Ravishankar Prasad: రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన బీజేపీ.. ఏమన్నదంటే..

ABN , First Publish Date - 2023-03-25T15:08:57+05:30 IST

లోక్‌సభ సెక్రటేరియట్‌ విధించిన అనర్హత వేటుపై మీడియా సమావేశంలో కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పందించిన తీరుపై బీజేపీ..

Ravishankar Prasad: రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన బీజేపీ.. ఏమన్నదంటే..

న్యూఢిల్లీ: లోక్‌సభ సెక్రటేరియట్‌ విధించిన అనర్హత వేటు (Disqualification)పై మీడియా సమావేశంలో కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) స్పందించిన తీరుపై బీజేపీ ఘాటుగా స్పందించింది. ''విమర్శించే హక్కు మీకు ఉంది. అవమానించే హక్కు లేదు. రాహుల్ గాంధీ ఉద్దేశపూర్వకంగా వెనుకబడిన తరగతుల వారిని అవమానించారు'' అని బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్ శనివారంనాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ అన్నారు.

రాహుల్ గాంధీ మీడియా ముందు తప్పుడు స్టేట్‌మెంట్లు ఇచ్చారని, అసలు సబ్జె్క్ట్‌పై మాట్లాడదలేదని అన్నారు. 2019లో చేసిన ప్రసంగంపైనే ఆయనకు శిక్ష పడిందని చెప్పారు. తాను ఆలోచించే మాట్లాడతానని రాహుల్ ఇవాళ చెప్పారని, దాని అర్ధం 2019లో ఆయన ఉద్దేశపూర్వకంగా మాట్లాడినట్టు కాదా? అని రవిశంకర్ ప్రసాద్ నిలదీశారు. లండన్‌లో తానేమీ చెప్పలేదంటూ మరోసారి రాహుల్ అబద్ధాలు ఆడారని అన్నారు. ఇండియాలో ప్రజాస్వామ్యం బలహీనంగా ఉందని, యూరోపియన్ దేశాలు దానిపై దృష్టి సారించడం లేదని రాహుల్ లండన్‌లో వ్యాఖ్యానించారని, అబద్ధాలు ఆడటం రాహుల్ నైజమని ఆయన విమర్శించారు. తనపై గూఢచర్యానికి కేంద్రం పెగాసస్ వాడిందని రాహుల్ చెబుతారని, సుప్రీంకోర్టు అడిగినప్పుడు ఆయన తన ఫోన్ ఎందుకు చెక్ చేయించుకోలేదని నిలదీశారు. ఆయన భయపడుతుండటమే అందుకు కారణమని రవిశంకర్ ప్రసాద్ కౌంటర్ ఇచ్చారు.

దీనికి ముందు రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడుతూ, లోక్‌సభకు తనను శాశ్వతంగా అనర్హుడిని చేసినా, జైలుకు పంపినా తాను భయపడేది లేదని అన్నారు. దేశం కోసం, సత్యం కోసం తాను పోరాటం సాగిస్తూనే ఉంటానన్నారు. అదానీపై తన తదుపరి ప్రసంగానికి ప్రధాని భయపడటమే తనను అనర్హుడిగా ప్రకటించడానికి కారణమని, ఆ భయం మోదీ కళ్లలో చూశానని అన్నారు.

సూరత్ కోర్టు తీర్పు నేపథ్యంలో...

కర్ణాటకలోని కోలార్‌లో ''దొంగలందరికీ మోదీ అనే ఇంటిపేరే ఎందుకు ఉంటుందో'' అని లోక్‌సభ ఎన్నికల సందర్భంగా రాహుల్ వ్యాఖ్యానించారంటూ గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ 2019లో సూరత్ న్యాయస్థానంలో పరువునష్టం దావా వేశారు. నాలుగేళ్ల తర్వాత గురువారం న్యాయస్థానం రాహుల్ గాంధీకి రెండేళ్ల పాటు జైలు శిక్ష విధించింది. రాహుల్ అభ్యర్థన మేరకు వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసింది. ఉన్నత న్యాయస్థానంలో అప్పీల్ చేసుకునేందుకు 30 రోజుల సమయం కూడా ఇచ్చింది. తీర్పు వెలువడిన కొద్ది గంటలకే రాహుల్‌పై లోక్‌సభ సచివాలయం అనర్హత వేటు వేసింది. ఏదైనా కేసులో జైలు శిక్ష పడిన వారికి ప్రజాప్రతినిధిగా కొనసాగే అవకాశం ఉండదంటూ ప్రజాప్రాతినిధ్య చట్టంలో చేసిన మార్పులకు అనుగుణఁగా లోక్‌సభ సచివాలయం ఈ నిర్ణయం తీసుకుంది.

Updated Date - 2023-03-25T15:14:59+05:30 IST