు చీల్చి, కాంగ్రెస్ ఓటమికి పరోక్షంగా ఆయన పార్టీ సహకరించినట్లైంది. జనార్దన్ రెడ్డి కుటుంబానికి కంచు కోట లాంటి ఈ ప్రాంతంలో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. మైనింగ్ కుంభకోణాల్లో నిందితుడిగా ఉన్న గాలి జనార్దన్ రెడ్డి బళ్లారి జిల్లాలోకి ప్రవేశించకుండా నిషేధం ఉన్న నేపథ్యంలో ఆయన కొప్పల్ జిల్లాలోని గంగావతి నియోజ కవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. బళ్లారి పట్టణ నియోజకవర్గంలో జనార్దన్‌రెడ్డి భార్య అరుణ కేఆర్‌పీపీ తరఫున పోటీ చేయగా, బీజేపీ అభ్యర్థిగా జనార్దన్‌రెడ్డి సోదరుడు సోమశేఖరరెడ్డి బరిలో నిలిచారు. అయితే, ఈ ఇద్దరినీ కాదని కాంగ్రెస్ అభ్యర్థి నారా భరత్‌రెడ్డిని ఓటర్లు గెలిపించారు.